షేక్ హసీనాకు 21 ఏండ్ల జైలు శిక్ష

షేక్ హసీనాకు 21 ఏండ్ల జైలు శిక్ష
  •     2.1 లక్షల జరిమానా కూడా..
  •     మూడు అవినీతి కేసుల్లో బంగ్లా కోర్టు తీర్పు

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో భారీ షాక్ తగిలింది. ఢాకా సమీపంలోని పుర్బచల్ న్యూ టౌన్ ప్రాజెక్ట్‌‌లో ప్రభుత్వ భూములను చట్టవిరుద్ధంగా కేటాయించిన కేసుతోపాటు మరో రెండు అవినీతి కేసుల్లో ఆమెను బంగ్లాదేశ్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ మూడు కేసుల్లో షేక్ హసీనాకు మొత్తం 21 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. 

ఒక్కో కేసుకు 7 ఏండ్ల చొప్పున మూడు శిక్షలనూ వరుసగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రతి కేసులో 1 లక్ష టాకా (సుమారు రూ.70 వేలు ) జరిమానాను కూడా విధించింది. ఫైన్ చెల్లించకపోతే అదనంగా మరో 18 నెలల జైలు శిక్ష అమలు చేయాలని స్పష్టం చేసింది. 

అలాగే, షేక్ హసీనా కొడుకు సజీబ్ వాజెద్ జాయ్ కు, కుమార్తె సైమా వాజెద్ పుతుల్లకు కూడా పుర్బచల్ భూమి అవినీతి కేసుల్లో ఒక్కొక్కరికి 5 ఏండ్ల జైలు శిక్ష పడింది. దాంతోపాటు1 లక్ష టాకా జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది. మరో 20 మంది మంత్రులు, అధికారులకు 3 నుంచి 7 ఏండ్ల శిక్షలు వేసింది.

అసలు ఏం జరిగిందంటే..

షేక్ హసీనా బంగ్లాదేశ్‌‌లో 15 ఏండ్లు (2009–2024) అధికారంలో ఉన్నారు. ఆ టైంలో ఢాకా సమీపంలో పుర్బచల్ న్యూ టౌన్ అనే భారీ హౌసింగ్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌‌లో ప్రభుత్వ భూముల(సుమారు 3.5 ఎకరాలు = 30 కటా)ను కేటాయించారు. 

ఈ భూములను రూల్స్ బ్రేక్ చేసి తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు హసీనా ప్రభుత్వం కేటాయించింది. తనకు, తన కొడుకు, కూతురు, సోదరి షేక్ రెహానాకు ఇలా ఇష్టమైన వారికి ప్లాట్లు ఇచ్చేశారు.2024 ఆగస్టు 5న హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఈ మోసాన్ని బయటపెట్టి ఆరు అవినీతి కేసులు పెట్టింది. గురువారం ఆ ఆరు కేసుల్లో మొదటి మూడు కేసుల్లో తీర్పు వచ్చింది