సీక్రెట్​ ఆపరేషన్​తో చైనా సైన్యానికి షాక్

సీక్రెట్​ ఆపరేషన్​తో చైనా సైన్యానికి షాక్

లడఖ్​లో సీన్​ మారింది

చైనా సైన్యానికి షాక్.. మన ఆర్మీ ప్లాన్​కు డ్రాగన్​ బోల్తా

కీలక ఏరియాలు మన సైనికుల కంట్రోల్​లో..

దెబ్బకు దిగొచ్చిన పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ

ఆగస్టులో జరిగిన ఆపరేషన్​ వివరాలు వెలుగులోకి..

న్యూఢిల్లీ: బార్డర్​లో లొల్లి లొల్లి జేసిన చైనా కొన్ని రోజుల తర్వాత దూకుడు తగ్గించింది.. యుద్ధానికి సిద్ధమన్నట్లు హడావుడి చేసి చివరకు సల్లవడ్డది. దీనికి మన సైనికుల శక్తియుక్తులతో పాటు ఆగస్టు నెలలో కొంతమంది సైనికుల టీమ్​తో ఆర్మీ నిర్వహించిన సీక్రెట్​ ఆపరేషనే కారణం. రెండు రోజుల పాటు అత్యంత సీక్రెట్​గా చేసిన ఈ ఆపరేషన్​తో ప్యాంగాంగ్​ త్సో నది ఒడ్డున సీన్​ మొత్తం మారిపోయిందట. చైనాను ఇరుకున పెట్టి, బేరసారాలాడే శక్తిని మనకు కట్టబెట్టిన ఈ ఆపరేషన్​ కోసం ఆర్మీ ఉన్నతాధికారులు నెల రోజుల పాటు ప్లాన్​ చేశారట. దానిని పకడ్బందీగా అమలు చేసి, చైనా ఆర్మీతో పాటు ఆ దేశం శాటిలైట్ల కన్నుగప్పి బార్డర్​లోని కీలక ప్రాంతాల్లోకి మన సైనికులు చేరుకున్నరని సైనిక వర్గాల సమాచారం. ఆగస్టులో జరిగిన ఈ ఆపరేషన్​వివరాలను ‘ది ప్రింట్’ ఓ కథనాన్ని ప్రచురించింది.

నెల రోజుల ప్లానింగ్..

లైన్​ ఆఫ్​ యాక్చువల్​ కంట్రోల్(ఎల్ఏసీ)ను దాటి మన భూభాగాన్ని ఆక్రమించేందుకు మొన్నటి మే, జూన్​ నెలల్లో చైనా చేసిన ప్రయత్నాన్ని మన సైనికులు విఫలం చేశారు. జూన్​ 15న బార్డర్​లో రెండు దేశాల సైనికులు కొట్టుకున్నరు. ఈ గొడవలో మన సైనికులు 20 మంది చనిపోగా.. చైనా వైపు కూడా పెద్ద సంఖ్యలోనే ప్రాణ నష్టం జరిగింది. ఈ గొడవ తర్వాత బార్డర్​లో టెన్షన్స్  పెరగిపోయినయ్. చైనా పెద్ద సంఖ్యలో బలగాలను బార్డర్​కు తరలించడంతో మన ఆర్మీ కూడా బలగాలను మోహరించింది. చైనా తీరు చూస్తుంటే వెనక్కి తగ్గేలా కనిపించట్లేదని తేలిపోయింది. డ్రాగన్​ కంట్రీతో చర్చలు జరపడానికి ఓ బార్గెయినింగ్​ పవర్​ను సంపాదించాలని ఢిల్లీ నుంచి ఆర్మీకి సూచనలు అందాయి. దీంతో బార్డర్​ వెంబడి పట్టు పెంచుకునేందుకు ఏర్పాట్లు మొదలైనయ్. ఎల్ఏసీ వెంబడి ఆరేడు ఏరియాలను గుర్తించి, అందులో ఏయే ప్రాంతాలను మన కంట్రోల్​లోకి తెచ్చుకుంటే చైనా దారికొస్తుందనే దిశగా అధికారులు ఆలోచన చేశారు. దాదాపు నెలపాటు ప్లాన్​ చేసి, సీక్రెట్​గా అమలుచేశారు.

బలగాల మోహరింపు..

