జ్యుడీషియల్‌ కస్టడీకి సంజయ్ రౌత్

జ్యుడీషియల్‌ కస్టడీకి సంజయ్ రౌత్

సంజయ్ రౌత్ ను వెంటాడుతున్న పాత్రాచాల్‌ కేసు 

మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో రౌత్ కు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గోరేగావ్‌ శివారులోని పాత్రాచాల్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆగస్టు 1వ తేదీన ఈడీ అధికారులు ఎంపీ సంజయ్‌ రౌత్‌ను అరెస్టు చేశారు. ముందుగా ప్రత్యేక కోర్టు ఈ నెల 4వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అనుమతించగా.. ఆ తర్వాత దాన్ని 8వ తేదీ వరకు పొడిగించింది.

ఎంపీ సంజయ్ రౌత్ కు విధించిన కస్టడీ సోమవారంతో ముగియడంతో ఈడీ అధికారులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో న్యాయస్థానం సంజయ్ రౌత్ ను14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. కస్టడీ సమయంలో ఇంటి భోజనం, మందుల కోసం రౌత్‌ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. అయితే.. ప్రత్యేక బెడ్డును కేటాయించే విషయంలో ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పాత్రాచాల్‌ కేసు దర్యాప్తు  కోసం ఎంపీ సంజయ్‌ రౌత్‌ భార్య వర్షా రౌత్‌కు కూడా ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.