అన్నాడీఎంకే.. శశికళ చేతికొస్తదా?

అన్నాడీఎంకే.. శశికళ చేతికొస్తదా?


ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనూహ్యంగా రాజకీయ సన్యాసం తీసుకోవడం ద్వారా అప్పటి అధికార పక్షం అన్నాడీఎంకేకు భారీ ఉపశమనం కలిగించారు శశికళ. కానీ ఇప్పుడామె తిరిగి రాజకీయంగా క్రియాశీల పాత్ర వహించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆమె ఎత్తుగడలు సహజంగానే ప్రస్తుతం ఆ పార్టీలో నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరిస్తున్న మాజీ సీఎం, ప్రతిపక్ష నేత ఎడిప్పాడి పళనిసామి నాయకత్వానికి సవాల్ గా మారుతోంది. పళనిసామికి, మరో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సమన్వయకర్త పన్నీర్​సెల్వంకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరును శశికళ బలమైన ఆయుధంగా వాడుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఎన్నికలకు ముందే జైలు నుంచి విడుదల

అక్రమాస్తుల కేసులో నాలుగేండ్ల జైలుశిక్షను అనుభవించి, అసెంబ్లీ ఎన్నికల ముందే జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వస్తూ భారీ స్వాగత ఏర్పాటు చేసుకున్న ఆమె.. రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర వహిస్తున్నట్లు ప్రకటించడం అప్పటి అధికార పక్షంలో అలజడి రేపింది. అయితే డీఎంకే వ్యతిరేక ఓట్లలో చీలిక రాకుండా నివారించడానికి బీజేపీ నాయకత్వం మంత్రాంగం ఫలితంగా ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించవలసి వచ్చింది. ఆ ప్రకటన అప్పటి వరకే అని, మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించడానికి రెడీ అవుతున్నట్లు ఇప్పటికే ఆమె స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేసి మద్దతుదారులతో సమాలోచనలు జరిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

పళనిసామినే శత్రువుగా చూస్తున్నరు

అన్నాడీఎంకే గత ఎన్నికల్లో గెలిచి, తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే పళనిసామి మరింత బలమైన నాయకుడిగా ఎదిగే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో మరో ఐదేండ్లపాటు పార్టీని నడపడం ఆయనకు సాధ్యం కాకపోవచ్చని ఆమె అంచనా వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈలోగానే పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకోగలననే ధీమాతో ఆమె ఉన్నట్లు మద్దతుదారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలతో గల పరిచయాలతోపాటు అపారమైన ఆర్థిక వనరులే ఆమె ప్రధాన పెట్టుబడిగా ఉన్నాయి. రాజకీయ సన్యాసం తీసుకొంటున్నట్లు ప్రకటించే సమయంలో తమ ప్రధాన శత్రువు డీఎంకే అని, ఆ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు అన్నాడీఎంకే కార్యకర్తలు ఏకం కావాలని శశికళ పిలుపు ఇచ్చారు. అయితే ఇప్పుడామె తన ప్రధాన శత్రువుగా పళనిసామిని పరిగణిస్తున్నట్లు కనిపిస్తున్నది. 

