జడ్జి ఇంట్లో నోట్లకట్టల కేసు..జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

జడ్జి ఇంట్లో నోట్లకట్టల కేసు..జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి జడ్జి ఇంట్లో కోట్ల రూపాయలు బయటపడిన కేసులో అలహాబాద్  హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఎట్టకేలకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు పంపారు. ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ  నివాసంలో అగ్నిప్రమాదంలో సమయంలో కోట్ల రూపాయలు బయటపడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. పార్లమెంటులో ఆయనపై అభిశంసనకు ప్రక్రియ మొదలవుతున్న సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఇప్పటికే సుప్రీంకోర్టులో అంతర్గత విచారణలో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభియోగాలు నిజమని నిర్దారణ అయింది. ఈ వివాదం సమయంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వర్మ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ వర్మ రాజీనామాతో న్యాయవ్యవస్థలో తీవ్ర చర్చ మొదలైంది. 

అగ్నిప్రమాదంతో.. 

2025 మార్చి 14న జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన నివాసంలో అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ ఇనుప బీరువాల్లో, రహస్య రూముల్లో గుట్టలు గుట్టలుగా నగదు కనిపించింది. ఓ జడ్జిల ఇంట్లో అంత మొత్తంలో నగదు దొరకడంతో ఈ విషయం కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి వెళ్లి దేశవ్యాప్త చర్చకు దారితీసింది.

న్యాయవ్యవస్థలో అంతర్గత విచారణ..

ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు అంతర్గత కమిటీ విచారణ చేపట్టింది. విచారణలో ఆ నగదుకు సంబంధించిన ఆధారాలను జస్టిస్ వర్మ చూపలేకపోయారని, ఆయనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని కమిటీ నిర్ధారించింది. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.