మందమర్రి, వెలుగు: సింగరేణి కంపెనీకి గతేడాది వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం ఆలస్యం చేస్తోందని, వెంటనే లాభాలు వెల్లడించి కార్మికులు 35 శాతం వాటా ఇవ్వాలని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ సుదర్శనం డిమాండ్ చేశారు. శుక్రవారం మందమర్రి ఏరియా కేకే–5 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌కు హాజరై మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని, 6 ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 13న సింగరేణి జీఎం ఆఫీస్‌ల ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేస్తామన్నారు. యూనియన్ బ్రాంచి సెక్రటరీలు సొమిశెట్టి రాజేశం, కంది శ్రీనివాస్, జెట్టి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
బై బై గణేశా..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్ లో బుధవారం పేట్ లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శోభయాత్రను ప్రారంభించి వినాయక మండలి సభ్యులతో కలిసి డ్యాన్సులు చేశారు. ఆదిలాబాద్ వినాయక్ చౌక్ సరస్వతీ శిశుమందిర్ ఆవరణలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డితో కలసి నిమజ్జనోత్సవాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్రలో డోలు వాయిద్యాలు, మహిళల కోలాటం, డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. గణనాథులను ఇందారం , గూడెం గోదావరిలో నిమజ్జనం చేశారు. తెలంగాణ బార్డర్‌ను ఆనుకుని ఉన్న పాలాజ్ కర్ర గణేశ్ శోభ యాత్ర కన్నుల పండువగా సాగింది. మందమర్రి, రామకృష్ణాపూర్ సింగరేణి కార్మిక క్షేత్రాల్లో వినాయక శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తదితరులు పాల్గొన్నారు.
- నెట్వర్క్, వెలుగు
‘చలో జోడేఘాట్’ పాదయాత్రను సక్సెస్ చేయాలి
ఆసిఫాబాద్, వెలుగు : చలో జోడేఘాట్ పాదయాత్ర సక్సెస్చేయాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోట్నక్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 20 వరకు పాదయాత్ర ఉంటుందని, తిర్యాణి మండలం గుండాల గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి ఆదివాసీ గూడెం నుంచీ భారీగా ప్రజలు, నాయకులు తరలిరావాలని కోరారు.
హాస్టల్ స్టూడెంట్లపై నిర్లక్ష్యం తగదు
కాగజ్ నగర్, వెలుగు: కేజీ బీవీలు, హాస్టల్ స్టూడెంట్లకు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని, వారిపై నిర్లక్ష్యం తగదని ఏబీవీపీ స్టేట్ హాస్టల్స్ యూనియన్
కో కన్వీనర్ మరవేని రంజిత్ కుమార్ సూచించారు. కౌటాల కేజీ బీవీ స్టూడెంట్ గాయత్రి అనారోగ్యంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా ఆయన శుక్రవారం పరామర్శించారు. స్టూడెంట్‌కు మెరుగైన చికిత్స అందించాలని, ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. కన్వీనర్ అరుణ్ సాగర్, సాయి పాల్గొన్నారు.
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి
ఇచ్చోడ, వెలుగు : చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, స్టూడెంట్లు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఐటీడీఏ పీవో కె. వరుణ్ రెడ్డి సూచించారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల స్కూల్‌ను ఆయన విజిట్చేశారు. కొత్తగా రూ.6.80 లక్షల ఫండ్స్‌తో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ను పీవో ప్రారంభించారు. వివిధ ప్రయోగాల వివరాలను స్టూడెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యం ఏర్పరచుకొని కష్టపడి సాధించాలన్నారు. ఈజీగా అర్థమయ్యే రీతిలో స్టూడెంట్లకు పాఠాలను బోధించాలని టీచర్లకు సూచించారు. అనంతరం 9వ తరగతి స్టూడెంట్లకు కొత్త సీబీఎస్ఈ టెక్స్ట్బుక్స్అందించారు. స్వచ్ఛ గురుకులంలో భాగంగా స్కూల్ ఆవరణలో టీచర్లు, స్టూడెంట్లతో కలిసి పీవో మొక్కలు నాటారు. హెడ్మాస్టర్గంగాధర్, టీచర్లు పాల్గొన్నారు.
పంచాయత్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి
ఖానాపూర్, వెలుగు : జాతీయ స్థాయి పంచాయత్ అవార్డులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పంచాయతీ ఆఫీసర్శ్రీలత చెప్పారు. శుక్రవారం మండల పరిషత్ ఆఫీస్‌లో ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల పంచాయతీ సెక్రటరీలతో నిర్వహించిన సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. 2022–-23 సంవత్సరానికి 9 కేటగిరిల్లో పంచాయతీ అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పచ్చదనం , పరిశుభ్రత , సామజిక మౌలిక సదుపాయల కల్పన , పేదరిక నిర్మూలన , ఆరోగ్య స్థితి గతులు , పరిపాలన తదితర అంశాలపై పోటీలుంటాయని వివరించారు. అవార్డులపై సర్పంచ్‌లకు అవగాహన కల్పించాలని సెక్రటరీలను ఆదేశించారు. ఎంపీడీవోలు అల్లాడి వనజ, లింబాద్రి, వెంకటేశ్వర్లు, ఎంపీవోలు చంద్రశేఖర్, రత్నాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
కాళోజి యాదిలో..