ఈస్టర్న్​ లడఖ్​లో చైనా దూకుడు నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఆర్మీ జాగ్రత్తలు తీసుకుంది. చైనా సైన్యానికి ధీటుగా దాదాపు 40 వేల అదనపు బలగాలను బార్డర్​కు తరలించింది. వెపన్స్, మందుగుండు సామగ్రి, యుద్ధ ట్యాంకులను మోహరించింది. ఓవైపు ఈ పనులు చేస్తూనే సీక్రెట్​ ఆపరేషన్​ను కొనసాగించింది. ఆగస్టు 29, 30.. రెండు రోజుల్లో వేర్వేరు చోట్లకు చేరిన సైనిక బలగాలను టార్గెట్​మౌంటెయిన్​ పైకి చేర్చింది. ఆయుధాలనూ విజయవంతంగా ప్యాంగ్యాంగ్​ త్సో నది దక్షిణ తీరానికి తరలించింది. అక్కడున్న పర్వతాలలో కైలాశ్​ రేంజ్​ను మన సైనికులు కంట్రోల్​లోకి తెచ్చుకున్నరు. దీంతో చైనా ఆధీనంలోని స్పాంగ్గూర్​ గ్యాప్, మోల్డో గారిసన్​ ఏరియాలపై మనదే పైచేయిగా మారింది. చైనాతో బేరసారాలకు ఇది ఎంతో కీలకంగా మారింది. ఈ ఆపరేషన్ తర్వాత చైనా దూకుడు తగ్గించుకుని, చర్చలకు ముందుకొచ్చింది. బార్డర్​లోని బలగాలను వెనక్కి పిలిపించుకుందామని ప్రతిపాదించింది.

24 గంటల నోటీసు.. ఒక్కటే విమానం..

ఆగస్టు నెల ప్రారంభంలో జస్ట్​ 24 గంటల నోటీసుతో మౌంటెయిన్​ స్ట్రైక్​ కోర్​(ఎంఎస్​సీ) టీమ్​ను ఆర్మీ అధికారులు సిద్ధం చేశారు. పర్సనల్​ వస్తువులు తప్ప ఇతరత్రా వేటినీ తీసుకెళ్లొద్దని సూచించారు. జనరల్​ ఆఫీసర్​ కమాండిగ్, లెఫ్టినెంట్​ జనరల్​ సన్వీత్​ సింగ్​ ఆధ్వర్యంలో వారందరినీ ఒక్కటే విమానంలో లడఖ్​ తరలించారు. బలగాలు, విమానాల కదలికలను చైనా శాటిలైట్ల దృష్టిని ఆకర్షిస్తాయనే ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే చైనా ఆర్మీని తప్పుదోవ పట్టించేందుకు ఇతర ప్రాంతాలపై ఫోకస్​ పెట్టినట్లు షో చేశారు. ఎవరికీ అనుమానం రాని రీతిలో ఎంఎస్​సీ(17 కోర్)కు చెందిన కొద్దిమంది సైనికులతో ఓ టీమ్​ టార్గెట్​ దిశగా బయలుదేరింది. వారి వెంట రెగ్యులర్​ గా ఉండే వెపన్స్​ తప్ప పెద్ద సంఖ్యలో శత్రువులు ఎదురైతే పోరాడేందుకు అవసరమైన ఆయుధాలు లేవు. కానీ అందులోని సైనికులు అందరూ పర్వతాలు ఎక్కడంలో బాగా అనుభవం ఉన్నోళ్లే. ఒకవైపు ఈ టీం టార్గెట్​వైపు సాగుతుంటే.. లెఫ్టినెంట్​ జనరల్​ హరీందర్​ సింగ్​ నేతృత్వంలో ని 14 కోర్​కు చెందిన మరో టీమ్  పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్​ఏ) సైనికుల దృష్టిని తమపైనే కేంద్రీకృతం అయ్యేలా చూసుకుంది.

ఫింగర్​ 4 పైకి మన సైనికులు..

పీఎల్ఏ కంట్రోల్​లో ఉన్న ఫింగర్​ 4  పైనా పట్టు సాధించేందుకు పారా ఎస్ఎఫ్​ టీమ్​ ఒకటి మరో ఆపరేషన్​ చేపట్టింది. చైనా సైన్యం కళ్లుగప్పి పింగర్​ 4 శిఖరంపైకి ఈ టీమ్​ మెంబర్లు చేరుకున్నరు. చైనా సైనికుల క్యాంప్​ క్లియర్​గా కనిపించే ఎత్తుకు చేరుకుని, అక్కడ టెంట్​ వేసుకున్నరు. చైనా క్యాంప్​తో పాటు చుట్టుపక్కల ఏరియాకు సంబంధించి ఫొటోలు తీసుకున్నరు. మన సైడ్​ నుంచి అక్కడికి చేరుకోవడానికి కొత్త మార్గాన్ని వెతికి, బలగాలను, ఆయుధాలను తరలించారు. దీంతో చైనా పూర్తిగా తగ్గిపోవాల్సి వచ్చింది. చైనా సైన్యంతో చర్చల సందర్భంగా లైన్​ ఆఫ్ యాక్చువల్​ కంట్రోల్ వెంట కీలకమైన ఏరియాలు మన కంట్రోల్​లోనే ఉన్నాయని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.

For More News..

రెండేండ్ల దాకా 25 శాతం జనానికి వ్యాక్సిన్ డౌటే!

కేటీఆర్‌‌‌‌ను సీఎం చేయడమే కేసీఆర్‌‌‌‌ లక్ష్యం

కేటీఆర్ ఫాంహౌస్ కేసును లోతుగా విచారించాలె: హైకోర్టు సీజే

ఒక్క కౌన్సిల్ హాల్ కట్టడానికి 11 ఏండ్లు పట్టింది