కోచ్‌గా కొనసాగుతా.!

కోచ్‌గా కొనసాగుతా.!

న్యూఢిల్లీ:  టీమిండియా కోచ్‌‌ సెలెక్షన్‌‌ ప్రక్రియను వీలైనంత తొందరగా ముగించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నెల 30న అప్లికేషన్లు వచ్చిన వెంటనే  సెలెక్షన్‌‌ ప్రక్రియను ప్రారంభించాలని చూస్తోంది. అదే సమయంలో  ప్రస్తుత హెడ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రి, సపోర్ట్‌‌ స్టాఫ్‌‌లో చాలా మంది తమను రీఅపాయింట్‌‌ చేయాలని కోరుకునున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే  వచ్చేనెల 15వ తేదీలోపు కోచ్‌‌ను ప్రకటించాలన్న బోర్డు ఆలోచన. కోచ్‌‌ ఇంటర్వ్యూలు పూర్తయ్యే టైమ్‌‌కు  టీమిండియా.. వెస్టిండీస్‌‌ పర్యటనలో ఉంటుంది. అయితే, వరల్డ్‌‌కప్‌‌ అనంతరం హెడ్‌‌ కోచ్‌‌ శాస్త్రి, అసిస్టెంట్‌‌ కోచ్‌‌లకు 45 రోజుల ఎక్స్‌‌టెన్షన్‌‌ ఇవ్వడంతో వారంతా జట్టుతోపాటే విండీస్‌‌లో ఉంటారు. ప్రస్తుతానికి  కోచ్‌‌ ఎంపిక ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు.

హెడ్‌‌ కోచ్‌‌, సహయ సిబ్బంది పోస్ట్‌‌లు ఆశించే వారు బీసీసీఐ ఇచ్చిన లాక్డ్‌‌ ఈమెయిల్‌‌ ఐడీకి దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గోప్యత దృష్ట్యా ఈనెల 30న మాత్రమే బోర్డు అప్లికేషన్లను స్వీకరించి అదే రోజు క్లోజ్‌‌ చేయనుంది. దాంతో,  తాము అప్లై చేసుకున్నామని  ప్రకటిస్తే తప్పితే కోచ్‌‌ రేసులో ఎవరు ఉన్నారో  ఎవ్వరికీ తెలియదు. కాగా, ప్రస్తుత కోచింగ్‌‌ స్టాఫ్‌‌ను దరఖాస్తుల నుంచి మినహాయించి నేరుగా ఇంటర్య్యూలకు హాజరయ్యే అవకాశం బోర్డు ఇచ్చింది. కాగా, వరల్డ్‌‌కప్‌‌లో ఇండియా సెమీస్‌‌లోనే వెనుదిరగడం.. జట్టు విషయంలో పలు వివాదాల నేపథ్యంలో శాస్త్రి కోచింగ్‌‌ వదిలేసి.. ఒత్తిడిలేని కామెంటరీవైపు వెళ్లాలని భావిస్తున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. కానీ, మరోసారి కోచ్‌‌గా పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు బోర్డుకు ముందుగానే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

శాస్త్రి పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్న కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ అతనికి  మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఈ నెల 29న టీమ్‌‌తో పాటు కరీబియన్‌‌ టూర్‌‌కు వెళ్లనున్న రవి.. స్కైప్‌‌ ద్వారా ఇంటర్వ్యూ ఇవ్వనున్నాడు. అలాగే, ఈ సారి కోచ్‌‌ను ఎంపిక చేసే క్రికెట్‌‌ అడ్వైజరీ  కమిటీకి నేతృత్వం వహించే మాజీ కెప్టెన్‌‌ కపిల్‌‌ దేవ్‌‌తో సఖ్యత ఉండడం శాస్త్రికి ప్లస్‌‌ పాయింట్‌‌ కానుంది. 2016లో కోచ్‌‌ ఎంపిక టైమ్‌‌లో సీఏసీ సభ్యుడిగా ఉన్న సౌరవ్‌‌ గంగూలీతో రవిశాస్త్రి పొసగలేదు. నాడు ఎక్స్‌‌టెన్షన్‌‌ కోరిన శాస్త్రిని కాదని అనిల్‌‌ కుంబ్లే కొత్త కోచ్‌‌గా సెలెక్ట్‌‌ కావడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఏడాదిలోపే కుంబ్లే   వైదొలగడం.. శాస్త్రి హెచ్‌‌ కోచ్‌‌ కావడం చకచకగా జరిగిపోయాయి. కాగా, శాస్త్రితో పాటు బ్యాటింగ్‌‌ కోచ్‌‌గా సంజయ్‌‌ బంగార్‌‌, బౌలింగ్‌‌ కోచ్‌‌గా భరత్‌‌ అరుణ్‌‌ కూడా మరో టర్మ్‌‌ కొనసాగింపు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తప్పుకున్న ఫిజియో పాట్రిక్‌‌ ఫర్హాత్‌‌, ట్రైనర్‌‌ శంకర్‌‌ బసు స్థానాల్లో కొత్త వారిని ఎంపిక చేయనున్నారు.

మరోవైపు గతంతో పోలిస్తే ఈసారి కట్టుదిట్టమైన నిబంధనలు విధించడంతో కోచ్‌‌ పదవికి ఎవరెవరు అప్లై చేశారో తెలియడం లేదు. ముఖ్యంగా క్లోజ్‌‌డ్‌‌ ఈమెయిల్‌‌ ఐడీకీ అప్లికేషన్లు రానుండడంతో ఈనెల 30నే దరఖాస్తులపై స్పష్టత రానుంది.  కాగా, 2017తో పోల్చితే  ఈసారి ఎక్కవు మంది దరఖాస్తు చేసుకునే అవకాశ ఉంది. శ్రీలంక మాజీ కెప్టెన్‌‌ మహేళ జయవర్దనె, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌‌ టామ్‌‌ మూడీ చీఫ్‌‌ హెచ్‌‌ కోచ్‌‌ కోసం,  సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌‌ జాంటీ రోడ్స్‌‌ ఫీల్డింగ్‌‌ కోచ్‌‌ పదవి కోసం అప్లై చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఐపీఎల్లో వివిధ జట్లకు కోచ్‌‌లుగా వ్యవహరించిన రికీ పాంటింగ్‌‌, స్టీఫెన్‌‌ ఫ్లెమింగ్‌‌ లాంటి వారికి తాజా నిబంధనలు సరిపోవడంతో వాళ్లు  కూడా రేసులో నిలుస్తారో లేదో చూడాలి.