గొర్రెల స్కీమ్‌‌లో రూ.700 కోట్లు ఏమైనయ్?

గొర్రెల స్కీమ్‌‌లో రూ.700 కోట్లు ఏమైనయ్?
  •     గోల్‌‌మాల్‌‌ అయిన నిధులపై ఏసీబీ దర్యాప్తు 
  •     ఏసీబీ కస్టడీలో మాజీ సీఈఓ రాంచందర్‌‌‌‌, 
  •     మాజీ మంత్రి తలసాని ఓఎస్డీని కల్యాణ్‌‌
  •      మూడు రోజులు ప్రశ్నించనున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: గొర్రెల పంపిణీ స్కీమ్‌‌ కుంభకోణంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్‌‌ రాంచందర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌ ఓఎస్డీ గుండమరాజు కల్యాణ్‌‌ కుమార్​ను సోమవారం అధికారులు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు విచారించనున్నారు. 

మొదటి రోజు కస్టడీ విచారణలో భాగంగా చంచల్‌‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌‌లోని ఏసీబీ హెడ్‌‌ క్వార్టర్స్‌‌కి తరలించారు. సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించారు. ప్రధానంగా రూ.700 కోట్లు ప్రభుత్వ నిధులు గోల్‌‌మాల్‌‌ కావడంపైనే ఏసీబీ దృష్టి సారించింది. నిధుల దుర్వినియోగం వెనుక ఉన్న రాజకీయ నేతలు, ప్రైవేట్‌‌ వ్యక్తుల వివరాలు రాబడుతున్నది.

మాజీ సీఈఓ, ఓఎస్‌‌డీ గుట్టువిప్పేనా?

గొర్రెల పంపిణీ స్కీమ్‌‌లో రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు అధికారులు, బినామీలతో పాటు సీఈవో రాంచందర్‌‌‌‌, ఓఎస్డీ కల్యాణ్ కుమార్‌‌‌‌ను ఈ నెల1న అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ అధికారులు విచారించారు. 

ప్రధానంగా మాజీ సీఈవో రాంచందర్, ఓఎస్డీ కల్యాణ్‌‌కుమార్‌‌‌‌ నిర్వహించిన విధుల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. గొర్రెల పంపిణీ స్కీమ్‌‌లో విధివిధానాలు, గొర్రెల కొనుగోళ్లు, కాంట్రాక్టర్స్‌‌, లబ్ధిదారుల ఎంపిక, నిధులు విడుదలకు సంబంధించిన వివరాలను రాంచందర్‌‌ నుంచి సేకరించిట్లు సమాచారం.

రూల్స్ ప్రకారమే పంపిణీ చేశారా?

స్కీమ్‌‌కు సంబంధించిన జీవోకు అనుగుణంగా పంపిణీ జరిగిందా  లేదా అనేది నిర్ధారించుకునేందుకు రికార్డులను పరిశీలించినట్లు తెలిసింది. రూ.2.10కోట్ల మోసంతో బయటపడ్డ స్కామ్‌‌ ఆధారంగా రూ.700 కోట్లు ఎక్కడికి వెళ్లాయనే వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్ ఓఎస్‌‌డీ కల్యాణ్​ను సుదీర్ఘంగా విచారించారు. ఓఎస్‌‌డీగా బాధ్యతలు చేపట్టక ముందు కల్యాణ్​కుమార్ ఎక్కడెక్కడ విధులు నిర్వహించాడనే కోణంలో ప్రశ్నించారు. 

ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే వివరాలు సేకరించారు. ప్రధానంగా గొర్రెల స్కీమ్‌‌లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు పాల్గొన్నారనే సమాచారంతో కల్యాణ్ కుమార్‌‌‌‌ను విచారిస్తున్నట్లు తెలిసింది.