తెలంగాణ యాస, భాషకు ప్రజాకవి కాళోజీ ఊపిరి పోసిండని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, పార్టీల నాయకులు ఆయన ఫొటోలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ నినాదంతో తెలంగాణ సమాజంలో స్ఫూర్తిని రగిలించిన చైతన్యదీప్తి కాళోజి అని కొడియాడారు. కలెక్టర్లు ముషారఫ్ ఫారుఖీ, రాహుల్‌రాజ్, సిక్తా పట్నాయక్, అడిషనల్కలెక్టర్లు రాజేశం, ఎన్. నటరాజ్ పాల్గొన్నారు. - నెట్వర్క్, వెలుగు
కేజీబీవీ స్కూల్లో పారాసిటమాల్ టాబ్లెట్లు లేవ్
ఆసిఫాబాద్, వెలుగు : రెబ్బెన మండలం గంగాపూర్ కేజీబీవీ లో స్టూడెంట్లకు జ్వరమొస్తే ఇచ్చేందుకు కనీసం పారాసిటమాల్ టాబెట్లు కూడా లేక స్టూడెంట్లు గోస పడుతున్నారని బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఇగురపు సంజీవ్ అన్నారు. గురువారం ఇద్దరు స్టూడెంట్లు అస్వస్థతకు గురవ్వడంతో శుక్రవారం బీజేవైఎం లీడర్లు హాస్టల్‌ను విజిట్చేశారు. కనీస సౌకర్యాలు లేక స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నా.. గవర్నమెంట్ పట్టించుకోవడం లేదన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, నాలుగు రోజులకోసారి కూరగాయలు తెచ్చి పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎస్వో, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుడు లెక్కల భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి బక్క ఆనంద్, మండల ఉపాధ్యక్షుడు సంతోష్ కార్యదర్శులు మోర్లె రమేశ్ పాల్గొన్నారు.
మహిళా సంఘాలు స్వయం ఉపాధిలో రాణించాలి
జైనూర్, వెలుగు : మహిళా స్వయం సంఘాల మహిళలు ఉపాధి రంగంలో రాణించాలని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. చోలమండలం సహకారంతో బాల వికాస్ ద్వారా ఐకేపీ ఆవరణలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజుతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రుణాలు పొందడమే కాకుండా వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావు, ఎంపీపీ కుమ్ర తిరుమల, వైస్ ఎంపీపీ లక్ష్మణ్ ఉన్నారు.
స్టూడెంట్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలోని స్కూల్స్, వెల్ఫేర్ హాస్టళ్లలోని ప్రతి స్టూడెంట్ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్‌హాల్‌లో జిల్లా అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, డీఆర్వో సురేశ్‌తో కలసి జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని, ట్రీట్మెంట్అవసరం ఉన్నవారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించాలని ఆదేశించారు. ప్రతి మండలంలో స్పెషల్ఆఫీసర్ఆయా స్కూల్, హాస్టల్ విద్యార్థుల
ఆరోగ్య స్థితిని పరిశీలించి రిపోర్టు అందించాలన్నారు. విద్య, వైద్యారోగ్యశాఖలు సమన్వయంతో వైద్య శిబిరాలు నిర్వహించాలని చెప్పారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలోని మోడల్ స్కూళ్లలో
దాదాపు 10 వేల మంది విద్యార్థులు ఉన్నారని, వారికి అవసరమైన వసతులు కల్పించాలని కోరారు.
వజ్రోత్సవాలను సక్సెస్ చేయాలి
ఈ నెల 16 నుంచి 18 వరకు ప్రభుత్వం నిర్వహించనున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను సక్సెస్చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. 16న రూట్ మ్యాప్ తయారు చేసుకొని 15 వేల మందితో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. 17న జిల్లా కేంద్రంలో జాతీయ పతాకావిష్కరణ ఉంటుందని, హైదరాబాద్‌లో చేపట్టనున్న ఆదివాసీ భవన్, బంజార భవన్‌లను ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి 5వేల మంది పాల్గొనేందుకు జాబితా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఎమ్మెల్యేలు, కలెక్టర్లు హాస్టళ్లను విజిట్ చేయాలి
కాగజ్ నగర్, వెలుగు: హాస్టళ్లలో సమస్యలు తెలియాలంటే ఎమ్మెల్యేలు, కలెక్టర్ హాస్టల్స్ నువిజిట్చేయాలని బీజేపీ లీడర్ల బృందం సూచించింది. శుక్రవారం కాగజ్ నగర్ మండలం బలగల గ్రామంలోని మైనార్టీ గురుకుల స్కూల్, జూనియర్ కాలేజీని బీజేపీ జిల్లా లీడర్ల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకుడు పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ రూ. 18 కోట్లతో మైనార్టీ గురుకుల స్కూల్ నిర్మించి కనీసం రోడ్డు వేయలేదన్నారు. హాస్టల్పక్కనే డంపింగ్ యార్డు ఉండడం వల్ల దుర్వాసనతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే తొలగించాలన్నారు. సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి, పట్టణ అధ్యక్షుడు గోలెం వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
