
గచ్చిబౌలి, వెలుగు: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్పరిధి వివిధ సర్కిళ్లలోని టౌన్ ప్లానింగ్ వింగ్‌లో అధికారుల కొరత తీవ్రంగా ఉంది. సరిపడా ఆఫీసర్లు, సిబ్బంది లేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పర్యవేక్షణ లేక అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి. పటాన్చెరు, చందానగర్ సర్కిళ్లలో ఏడు డివిజన్లు ఉంటే ఒకే ఒక్క టౌన్ ప్లానింగ్సూపర్వైజర్(టీపీఎస్)ఉన్నాడు. శేరిలింగంపల్లి సర్కిల్లో మూడు డివిజన్లకు గాను ఇద్దరు మాత్రమే టీపీఎస్అధికారులు పనిచేస్తున్నారు. చందానగర్, పటాన్చెరు సర్కిళ్లలోని ఏడు డివిజన్లకు ఒకే ఒక్క టీపీఎస్ అధికారి ఉన్నారు. ప్రమోషన్లు, ట్రాన్సఫర్‌పై వెళ్లిన అధికారుల స్థానంలో కొత్తవారిని నియమించకుండా ఉన్న వారికే అదనపు బాధ్యతలు ఇస్తుండటంతో వారిపై పనిభారం పడుతోంది. అధికారులు, సిబ్బంది కొరత కారణంగా పర్యవేక్షణ లేక ఈ మూడు సర్కిళ్ల పరిధిలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి.
రెవెన్యూ డివిజన్లో ఎక్కువగా..
శేరిలింగంపల్లి జోన్లో చందానగర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, రామచంద్రాపురం, యూసుఫ్‌గూడ సర్కిళ్లు ఉన్నాయి. చందానగర్సర్కిల్లో మాదాపూర్, హఫీజ్‌పేట్, మియాపూర్, చందానగర్ డివిజన్లు ఉండగా.. ఈ నాలుగింటికి కలిపి ఒకే ఒక్క టీపీఎస్ అధికారి విధులు నిర్వహిస్తున్నారు. 4 డివిజన్లకు నలుగురు చైన్మెన్లు ఉండాలి. కానీ ఇద్దరు మాత్రమే ఉన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్లో శేరిలింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్లతో పాటు భారతీనగర్ డివిజన్ కొంత భాగం ఉంది.
సర్కిల్ టౌన్ ప్లానింగ్‌లో మూడు డివిజన్లకు గాను ముగ్గురు టీపీఎస్ అధికారులకు బదులు ఇద్దరు ఉన్నారు. ముగ్గురు చైన్మెన్లు ఉండాల్సిన చోట ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సర్కిల్లోని రెవెన్యూ డివిజన్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. సీనియర్, జూనియర్అసిస్టెంట్లు ఉండాల్సిన వారి కన్నా ఎక్కువ ఉన్నారు. సీనియర్ అసిస్టెంట్లను టీపీఎస్అధికారులుగా, జూనియర్ అసిస్టెంట్లను చైన్మెన్లుగా నియమించే అధికారం జోనల్ కమిషనర్‌కు ఉన్నప్పటికీ నియమించకుండా ఉన్న వారితోనే డ్యూటీ చేయిస్తున్నారు. పటాన్చెరు, రామచంద్రాపురం సర్కిల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రెవెన్యూ సహా కొన్ని విభాగాల్లో అదనపు అధికారులు, సిబ్బంది ఉన్నా సరే వారిని టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌కు ట్రాన్స్ఫర్ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇష్టమొచ్చినట్లు నిర్మాణాలు
శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు సర్కిళ్ల టౌన్ప్లానింగ్విభాగంలో అధికారులు, సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండటం, ఉన్న వారికి అదనపు బాధ్యతలు అప్పగించడంతో మూడు సర్కిళ్లలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అదనపు బాధ్యతల కారణంగా ఫీల్డ్ విజిట్ చేయకపోవడంతో ఐటీ కారిడార్ ఉన్న శేరిలింగంపల్లి సర్కిల్లో అక్రమ నిర్మాణాలు భారీగా వెలుస్తున్నాయి. పటాన్చెరు, చందానగర్ సర్కిళ్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా జోనల్ కమిషనర్మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మూడు సర్కిళ్ల టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అధికారులు, సిబ్బందిని నియమించకపోవడంతో సరైన పర్యవేక్షణ లేకనే అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయనే అరోపణలు వస్తున్నాయి.