హైదరాబాద్ డీ-అడిక్షన్ సెంటర్ నిర్వాకం.. తాగుడు మాన్పిస్తారనుకుంటే.. మీ కొడుకు చచ్చిపోయాడని ఫోన్ చేశారు !

హైదరాబాద్ డీ-అడిక్షన్ సెంటర్ నిర్వాకం.. తాగుడు మాన్పిస్తారనుకుంటే.. మీ కొడుకు చచ్చిపోయాడని ఫోన్ చేశారు !

హైదరాబాద్: మద్యానికి బానిసైన కొడుకును డీ-అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయగా అక్కడి నిర్వాహకులు ఆ కుర్రాడిని కొట్టి చంపిన దుర్ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్లోని రాఘవేంద్ర హోమ్స్లో గత కొన్ని నెలలుగా సంతోష్ రెడ్డి, రాకేష్ రెడ్డి, మరొకరు కలిసి హైదరాబాద్లో ఈ డీ-అడిక్షన్ సెంటర్ను నిర్వహిస్తున్నారు.

ఇక్కడ మద్యానికి బానిసై, గంజాయికి బానిసైన 15 మందికి.. డాక్టర్లు, కౌన్సిలర్లు, సైకియాట్రిస్టులు వైద్య సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలిసిన వారి సూచనతో మద్యానికి బానిసైన.. చౌహన్ సంతోష్ పవన్ సింగ్(29) అనే కుర్రాడిని అతని కుటుంబ సభ్యులు గత మూడు రోజుల క్రితం ఇక్కడ అడ్మిట్ చేశారు.

కాగా ఆదివారం సాయంత్రం అతనిని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులకు మీ అబ్బాయి చనిపోయాడని డీ అడిక్షన్ సెంటర్ నిర్వాహకులు సమాచారం చేరవేశారు. 

మద్యానికి బానిసైన కొడుకు బాగయితడని డీ అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేస్తే.. ఒంటిపై గాయాలతో కొడుకు మృతి చెందినట్లు ఉండడంతో తల్లిదండ్రులు అతని మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అదిభట్ల పోలీసులు చర్యలు తీసుకోవాలని చనిపోయిన యువకుడి తల్లి జాన్సీ లక్ష్మీబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.