పదేండ్ల విధ్వంసంపై..విచారణ జరగాలె

పదేండ్ల విధ్వంసంపై..విచారణ జరగాలె

శ్వేత పత్రం అదేవిధంగా స్వేద పత్రం సమర్పించగానే సరిపోలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో జరిగిన ఆర్థిక, సహజ వనరుల విధ్వంసం, నచ్చిన వారికి నజరానాతో, నచ్చని వారికి అణిచివేతలు, అవమానాలు చోటు చేసుకున్న రాష్ట్రంలో జరిగిన విధ్వంసం అంచనా వేయలేము.  చివరికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని కోలుకోలేని దుస్థితికి చేర్చినారు. తీగ లాగితే డొంక కదిలినట్టుగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు గత పది సంవత్సరాల నిర్వాకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఎడాపెడా రూ. ఆరు లక్షల 71 వేల కోట్ల అప్పు అభం శుభం ఎరగని తెలంగాణ పేద, మధ్య తరగతి ప్రజలపై మోపడం జరిగింది. కంచె చేను మేసినట్లయింది.  ధనవంతుల, ముఖ్యంగా కార్పొరేటు యజమానుల  కొమ్ముగాసి హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వేలాది మంది బిలియనీర్స్​గా ఎదగడానికి ఉపయోగపడ్డ పాలకులకు రాష్ట్రమంతా సంపన్న రాష్ట్రంగానే కనిపిస్తుంది. కామెర్లు వచ్చినవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.  ఆయాచితంగా వచ్చిన అధికారం దుర్వినియోగపరచి ఉన్నత పదవులన్నీ అవకాశవాదులకు, అవినీతిపరులకు, తెలంగాణ ద్రోహులకు ఇచ్చి విధ్వంసానికి, అవినీతికి పాల్పడిన ఉదంతాలు అనేకం బయటకు వస్తున్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. 

బంధుప్రీతి ఆశ్రితపక్షపాతం పుణికిపుచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి  బంధు వర్గానికి సంబంధించిన అనేకమందిని వయోపరిమితినీ లెక్కచేయకుండా 75,- 80 ఏండ్ల వయస్సు విశ్రాంత ఉద్యోగులను, సర్వీసులో ఉన్న కొంతమంది బంధువులను ఇష్టారాజ్యంగా నియమించి  ప్రజల ధనాన్ని ఫలహారం లాగా పంచి పెట్టారు.  పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, రైతులకు తెలంగాణ ప్రజల డబ్బును పంపిణీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. నిరర్థకమైన ప్రాజెక్టులు, విద్యుత్ ప్లాంట్లు అమలు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు. అదనపు ఆయకట్టు 18 లక్షల ఎకరాలు అని తెలంగాణ ప్రజలను రైతులను మభ్యపెట్టి  ఇసుక దిబ్బలపై ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్ష కోట్లను నీళ్ల పాలు చేసింది ప్రభుత్వం. ప్రతి సంవత్సరం సొంత మీడియా ద్వారా ప్రచారం చేసుకుని తెలంగాణ డబ్బు వేలకోట్ల రూపాయలు దండుకోవడం జరిగింది. అవినీతిపరులైన అధికారులు పదవీ విరమణ చేయగానే ప్రగతి భవనములో అందలా లెక్కించి  నజరానాలు ప్రకటించడం వల్ల కూడా తెలంగాణ ప్రభుత్వం అప్పుల పాలయింది. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు.

ఆశ్రిత పక్షపాత పాలన

 కుటుంబ సభ్యుల  కొందరు బంధువుల ఆస్తులు వేలాదికోట్లకు పెరిగిపోయినాయి. ఈ ధనమంతా ఆస్తులంతా ప్రజల సొమ్ము కాదా? చందాలతో ప్రారంభించిన పార్టీకి 1100 కోట్ల రూపాయల డిపాజిట్లు ఎక్కడ నుంచి వచ్చినయి?  పది ఏండ్ల లోనే పార్టీకి ప్రతి జిల్లాలో వందల కోట్ల రూపాయల విలువగల భవనాలు, భూములు సంక్రమించడానికి రాష్ట్ర వనరులను ఎంత మేరకు విధ్వంసం చేసి ఉండవచ్చు? కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రభుత్వ భూములను 99 సంవత్సరాల కాలం లీజుకు తీసుకున్న  వైనం దోపిడీకి, దొంగతనానికి చిహ్నం కాదా అని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. తన సామాజిక వర్గానికి సంబంధించిన అనేకమందికి అత్యున్నత పదవులను అంటగట్టి వందల కోట్ల రూపాయల సంపద సమకూర్చలేదా? ప్రభుత్వ భూములను, పేద ప్రజల అసైన్డ్ భూములను, అటవీ భూములను నాయకులు ఆక్రమించి ధరణి ద్వారా పట్టా పుస్తకాలు పొందిన ఈ విధ్వంసం అంచనా వేయగలమా? 

