శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కంటిన్యూ అవుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వంపై తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఏక్ నాథ్ షిండే తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. పలువురు ఎమ్మెల్యేలు సూరత్, అస్సోంలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. శివసేన (Shiv Sena) ఎమ్మెల్యే నితిన్ దేశ్ ముఖ్ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. తనను కిడ్నాప్ చేసి గుజరాత్ కు తీసుకళ్లారని, ఎలాగో వారి నుంచి తప్పించుకుని ముంబాయికి రావడం జరిగిందన్నారు. తాను ఎప్పటికీ శివ సైనికుడేనని, ఉద్ధవ్ థాక్రేకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు.

నితిన్ దేశ్ ముఖ్ కనిపించడం లేదని ఆయన సతీమణి పోలీసులకు కంప్లైట్ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 20వ తేదీన రాత్రి తన భర్తతో మాట్లాడినట్లు.. తర్వాత ఆయన ఫోన్ స్విచాఫ్ అయిందని పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపారు. ఈ క్రమంలో.. జూన్ 22వ తేదీ బుధవారం ఉదయం ముంబాయికి చేరుకున్నారు నితిన్ దేశ్ ముఖ్. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ఏక్ నాథ్ శిండే తనను తప్పుదోవ పట్టించి.. సూరత్ కు తీసుకెళ్లారని.. అక్కడకు వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసిందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పని చేస్తున్న విషయం తెలిసి ఆశ్చర్యపోయినట్లు వ్యాఖ్యానించారు.

అనంతరం తాను హోటల్ నుంచి బయటకు రాగానే.. దాదాపు 100 నుంచి 150 మంది పోలీసులు వచ్చి తనను బలవంతంగా ఆసుపత్రికి తరలించారన్నారు. తనకు గుండె పోటు వచ్చిందని వారు వెల్లడించారని, కానీ.. ఎలాంటి అనారోగ్యం లేదని వెల్లడించారు. హత్య చేయడానికి కుట్ర కూడా పన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఎలాగొలా వారి నుంచి తప్పించుకుని ముంబాయికి వచ్చానన్నారు. నితిన్ తో పాటు.. మరికొంత మంది వెనక్కి వస్తారని భావిస్తున్నారు. మరోవైపు.. శివసేన పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సాయంత్రం 5 గంటలకు శివసేన ఎమ్మెల్యేలంతా భేటీకి రావాలని.. లేనిపక్షంలో వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. పార్టీని వీడుతున్నారని భావిస్తామని, సభ్యత్వం రద్దు అవుతుందని శివసేన విడుదల చేసిన లేఖలో పేర్కొంది.