
మరాఠా జాతిని మొఘల్స్ నుంచి విముక్తం చేసిన శివాజీ 1627లో పుట్టాడు. ఆయన పూర్తి పేరు శివాజీ భోంస్లే.1633లో శివాజీ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తన తండ్రి షహాజీ శత్రువైన మహల్దార్ ఖాన్ మొఘల్‌లతో చేరి, అహ్మద్‌నగర్‌ను ముట్టడించాడు. ఆ దాడి సమయంలో శివాజీ తల్లి జిజియాబాయి శత్రువుల చెరలో చిక్కుకుంది.
యుద్ధం సద్దుమణిగాక కొడుకును తల్లికి అప్పగించారు. ఆ తర్వాత తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో శివాజీ తల్లితోపాటే ఉన్నాడు. వాళ్లిద్దరికీ మొఘల్ సేనాని అయిన దాదాజీ ఆశ్రయం కల్పించాడు. శివాజీతోపాటు మరికొంతమంది పిల్లల్ని చదివించాడు. ఆయన దగ్గరే శివాజీ యుద్ధ విద్యాభ్యాసాలు చేశాడు. రామాయణ, భారత కథలు తెలుసుకున్నాడు. 1646లో బిజాపూర్ కొండ దుర్గం అయిన తార్నాను వశపరుచుకున్నాడు.
ఎండాకాలంలో అందమైన ప్రదేశంగా ఉండేది. అక్కడి సైనికాధికారి ఆ సమయంలో కోటను ఖాళీ చేసి కొండ కిందున్న పల్లెటూరికి వచ్చి నవంబర్‌లో తిరిగి వెళ్లే ఆచారం ఏర్పడింది. శివాజీ దీన్ని అవకాశంగా తీసుకుని సైనికాధికారి లేని సమయంలో దాన్ని ఆక్రమించుకుని సైనిక ఆయుధాలను, ఖజానాను దోచుకున్నాడు. ఆ సైనికాధికారి బిజాపూర్‌కు ఫిర్యాదు చేశాడు. కానీ, శివాజీ ఆస్థాన ఉద్యోగులకు తాను దోచుకున్నది లంచంగా ఇచ్చి తనవైపు తిప్పుకున్నాడు.
తర్వాత శివాజీ మొరాదాబాద్ గుట్టను బలోపేతం చేసి దానికి ‘రాజ్‌గఢ్’ అని నామకరణం చేశాడు. మరికొంత కాలానికి ఒకప్పుడు తన తల్లి జిజియాబాయిని బంధించిన ప్రదేశాన్ని సంపాదించుకున్నాడు. దానికి ‘సింహగఢ్’ అని పేరుపెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే తండ్రి షహాజీ శత్రువుల చేతిలో మరణించడంతో ఎంతో బాధపడ్డాడు.
1674 మే 21న ఆయనకు పట్టాభిషేకం జరిగింది. స్వర్ణ తులాభారం చేయించుకుని, తన ఎత్తు బంగారు నాణేలను పట్టాభిషేకం చూడటానికి వచ్చిన బ్రాహ్మణులకు పంచాడు. అప్పటినుంచి చివరి శ్వాస వరకు ఎన్నో విజయాలు చూశాడు.1680 మార్చి 28న ఆయన ఒక ముట్టడి ప్రయత్నం చేసి తిరిగి వచ్చిన తర్వాత ఆయన మోకాలు మీద వాపు వచ్చింది. ఆ వెంటనే జ్వరం రావడంతో వారం రోజులు జబ్బు పడిన ఆయన రాయ్‌గఢ్‌లో 1680లో కన్నుమూశారు.
- మేకల మదన్మోహన్ రావు, కవి, రచయిత-