పళనిసామి, పన్నీర్​సెల్వం మధ్య పెరిగిన దూరం

బీజేపీ జోక్యంతో గతంలో ఒక్కటై, నాలుగేండ్లు ప్రభుత్వం పడిపోకుండా నడిపిన పళనిసామి, పన్నీర్​సెల్వం ఇప్పుడు ఎడముఖం, పెడముఖంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలపై, పార్టీ నేతలపై పళనిసామి మంచి పట్టు సాధించారు. దానితో ప్రతిపక్ష నేతగా ఆయనే ఎన్నికయ్యారు. ఆయన ఆధిపత్యం పట్ల పన్నీర్​సెల్వం అసహనంగా ఉన్నారు. వాస్తవానికి పన్నీర్​సెల్వం మొదట్లోనే బీజేపీ అండతో, ముఖ్యమంత్రిగా తనకు వ్యతిరేకంగా వ్యవహరించడంపై శశికళ  ఆగ్రహంగా ఉండేవారు. అయితే ఎమ్మెల్యేలను సమీకరించుకొని, పన్నీర్​సెల్వంను దించివేసి తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోయే సమయంలో ఆమె జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఆ సమయంలో తన మనిషిగా పళనిసామిని ఆమె ముఖ్యమంత్రిని చేశారు. కానీ, శశికళ జైలుకు వెళ్లగానే ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దినకరన్ ను డిప్యూటీ కార్యదర్శిగా తొలగించడమే కాకుండా, పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. అందుకనే ఆమె పళనిసామి పట్ల ఆగ్రహంతో ఉన్నారు. అసంతృప్తిగా ఉన్న పన్నీర్​సెల్వంను దగ్గరకు తీసి పళనిసామిని దెబ్బతీయడానికి ఆమె ఎత్తుగడలు వేస్తున్నట్లు చెబుతున్నారు.

శశికళకు దగ్గరవుతున్న పన్నీర్​సెల్వం

పశ్చిమ జిల్లాల్లో బలమైన ప్రాబల్యం గల గౌండర్ సామాజిక వర్గానికి చెందిన పళనిసామి మొన్నటి ఎన్నికల్లో ఒక విధంగా కులం ప్రాతిపదికన ప్రచారం చేశారు. దాని ఫలితంగా ఆ ప్రాంతంలో ఆయన ఎక్కువ సీట్లు గెల్చుకోగలిగినా, తూర్పు, దక్షిణ జిల్లాల్లో బలమైన ప్రాబల్యం గల ముక్కులతోర్ సామాజిక వర్గం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దాంతో అక్కడ చాలా తక్కువగా సీట్లు వచ్చాయి. శశికళ, పన్నీర్​ సెల్వం ముక్కులతోర్ సామాజిక వర్గానికి చెందిన వారే. పళనిసామి పట్ల ఇతర సామాజిక వర్గాల్లో ఉన్న విముఖత తమకు కలిసి వస్తుందని ఆమె అంచనా వేస్తున్నారు. దినకరన్ ను పార్టీలో చేర్చుకోవడానికి పళనిసామి నిరాకరించడం వల్లే పార్టీ 40 సీట్లను కోల్పోవలసి వచ్చిందని పన్నీర్​సెల్వం నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల పన్నీర్​సెల్వం వ్యవహారశైలి చూస్తుంటే పళనిసామిని దోషిగా చేయడం ద్వారా శశికళ మద్దతు కూడదీసుకునే ఎత్తుగడ వేస్తున్నట్లు కనిపిస్తున్నది. 

త్వరలో పార్టీ సంస్థాగత ఎన్నికలు

2019 నుంచి అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు జరగలేదు. మొదట కరోనా, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు పెట్టలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే లోపుగానే సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయడం ద్వారా పార్టీపై అదుపు సాధించాలని పన్నీర్​సెల్వం ఎత్తుగడ వేస్తున్నారు. అందుకోసం పార్టీలో క్షేత్రస్థాయిలో మద్దతు కూడదీసుకునే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు. అక్టోబర్ లో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. రాబోయే నాలుగు నెలల్లో జరగబోయే రాజకీయ పరిణామాలు అన్నాడీఎంకే భవిష్యత్ ను నిర్దేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ శశికళ సిటీ సివిల్ కోర్ట్ లో వేసిన దావా ఇంకా విచారణకు రాలేదు. ఈ దావాపై ఒక నిర్ణయం తీసుకోకుండా సంస్థాగత ఎన్నికలు జరపరాదని ఆమె కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.

