హైదరాబాద్ లోని ప్రముఖ హోటళ్లపై ఐటీ అధికారుల విచారణ కొనసాగుతోంది.. ఫుడ్ బ్రిడ్జి యజమాని, బీఆర్ఎస్ నేత హర్షద్ అలీ ఖాన్ ను విచారించిన అధికారులు మంగళవారం ( డిసెంబర్ 2 ) పిస్తా హౌస్, షాగౌస్, మెహఫిల్ హోటళ్లలో సోదాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి వైవరాలిలా ఉన్నాయి.. హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించిన అధికారులు భారీగా నగదు, డాక్యుమెంట్స్ గుర్తించారు. అంతే కాకుండా వీరికి లింక్స్ ఉన్న హోటళ్లపై కూడా ఫోకస్ పెట్టారు ఐటీ అధికారులు.
ఈ క్రమంలో ఫుడ్ బ్రిడ్జి యజమాని హర్షద్ అలీఖాన్ ను సోమవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు విచారించారు ఐటీ అధికారులు. పిస్తా హౌస్ సహా ఇతర హోటల్స్ తో ఉన్న సంబంధాలు.. ఆర్థిక లావాదేవీలపై విచారించారు ఐటీ అధికారులు. ఇదిలా ఉండగా.. గత నెలలో పిస్తా హౌస్, షా గౌస్ ఓనర్స్ ఇండ్లలో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు .
నవంబర్ 18న ఈ హోటళ్లకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలతో పాటు ఓనర్ల ఇండ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు ఐటీ అధికారులు. ప్రతి ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్న ఈ హోటల్స్ లావాదేవీలపై తనిఖీలు చేపట్టారు.
రాజేంద్రనగర్ లోని పిస్తా హౌస్ ఓనర్స్ మహమ్మద్ మజీద్ , మహమ్మద్ ముస్తాన్ ఇళ్లల్లో సోదాలు చేపట్టారు ఐటి అధికారులు. రికార్డుల్లో చూపిన ఆదాయానికి, నిజమైన ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. హవాలా, నకిలీ లావాదేవిలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉన్నట్లు ఆరోపణలు ఉండటంతో రైడ్స్ కు దిగిన అధికారులు.. ట్యాక్స్ చెల్లింపులో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు.
