మహారాష్ట్ర అసెంబ్లీలో ఏం జరగనుంది..?

మహారాష్ట్ర అసెంబ్లీలో ఏం జరగనుంది..?

మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గంట గంటకు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. గురువారం (జూన్ 30న) నిర్వహించే ఫ్లోర్ టెస్టు, ఇతర అంశాలపైనా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. శివసేన నేతల పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఫ్లోర్ టెస్టును సవాల్ చేస్తూ శివసేన నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు గవర్నర్ కోష్యారి మరో లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడిందని తనకు రెండు లేఖలు అందాయని, అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని ఆ లేఖలో సీఎం ఉద్దవ్ ఠాక్రేను కోరారు. 38 మంది ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నట్లు లేఖ అందిందని చెప్పారు. 10 మంది స్వతంత్ర్య ఎమ్మెల్యేలు కూడా తనకు లేఖ రాశారని గవర్నర్ కోష్యారి వివరించారు.

స్వతంత్రుల మద్దతు కూడగట్టే పనిలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బిజీబిజీగా ఉన్నారు. నవనిర్మాణ పార్టీ నేత రాజ్ ఠాక్రేకు ఫడ్నవీస్ ఫోన్ చేశారు. గురువారం(జూన్ 30న) ఫ్లోర్ టెస్టులో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి రాజ్ ఠాక్రే అంగీకరించారు. రేపటి ఫ్లోర్ టెస్టులో బీజేపీకి మద్దతు ఇస్తామని రాజ్ ఠాక్రే చెప్పినట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్, ఎన్సీపీ నేతల కీలక సమావేశం కొనసాగుతోంది. రేపటి వ్యూహాలపై చర్చిస్తున్నారు. నానా పటోలె ఆధ్వర్యంలో సమావేశమైన కాంగ్రెస్ నేతలు తాజా రాజకీయ పరిస్థితులపైనా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో ఉన్నప్పుడు కేబినెట్ సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గౌహాతి హోటల్ లో ఉన్న ఏక్ నాథ్ షిండే వర్గం ఇప్పుడు గోవాకు షిఫ్ట్ అయ్యారు. ఇవాళ గోవాలోనే బస చేయనున్నారు. గోవా నుంచి గురువారం బల నిరూపణ పరీక్షకు ముంబైకి రానున్నారు.  

అసెంబ్లీలో ఏం జరగనుంది..? 
గురువారం అసెంబ్లీలో మహారాష్ట్ర ప్రభుత్వం బలనిరూపణ జరగనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని భగత్‌సింగ్‌ కోశ్యారి తెలిపారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే మెజారిటీ పడిపోయిందంటూ బీజేపీ, ఏక్ నాథ్ షిండే వర్గాలు గవర్నర్ ను ఫ్లోర్ టెస్ట్ చేయాలని కోరాయి. దీంతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ  బల నిరూపణ పరీక్షకు సిద్ధం కావాలంటూ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాశారు. బల నిరూపణ పరీక్షను వీడియోలో రికార్డు చేయాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. బల నిరూపణకు సాయంత్రం 5 గంటల వరకు డెడ్ లైన్ విధించారు గవర్నర్.