పాలనలో ఆ సామాజికవర్గమే 

విద్యుత్ కార్పొరేషన్  ఎంపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్ కో, జెన్ కో విభాగాలలో సంవత్సరాల తరబడి ముఖ్యమంత్రి బంధువులు కొందరు అధికారాన్ని అనుభవించారు. అక్రమంగా అధికారాన్ని పొందిన వీరు నిజాయితీగల ఉద్యోగులను అధికారులను అణిచివేయడం వారి పట్ల వివక్షత చూపడం సాధారణమైంది. రాష్ట్ర వ్యవస్థను నియంత్రించడానికి పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులు సమర్థవంతులైనప్పటికీ రిటైర్ అయిన తన బంధువులను స్నేహితులకు పోలీస్ శాఖలో అత్యున్నత స్థాయి పదవులను ఇచ్చి  ప్రజల ధనాన్ని పంచి పెట్టడం జరిగింది. నీటి పారుదల, రోడ్డు రవాణా, టూరిజం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక మండలి, విశ్వవిద్యాలయాల్లో ఇతర సంస్థలలో తన సామాజిక వర్గానికి సంబంధించిన వారిని నియమించి అర్హత కలిగిన ఇతర వర్గాల వారిని అవమానాలకు గురి చేయడం జరిగింది. ఒక్క శాతం జనాభా కూడా లేని సామాజిక వర్గం మంత్రిమండలిలో, శాసనసభలో, శాసనమండలిలో ఉన్నత స్థాయి నామినేటెడ్ పదవులలో మెండుగా అవకాశాలు లభించడం ముఖ్యమంత్రి ఆశ్రితపక్షపాతానికి బందు ప్రీతికి నిదర్శనం కాదా అని తెలంగాణ  బహుజన వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇటీవల ఎన్నికల్లో తగిన విధంగా గుణపాఠం చెప్పడం జరిగింది.

నిజాం పాలనా నమూనా

తెలంగాణ వస్తే సామాజిక న్యాయం సమతూకంలో ఉంటుందని ఎంతో ఆశపడి అనేక త్యాగాలు చేసిన ఉద్యమకారుల పట్ల అనేక అవమానాలకు గురి చేయడమే కాక పుండు పై కారం చల్లినట్టు అవినీతి, ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతి శృతిమించి రాగాన పడిన విషయం ప్రజలు గమనించారు. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినంత మాత్రాన ఎవరూ చూడడం లేదని అనుకున్నారేమో కానీ తెలంగాణ ప్రజలు లెక్క ఒప్ప చెపుతున్నారని తెలియదాయే! గత పదేండ్ల పాలన నిజాముల కాలం నాటి జమీందారీ, పెత్తందారీ సంస్కృతికి అద్దం పట్టినట్లుగా ప్రజలు గమనించారు. ఈనాటి యువతకు నైజాం సర్కారు కాలంలో అమలు జరిగిన అణచివేత, దోపిడీ, బానిసత్వం తెలియక పోవచ్చు కానీ గత పదేండ్ల నిరంకుశ పాలన ద్వారా ఆనాటి జమీందార్లు, జాగిర్దార్లు ఏ విధంగా ప్రజలను పాలించారో ఇప్పటి తరానికి అర్థమయ్యే విధంగా చంద్రశేఖర రావు గత పదేండ్ల పాలన ప్రత్యక్ష పాఠం నేర్పింది. కుటుంబ పాలనలో అవినీతి అధికారులు కూడా వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారు అనేది అక్షర సత్యం. వెంకట్రాంరెడ్డిని ఏకంగా ఎమ్మెల్సీనే చేసేశారు. సోమేశ్ కుమార్ ను అట్టిపెట్టుకున్నారు. రజత్​కుమార్ పై వచ్చిన ఆరోపణలు తెలిసినవే. 

స్వేద పత్రాలు తప్పులను కప్పిపుచ్చలేవు 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి శ్వేత పత్రం ప్రకటించడంతో  గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన విషయం తేటతెల్లం చేయడం జరిగింది. గురుజ కింద నలుపు లేదని తాను అంతా స్వచ్ఛంగానే ఉన్నానని చెప్పుకున్నట్లే స్వేద పత్రాన్ని చదివి అవినీతి పాలకులు తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే తెలంగాణలో కేవలం ప్రభుత్వ ఖజానా లూటీ మాత్రమే కాదు, మొత్తం యావత్తు రాష్ట్ర ప్రజలని దోపిడీ చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో దోషులైన వారిని శిక్షించే అవకాశముంది. అందుకే రాష్ట్రంలో జరిగిన అన్ని విధాల దోపిడీ, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతంపై ఒక సమగ్ర విచారణ జరిపించి దోషులైన వారిని తగిన విధంగా శిక్షించే చర్యలు తీసుకుంటేనే తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు, రాష్ట్రానికి కొంత ఊరట, న్యాయం జరుగుతుంది. కానీ కేవలం శ్వేత పత్రం, స్వేద పత్రాలతో చేతులు దులుపుకోవడం న్యాయం కాదని ప్రజలు భావిస్తున్నారు.

- కూరపాటి వెంకట్ నారాయణ, రిటైర్డ్​ ఫ్రొఫెసర్​