ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ‘చాట్‌జీపీటీ’ పరిష్కారం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ‘చాట్‌జీపీటీ’ పరిష్కారం

రోజురోజుకూ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో రీసెంట్ డేస్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు చాట్ జీపీటీ. రోజుకో వార్తతో ట్రెండింగ్ లో నిలుస్తోన్న చాట్ జీపీటీ.. తాజాగా ఇచ్చిన ఓ సమాధానం వైరల్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించిన రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న సైనిక చర్యను ఆపేందుకు పరిష్కారాన్ని తెలియజేసింది. భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వికాస్‌ స్వరూప్‌ అడిగిన ప్రశ్న మేరకు.. చాట్ బోట్ సుధీర సమాధానమిచ్చింది

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో మధ్యవర్తిత్వ ప్రణాళికను సూచించాలని వికాస్‌ స్వరూప్‌ చాట్‌బోట్‌ను అడగగా.. 8 పాయింట్లలో ‘సాధ్యమయ్యే’ పరిష్కార మార్గాలను సూచించింది. ‘‘ఉక్రెయిన్‌, రష్యా మధ్య ఘర్షణలు చాలా క్లిష్టమైనవి, సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నవి. దీనిపై ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం కాస్త సవాలుతో కూడుకున్నదే. చర్చలు, కాల్పుల విరమణ, అధికార వికేంద్రీకరణ, ఇరు దేశాలు ఒప్పందాలను పాటించడంపై అంతర్జాతీయ పర్యవేక్షణ, ఆర్థిక సహకారం, ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని గుర్తించడం, సంస్కృతి-సంప్రదాయాల పరిరక్షణ, సైనిక బలగాల ఉపసంహరణ: ఈ ఎనిమిది అంశాలను పాటిస్తే యుద్ధానికి పరిష్కారం లభించే అవకాశముంది’’ అని చాట్‌జీపీటీ సమాధానమిచ్చింది. చాట్ బోట్ పై వచ్చిన ఈ జవాబును వికాస్‌ స్వరూప్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శశి థరూర్ ఏమన్నారంటే...

చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్ పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ సైతం స్పందించారు. వికాస్‌ స్వరూప్‌ చొరవ ఆసక్తికరమైనదే. కానీ, ఆ ఇరు దేశాధినేతలు(పుతిన్‌, జెలెన్‌స్కీని ఉద్దేశిస్తూ).. కృత్రిమ మేధ అంచనాలకు మించి ప్రవర్తించేవారు. ఈ ప్రత్యేక కేసులో (యుద్ధం గురించి).. చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానంపై ఇరు దేశాల నుంచి అభ్యంతరాలు రావొచ్చు. ముఖ్యంగా రష్యన్ల నుంచి. అయితే ఇదే గొప్ప ప్రయత్నం అని థరూర్‌ రాసుకొచ్చారు.