అప్పు తీసుకుంటది.. అడిగితే చంపేస్తది... మొయినాబాద్‌‌ ఫామ్‌‌హౌజ్‌‌లో మహిళల హత్య కేసులో సంచలన విషయాలు

అప్పు తీసుకుంటది.. అడిగితే చంపేస్తది... మొయినాబాద్‌‌ ఫామ్‌‌హౌజ్‌‌లో మహిళల హత్య కేసులో సంచలన విషయాలు
  • అప్పు ఇచ్చిన మరో 13 మంది మర్డర్‌‌కు స్కెచ్‌‌ వేసిన మహిళ
  • కరణ్‌‌కోట పీఎస్‌‌కు వచ్చిన బాధితులు

చేవెళ్ల/తాండూరు, వెలుగు : వికారాబాద్‌‌ జిల్లా మొయినాబాద్‌‌ మండలం తోల్కట్ట శివారులోని ఫామ్‌‌హౌజ్‌‌లో ఇద్దరు మహిళల హత్యకు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితురాలైన, తాండూరు పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కరీంబీ.. అవసరం ఉందని తనకు తెలిసిన మహిళల వద్ద అప్పు తీసుకుంటుంది. తిరిగి డబ్బులు అడిగితే... తన భర్త, మరో వ్యక్తితో కలిసి తోల్కట్ట శివారులోని ఫామ్‌‌హౌజ్‌‌ అడ్డగా మర్డర్‌‌ చేస్తోంది. 

ఈ క్రమంలోనే ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబా బేగం(65), బషీరాబాద్ మండలం కాశీంపూర్‌‌ గ్రామానికి చెందిన అబేదా బేగం(60)ను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరినే కాకుండా.. తనకు అప్పు ఇచ్చిన మరో 13 మంది సైతం మర్డర్‌‌ చేసేందుకు కరీంబీ ప్లాన్‌‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ కాలనీకి చెందిన పలువురు మహిళల వద్ద అప్పు తీసుకున్న కరీంబీ వారిని గతంలో పలుమార్లు ఫామ్‌‌హౌజ్‌‌కు పిలించింది. 

అయితే వేర్వేరు పనుల కారణంగా వారు అక్కడికి వెళ్లలేకపోయారు. ఇద్దరు మహిళల మర్డర్‌‌ విషయం బయటపడడం, కరీంబీని పోలీసులు అరెస్ట్‌‌ చేసిన విషయం తెలుసుకున్న మిగతా మహిళలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కరీంబీకి అప్పు ఇచ్చిన ఎనిమిది మంది మహిళలు సోమవారం తాండూరు రూరల్‌‌ పరిధిలోని కరణ్‌‌కోట పోలీస్‌‌స్టేషన్‌‌కు వెళ్లారు. ‘కరీంబీ నన్ను 13వ తేదీన ఫామ్‌‌హౌజ్‌‌కు పిలిచింది, 12న ఆమెను అరెస్ట్‌‌ చేయడంతో నా పాననం దక్కింది’ అని ఓ మహిళ పోలీసుల ఎదుట కన్నీటిపర్యంతమైంది. 

చాలా మంది మహిళలు తమ భర్తలకు తెలియకుండా కరీంబీకి డబ్బులు ఇచ్చారని, ఇప్పుడు వారు బయటకు రాలేకపోతున్నారన్నారు. కరీంబీ, ఆమె భర్త రహమాన్‌‌తో పాటు వారికి సహకరించిన వ్యక్తి బయటికి వస్తే తమను కూడా చంపేస్తారని, ఈలోగా వారిని ఎన్‌‌కౌంటర్‌‌ చేయాలని కోరారు. కాగా, ఎవరూ భయపడొద్దని, చట్ట ప్రకారం నిందితులను శిక్షిస్తామని తాండూరు రూరల్‌‌ సీఐ ప్రవీణ్‌‌కుమార్‌‌ చెప్పారు. కరీంబీ ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు అప్పు తీసుకుందని, ఇప్పటివరకు 13 మంది వివరాలు బయటకు వచ్చాయన్నారు.