పాత పెన్షన్ స్కీమ్ మళ్లీ తెస్తం : ప్రియాంకా గాంధీ

పాత పెన్షన్  స్కీమ్ మళ్లీ తెస్తం :  ప్రియాంకా గాంధీ

మధ్యప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అధికారం అప్పగిస్తే పాత పెన్షన్  స్కీమ్​ను మళ్లీ తెస్తామని కాంగ్రెస్  పార్టీ జనరల్  సెక్రటరీ ప్రియాంకా గాంధీ అన్నారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్  ఇస్తామన్నారు.

మధ్యప్రదేశ్​లో ‘జన్  ఆక్రోశ్’ ర్యాలీలో ప్రియాంకా గాంధీ హామీ

గ్వాలియర్: మధ్యప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అధికారం అప్పగిస్తే పాత పెన్షన్  స్కీంను మళ్లీ తెస్తామని కాంగ్రెస్  పార్టీ జనరల్  సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ప్రతి ఇంటికీ రూ.500కే వంట గ్యాస్ సిలిండర్  ఇస్తామని, వంద యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్  అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు రూ.1500 చొప్పున సాయం చేస్తామని, రైతుల రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం గ్వాలియర్​లో నిర్వహించిన ‘జన్  ఆక్రోశ్’ ర్యాలీలో ప్రియాంక మాట్లాడారు. 

ఈ సందర్భంగా కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై ఆమె తీవ్రంగా విమర్శలు చేశారు. గత రెండు నెలలుగా హింసతో మణిపూర్  అట్టుడుకుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపలేదని, 77 రోజుల తర్వాత ఆయన స్పందించారని మండిపడ్డారు. ఆలస్యంగా స్పందించడంతో పాటు అల్లర్ల విషయాన్ని ప్రధాని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. మణిపూర్  హింసపై ప్రతిపక్షాలు, అధికార పార్టీ లీడర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండడంతో అసలు విషయం మరుగునపడిపోతున్నదని ఆమె వాపోయారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి మణిపూర్ లో శాంతిభద్రతలను పునరుద్ధరించాలని ప్రియాంకా గాంధీ డిమాండ్   చేశారు.