
- స్టూడెంట్లను రిలొకేట్ చేయండి
- కాళోజీ హెల్త్ వర్సిటీకి ఎన్‌ఎంసీ సూచన
హైదరాబాద్, వెలుగు: పర్మిషన్లు రద్దైన మెడికల్ కాలేజీల్లోని స్టూడెంట్లను, రాష్ట్రంలోని ఇతర కాలేజీల్లోకి సర్దుబాటు చేయాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) సూచించింది. ఈ మేరకు ఈ నెల 17న కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు, స్టేట్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు ఎన్‌ఎంసీ మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా మెడికల్ కాలేజీలకు కూడా దీనిపై సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఈ స్టూడెంట్లకు అడ్మిషన్లు ఇవ్వొచ్చునని పేర్కొంది. ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఆ మూడు మెడికల్ కాలేజీ స్టూడెంట్ల రీలొకేషన్ ఎలా చేయోచ్చు, ఏయే కాలేజీల్లోకి మార్చొచ్చు అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు వెలుగుకు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి దీనిపై రిపోర్ట్ ఇస్తామని చెప్పారు.