IND vs AUS: వెనక్కి పరిగెడుతూ ఒడిసి పట్టేశాడు.. స్టన్నింగ్ క్యాచ్ పట్టి గాయపడిన అయ్యర్

IND vs AUS: వెనక్కి పరిగెడుతూ ఒడిసి పట్టేశాడు.. స్టన్నింగ్ క్యాచ్ పట్టి గాయపడిన అయ్యర్

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫీల్డింగ్ తో అబ్బురపరిచారు. శనివారం (అక్టోబర్ 25) ప్రారంభమైన ఈ నామమాత్రపు వన్డేలో అయ్యర్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ కు ఫిదా కావాల్సిందే. హర్షిత్ రానా వేసిన ఇన్నింగ్స్ 34 ఓవర్ నాలుగో బంతిని ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బాల్ గాల్లోకి లేచింది. బ్యాక్‌వర్డ్ పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్ వెనక్కి వేగంగా పరిగెత్తాడు. అసాధ్యమనుకున్న క్యాచ్ ను డైవ్ చేస్తూ అందుకున్నాడు. 

స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఆశ్చర్యానికి గురి చేసిన అయ్యర్ గాయపడ్డాడు. డైవ్ చేసినప్పుడు అతని భుజం నేలకు బలంగా తాకింది. దీంతో నొప్పితో కాసేపు విలవిల్లాడాడు. నొప్పి ఎక్కువగా ఉండడంతో గ్రౌండ్ వదిలి వెళ్ళాడు. శ్రేయాస్ స్టన్నింగ్ క్యాచ్ తో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. క్యారీ 24 పరుగుల వద్ద ఔటవ్వడంతో పాటు నాలుగో వికెట్ కు 59 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. అయ్యర్  గాయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఒకవేళ శ్రేయాస్ బ్యాటింగ్ కు రాకపోతే ఇండియా 10 మందితోనే ఆడాల్సి ఉంటుంది.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా టాస్ ఓడిపోయి మొదట బౌలింగ్ చేస్తుంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ప్రస్తుతం 40 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆరంభంలో టీమిండియా బౌలర్లు తడబడినప్పటికీ మిడిల్ ఓవర్స్ లో పుంజుకున్నారు. ఆస్ట్రేలియాను 250 పరుగుల లోపే కట్టడి చేసే అవకాశం కనిపిస్తుంది. మాట్ రెన్షా 56 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా  నిలిచాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ 41 పరుగులు చేసి రాణించాడు. ఇండియా బౌలర్లలో సుందర్, హర్షిత్ రానా రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్, కుల్దీప్, సిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు.