కిట్టి, స్పా పార్టీల పేరుతో దుబారా ఖర్చులు

కిట్టి, స్పా పార్టీల పేరుతో దుబారా ఖర్చులు

ప్రముఖ వ్యాపార వేత్త శిల్ప చౌదరి... ఆమె భర్త తెల్ల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చాలామంది ప్రముఖుల్ని మోసం చేసిన శిల్ప.. దాదాపు 200 కోట్ల దాకా కుచ్చు టోపీ పెట్టినట్లు చెబుతున్నారు. అయితే శిల్ప చౌదరి కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పలువురిని మోసం చేసి దాదాపు రూ.90 కోట్ల వరకు వసూలు చేసింది. ఆ డబ్బులతో గండిపేటలో లగ్జరీ విల్లాను కొనుగోలు చేసినట్లు తెలిసింది. వసూలు చేసిన సగం డబ్బుల్ని ఇంటి కోసమే ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తెరపైకి వచ్చింది. 

దీంతో పాటు శిల్ప చౌదరి కిట్టి పార్టీలు , స్పా పార్టీల పేరిట దుబారా ఖర్చులు చేసినట్లు తెలిసింది. దీంతో శిల్పపై మొత్తం 8 కేసులు నమోదు అయ్యాయి. నార్సింగిలో నాలుగు, జూబ్లిహీల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ పీఎస్ లో మొత్తం 8 కేసులు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల విచారణలో శిల్పా బాధితులు  ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. 
రొట్టెల పెనం వ్యాపారం పేరుతో శిల్ప భారీ మోసాలకు పాల్పడింది. జర్మనీ నుంచి రొట్టెల పెనం తెప్పిస్తానని ఆమె పలువురు నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. పెనంను రూ. 2  వేలకు ఆన్లైన్ లో కొని రూ. 25  వేలకు అమ్ముతూ వ్యాపారాలు చేసింది.

అధికవడ్డీ ఇస్తానని చెప్పి.. ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. పార్టీలిచ్చి సెలబ్రెటీలను ఆకర్షించినట్లు తెలుస్తోంది. ప్రముఖులంతా పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. మోసపోయిన వాళ్లంతా మహిళా బాధితులే అంటున్నారు పోలీసులు. దివ్యారెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో శిల్పను అరెస్ట్ చేశామన్నారు పోలీసులు.