హైదరాబాద్: నాగోల్లోని రాజీవ్ స్వగృహ సహ భావన టౌన్ షిప్లో దారుణం జరిగింది. ఒక కుటుంబం తమకు వచ్చిన సమస్య గురించి ప్రశ్నించినందుకు వారం రోజులుగా కరెంట్ కట్ చేశారు. పెంచిన మెయింటనెన్స్ కాకుండా పాత పద్దతిలో మెయింటనెన్స్ కట్టారని వారం రోజులుగా ఓ ఫ్లాట్కు కమిటీ సభ్యులు పవర్ కట్ చేశారు. వారం రోజులుగా బాధిత కుటుంబం చిన్నపిల్లలతో సహా చీకట్లో మగ్గిపోతుంది.
మానవత్వం లేకుండా కనీస అవసరాలకు కూడా కరెంట్ సప్లై చేయకుండా సదరు కుటుంబాన్ని కమిటీ కట్ చేసింది. కమిటీ సభ్యులు ఫ్లాట్ ఓనర్స్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి తీర్మానం లేకుండానే మెయింటనెన్స్ పెంచారు. చక్రపాణి అనే ప్లాట్ ఓనర్ దాన్ని వ్యతిరేకించాడు.
గతంలో కూడా వసూల్ చేసిన మెయింటనెన్స్ డబ్బుల ఖర్చులపై చక్రపాణి ప్రశ్నించాడు. అలా ప్రశ్నించడం, తీర్మానం లేకుండా అక్రమంగా పెంచినందుకు అడగడంతోనే తనపై కమిటీ సభ్యులు కక్ష పూరితంగా కరెంట్ కట్ చేశారని చక్రపాణి ఆవేదన చెందుతున్నాడు. ఇప్పటి వరకు ఏ ఒక్క నెల కూడా మిస్ కాకుండా చక్రపాణి మెయింటనెన్స్ కడుతున్నాడు.
అయినా సరే కనీస కనికరం లేకుండా కరెంట్ కట్ చేయడంతో.. అసలే సమ్మర్.. చిన్న పిల్లలతో బాధిత కుటుంబం ఉక్కపోతలో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఇక.. లాభం లేదని.. దౌర్జన్యం చేస్తున్నారని నాగోల్ పీఎస్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. నాగోల్ పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోకుండా వెనక్కి పంపించేశారు. చివరకు బాధితుడు ఎస్సీ కమిషన్ను ఆశ్రయించాడు. కమిటీ సభ్యుల తీరుపై మిగతా ప్లాట్ ఓనర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
