విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటం

విద్యార్థుల  సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటం

విద్యార్థుల సమస్యలను పరిష్కరించని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని.. విద్యార్థులకు షోకాజ్ నోటీసులు ఇస్తామని ఇంచార్జి వీసీ వెంకటరమణ చెప్పడం దారుణమని బాసర ట్రిపుల్ ఐటీ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు రాజేశ్వరీ వెల్లడించారు. ఎవరి అండ చూసుకుని నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నారు. విడుతల వారీగా వస్తున్న వీరిని అరెస్టులు చేస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్టు చేస్తూ.. పీఎస్ లకు తరలిస్తున్నారు. పోలీసుల తీరును వారు తప్పుబడుతున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరీ మాట్లాడుతూ... ఇంచార్జీ వీసీ వెంకటరమణను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 45 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీనిచ్చారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు పరిష్కరించని ఆమెకు షోకాజ్ నోటీసులివ్వాలని డిమాండ్ చేశారు. తమ పిల్లల సమస్యలు పరిష్కరించాలని కోరితే ప్రభుత్వం అరెస్టు చేయించడం సిగ్గు చేటన్నారు. తమ పిల్లల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

ఎల్బీనగర్ లో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశమయ్యారు. ట్రిపుల్ ఐటీలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళనకు పేరెంట్స్ కమిటీ మద్దతు ప్రకటించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి సమస్యలను తెలియచేయాలని ప్రయత్నించారు. ఆమె ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. మంత్రి సబితా ఇంట్లో లేరని వెల్లడించిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేశారు. మరోవైపు... క్యాంపస్ లో నెలకొన్న అన్ని  సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ వెంకట రమణ తెలిపారు. త్వరలోనే పరిస్థితులు సద్దుమణుగుతాయని, అంతవరకు విద్యార్థులు సంయమనంతో ఉండాలని సూచించారు. శ్రద్ధగా చదువుకుంటున్న విద్యార్థులను డిస్టర్బ్ చేస్తే ఊరుకోమని హెచ్చరించడం గమనార్హం. క్యాంపస్ లోకి ఇతరులకు అనుమతి లేదని, ఎవరైనా రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.