సీఎం కొడుకు బర్త్ డే.. రూపాయికే లీటర్ పెట్రోల్

సీఎం కొడుకు బర్త్ డే.. రూపాయికే లీటర్ పెట్రోల్

మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు, రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి ఆదిత్య థాక్రే పుట్టినరోజును ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆదిత్య థాక్రే బర్త్ డే సందర్భంగా.. డోంబివ్లిలోని శివసేన పార్టీ కార్యకర్తలు పెరిగిన ఇంధన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా వినూత్నంగా ఓ కార్యక్రమం చేపట్టారు. డోంబివ్లిలో లీటరు పెట్రోల్ కేవలం రూ .1కే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 1200 మంది వాహనదారులు రూపాయికే లీటరు పెట్రోల్‌ను పోయించుకున్నారు. పెరిగిన పెట్రో ధరలకు వ్యతిరేకంగా శివసేన చేసిన నిరసనగా ఇది గుర్తించబడింది.

ఆదిత్య థాక్రే పుట్టిన రోజు సందర్భంగా.. డోంబివ్లి పరిధిలోని ఎంఐడీసీలోని ఉస్మా పెట్రోల్ పంప్ వద్ద ఆదివారం రూపాయికే పెట్రోల్ పంపిణీని నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమాన్ని డొంబివ్లీకి చెందిన శివసేన కార్పొరేటర్ దీపేశ్ మత్రే, ఆయన భార్య పూజా మత్రే, కల్యాణ్ యువసేన అసెంబ్లీ అధికారి యోగేశ్ మత్రేలు పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెట్రోల్ పంపిణీ చేశారు.

‘ప్రతిరోజూ పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులు ఈ సమస్యను ఎదుర్కొవడానికి సిద్ధంగా లేరు. డోంబివ్లి ప్రజలు ప్రతిరోజూ పనికోసం ముంబైకి ప్రయాణిస్తారు. లాక్‌డౌన్‌తో రైళ్లు నడవకపోవడంతో.. తమ సొంత వాహనాల ద్వారా వెళ్తున్నారు. రోజూ ముంబైకి వెళ్లి రావడానికి మూడు నుంచి నాలుగు లీటర్ల పెట్రోల్ అవసరమవుతుంది. దీని ధర సుమారు 400 రూపాయలు అవుతుంది’ అని శివసేన కార్పొరేటర్ దీపేశ్ మత్రే చెప్పారు.

మొదట ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చేయాలనుకున్నారు. రూపాయికే లీటర్ పెట్రోల్ పంపిణీని మొదట 500 మందికే ఇవ్వాలనుకున్నారు. కానీ, ఈ ఆఫర్ తెలియడంతో.. స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. జనసమూహం పెరగడంతో మరో రెండు గంటలపాటు సమయాన్ని పెంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పంపిణీ చేశారు. దాంతో సుమారు 1200 మంది ప్రజలు ఈ రూపాయి పెట్రోల్ ప్రయోజనాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ముంబైలో లీటరు పెట్రోల్ ధర 102 రూపాయలకు చేరుకుంది.