డీఎంకే మరింత బలపడే చాన్స్

తమిళనాడును అర్థశతాబ్దికిపైగా శాసించిన రెండు పార్టీల వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం ద్వారా, తాము బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని కాంగ్రెస్ తోపాటు చాలా పార్టీలు ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. కానీ, అన్నాడీఎంకేలో ఇప్పుడు మొదలైన కలకలం వల్ల రాజకీయంగా ఎక్కువగా నష్టపోయేది ఆ పార్టీయే. మరోవైపు ఇప్పటికే తన పరిధిని విస్తరింపచేసుకుంటున్న డీఎంకే మరింత బలం పుంజుకుని అజేయ శక్తిగా నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి. రెండు ద్రవిడ పార్టీలతో పాటు మరికొన్ని జాతీయ, ద్రవిడ, తమిళ జాతీయవాద పక్షాలు నిలదొక్కుకునే అవకాశాలు కూడా ఉంటాయి.

పార్టీపై పట్టు సాధించడంపైనే కన్ను

ప్రస్తుతం శశికళ దృష్టి అంతా అన్నాడీఎంకేపై పట్టు సాధించడంపైనే ఉంది. అయితే ఆమె పార్టీలోకి వస్తే తన ఉనికి ప్రశ్నార్థకం కాగలదని ఎన్నికలకు ముందు పళనిసామి ఆందోళన చెందారు. ముందుగా అన్నాడీఎంకేలో చేరడానికి ఆమె స్పష్టమైన సంకేతం పంపారు. అది సాధ్యం కాదని గ్రహించి తన మేనల్లుడు దినకరన్​ నేతృత్వంలో ఏర్పాటైన అమ్మ మక్కల్ మునేట్ర కజగం(ఏఎంఎంకే)లో చేరి తృతీయ కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. బీజేపీ ఒత్తిడుల ఫలితంగా ఆమె మౌనంగా ఉండవలసి వచ్చింది. ఎలాగూ గత ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేకపోవడంతో ఆమె రాజకీయ సన్యాసానికి అంగీకారం తెలిపారు. ఇప్పుడు 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా క్రియాశీలకంగా వ్యవహరించడానికి ఇప్పటి నుంచే శశికళ పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. 
పార్టీ నేతలతో టచ్​లో ఉన్న శశికళ
కొద్దిరోజుల క్రితం శశికళ కొంత మంది నేతలతో ఫోన్‌లో మాట్లాడినట్టు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది.  ‘‘మీరు ఆందోళన పడకండి.. ధైర్యంగా ఉండండి.. కరోనా ముగిసిన తర్వాత వస్తాను’’ అని ఓ అన్నాడీఎంకే నేతతో ఫోన్ లో మాట్లాడినట్లు క్లిప్పింగ్ బైటకు వచ్చింది. దానికి సమాధానంగా ఆ నేత ‘‘అమ్మ మేమంతా మీ వెంట ఉంటాం’’ అంటూ భరోసా ఇచ్చారు. అన్నాడీఎంకే నుంచి తనను వేరుచేయలేరంటూ మరో నేతతో ఆమె మాట్లాడిన ఆడియో కూడా బైటకు వచ్చింది. పలువురు అన్నాడీఎంకే నేతలు శశికళ, దినకరన్ కు అందుబాటులో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. అయితే, అన్నాడీఎంకే నేతలతో శశికళ మాట్లాడలేదని, ఏఎంఎంకే కార్యకర్తలతోనే మాట్లాడారని పళనిసామి కొట్టిపారేశారు. శశికళ తిరిగి అన్నాడీఎంకేలోకి రావడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూనే, ఆమె పార్టీలో కలకలం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పార్టీ డిప్యూటీ కోఆర్డినేటర్ మునుస్వామి చెప్పడం ద్వారా పళనిసామి శిబిరంలో ఆందోళనను బహిర్గతం చేసినట్లు అయింది. 
- చలసాని నరేంద్ర,
పొలిటికల్​ ఎనలిస్ట్