రెండో విడతలో 2,482 యూనిట్ల గొర్రెల పంపిణీ : పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ​వెల్లడి

రెండో విడతలో 2,482 యూనిట్ల గొర్రెల పంపిణీ : పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ​వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: రెండో విడత గొర్రెల పంపిణీలో 2,482 యూనిట్లు అందించామని షీప్‌‌ ఫెడరేషన్‌‌ ఎండీ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ​రాంచందర్ తెలిపారు. ‘వెలుగు’ పత్రికలో మంగళవారం పబ్లిష్ ​అయిన కథనంపై స్పందిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో విడత స్కీమ్​ అమలు కోసం అవసరమైన రూ.6,125 కోట్ల నిధుల కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌‌సీడీసీ)కి ప్రతిపాదనలు పంపించామని పేర్కొన్నారు. 

లోన్‌‌ ఇచ్చేందుకు 2022 జూన్​లో ఎన్‌‌సీడీసీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందన్నారు. ఈ నిధులు ఇంకా విడుదల చేయాల్సి ఉందన్నారు. ఎన్‌‌సీడీసీ సంస్థ నిధుల విడుదలలో జాప్యం చేసినా, ప్రభుత్వం కూడా మే నెలలో జరిగిన కేబినెట్‌‌ సమావేశంలో రూ.వెయ్యి కోట్ల విడుదలకు అనుమతించిందని తెలిపారు. రూ.500 కోట్లకు అడ్మినిస్ట్రేషన్‌‌ శాంక్షన్‌‌ ఇచ్చిందని తెలిపారు. రెండో విడత కోసం నిధుల కొరత లేదనీ, ఎప్పటికప్పడు అవసరమైన నిధుల విడుదల రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.