- బీజేపీలో చేరిన ఇద్దరు మాజీ మంత్రులు, పలువురు నేతలు
జైపూర్: లోక్ సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కటారియా బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు రిచ్ పాల్ మిర్ధా, విజయ్ పాల్ మిర్ధా, ఖిలాడీ బైర్వా, మాజీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అలోక్ బేణివాల్, కాంగ్రెస్ స్టేట్ మాజీ చీఫ్ (సేవా దళ్) సురేశ్ చౌధరి, నేతలు రాంపాల్ శర్మ, రిజు ఝన్ ఝున్ వాలా కూడా బీజేపీలో చేరారు. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, బీజేపీ స్టేట్ చీఫ్ సీపీ జోషి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా లాల్ చంద్ కటారియా మాట్లాడుతూ తన ఆత్మప్రబోధానుసారమే బీజేపీలో చేరానని చెప్పారు. పేదలు, రైతులు, సామాన్యుల బాధలను బీజేపీ అర్థం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టు సమస్య పరిష్కారానికి సీఎం శర్మ కృషి చేశారని తెలిపారు. ఖిలాడీ బైర్వా మాట్లాడుతూ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ పై విమర్శలు గుప్పించారు. ఎస్సీ సామాజికవర్గం వారిని ఆయన తన బానిసలుగా చూసేవారని విమర్శించారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 సీట్లలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని రాజేంద్ర యాదవ్ అన్నారు. కాగా, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గెహ్లాట్ కేబినెట్లో కటారియా, యాదవ్ మంత్రులుగా పనిచేశారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా కటారియా వ్యవహరించారు. గెహ్లాట్ కేబినెట్లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మధ్యాహ్న భోజన పథకంపై అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఈడీ, ఐటీ సంస్థలు ఆయన ఇండ్లు, సంస్థల్లో సోదాలు చేశాయి. ఇక రిచ్ పాల్ మిర్ధా.. కాంగ్రెస్ మాజీ ఎంపీ జ్యోతి మిర్ధాకు బాబాయ్. జ్యోతి కూడా 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.
