టీమిండియాకు షోయబ్ అక్తర్ వార్నింగ్...అదే జరిగితే భారత్ పని ఖతమే

టీమిండియాకు షోయబ్ అక్తర్ వార్నింగ్...అదే జరిగితే భారత్ పని ఖతమే

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆటగాళ్లే కాదు మాజీ ప్లేయర్లు కూడా మాటలతో రెచ్చిపోతారు. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు టీమిండియా అంటే కయ్యానికి కాలు దువ్వుతారు. పాకిస్థాన్ కి సపోర్ట్ చేయడం పక్కనుంచితే మన క్రికెట్ జట్టుపై ఎక్కువగా విమర్శలు చేస్తూ ఉంటారు. వీరిలో కొంతమంది సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వారిలో పాకిస్థాన్ మాజీ బౌలర్ రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ ఒకడు. తాజాగా దాయాదుల సమరానికి ముందు పాక్ చేతిలో భారత్ చిత్తవుతుందని జోస్యం చెప్పాడు. ఇంతకీ అక్తర్ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం.
  
టాస్ ఓడితే భారత్ మ్యాచ్ ఓడిపోతుంది:

షోయబ్ అక్తర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో ఫీల్డ్ లో స్లెడ్జింగ్ చేసే ఈ రావల్పిండి పేసర్ ప్రస్తుతం ఆఫ్ ది ఫీల్డ్ లో తన నోటికి పని చెబుతున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ " ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకి కొంత అనుకూలంగా ఉంటుంది. గత రెండు మ్యాచులు చూసుకుంటే రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు తడబడ్డాయి. గత మ్యాచులో స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో  శ్రీలంక జట్టు ఎంత కష్టపడిందో తెలిసిందే. ఒకవేళ పాకిస్తాన్ కనుక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే.. వాళ్లు భారత్‌ను చిత్తు చేస్తారు. అదే సమయంలో భారత్ కనుక టాస్ గెలిస్తే.. పాకిస్తాన్‌కు ట్రబుల్స్ తప్పవు. ఎందుకంటే ఇక్కడ పిచ్ ఇంకా పూర్తిగా సెటిల్ అయినట్లు కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా రెండో ఇన్నింగ్సులో బంతి అంత ఈజీగా బ్యాటుపైకి రావడం లేదు" అని అక్తర్ చెప్పుకొచ్చాడు.


ఈ మ్యాచులో పేసర్లే కీలకం:

ఈ సందర్భంగా మ్యాచ్ కి ముందు అక్తర్ ఇరు జట్లకు ఒక కీలక సలహా ఇచ్చాడు. పేసర్లు గెలుపులో కీలకపాత్ర పోషిస్తారని టీమిండియా కూడా కుల్దీప్ యాదవ్ ని మాత్రమే జట్టులోకి తీసుకొని ముగ్గురు పేసర్లతో బరిలోకి  దిగాలని సూచించాడు. కుల్దీప్ యాదవ్ ని ఖచ్చితంగా తుది జట్టులోకి తీసుకోవాలని గతంలో అతన్ని పక్కన పెట్టి టీమిండియా చాలా టైం వేస్ట్ చేసిందని చెప్పుకొచ్చాడు. బుమ్రా, షమీ, సిరాజ్ తో కూడిన భారత పేస్ చాలా పటిష్టంగా ఉందని భారత పేస్ దళాన్ని కొనియాడాడు.