గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్లకు బూట్లు, టై! .. బ్యాగు, బెల్ట్ కూడా ..

గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్లకు బూట్లు, టై! ..  బ్యాగు,  బెల్ట్ కూడా ..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్లకు కొత్త గవర్నమెంట్ లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఇప్పటికే అందిస్తున్న యూనిఫామ్​తో పాటు షూస్, బ్యాగు కూడా అందించాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు పంపిస్తున్నట్టు తెలిసింది. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ అలసత్వంతో..

రాష్ట్రంలో 26 వేలకు పైగా సర్కారు స్కూళ్లు ఉండగా, వాటిలో ఒకటి నుంచి పదో తరగతి దాకా సుమారు19 లక్షల మంది చదువుతున్నారు. వీటితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, యూఆర్​ఎస్ లు, సొసైటీ గురుకులాల్లో మరో నాలుగు లక్షల మంది చదువుతున్నారు. ప్రస్తుతం వీరందరికీ  రెండు జతల యూనిఫామ్ ను సర్కారు అందిస్తోంది. గతేడాది కార్పొరేట్ లుక్ ఉండేలా యూనిఫామ్ కలర్ తో పాటు డిజైన్ మార్చారు. అయితే, వీరందరికీ షూస్​, సాక్స్, బ్యాగు, టై, బెల్ట్ ఇవ్వాలని మూడేండ్ల నుంచి కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పెడ్తున్నారు. కానీ, వారు రిజెక్ట్ చేయడమే కాక, రాష్ట్ర  ప్రభుత్వం ద్వారానే వాటిని కొనుగోలు చేసుకోవాలని సూచించారు. దీంతో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి పలు మార్లు అడిగినా, పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు రావడం, విద్యారంగానికి ప్రయార్టీ ఇస్తుండటంలో అందరిలో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో షూస్, టై, బెల్ట్​, సాక్స్​ల కోసం ప్రపోజల్స్ పెట్టాలని విద్యాశాఖ అధికారులు రెడీ అయ్యారు. 

290 కోట్లు అవసరం..!

రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఫస్ట్ నుంచి టెన్త్ వరకూ సుమారు 19 లక్షల మంది చదువు తున్నారు. వీరందరికీ షూస్​, సాక్స్, బ్యాగు, టై, బెల్ట్  అందించాలంటే సుమారు రూ.280కోట్ల నుంచి రూ.290 కోట్ల వరకూ అవసర మవుతాయని అంచనా వేశారు. యూని ఫామ్ అంటే కేవలం ప్యాంట్,షర్ట్ మాత్రమే కాదని, షూస్, టై, బెల్ట్ కూడా అనే భావన అధికారుల్లో ఉంది. మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ చెప్పులు, బ్యాగులు లేకుండానే బడులకు వస్తున్నారు. అయితే, లక్షలాదిమంది పేద విద్యార్థులకు లబ్ది చేకూర్చే అంశం కావడంతో పాటు బడ్జెట్​ కూడా తక్కువే ఉండటంతో, సర్కారు అంగీకరించే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.