
న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో పాల్గొనే టీమిండియా జట్టులో ఎవరుంటారనే సస్పెన్స్‌కు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ మంగళవారం జట్టును ఎంపిక చేయనుంది. అయితే, 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టు ఎంపిక చేయడం కమిటీ పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను టీ20 జట్టులో ఎలా చేర్చాలనేది సెలెక్టర్లకు తలనొప్పి అయింది. ఇటీవల ఇంగ్లండ్ టూర్‌లో అద్భుతంగా రాణించిన గిల్ ప్రస్తుతం ఉన్న టీ20 జట్టు కూర్పులో సరిపోవడం లేదు. మార్చాల్సిన అవసరం లేని ఒక జట్టులో మార్పులు ఎలా చేయాలనేదాని కోసం అగార్కర్ అండ్ కో ముంబైలో సమావేశమై చర్చించనున్నారు. ప్రస్తుతం ఇండియా క్రికెట్‌లో దాదాపు 30 మంది ఆటగాళ్లు నేషనల్ టీమ్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కో ప్లేస్ కోసం కనీసం మూడు నుంచి నాలుగు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. టాప్–3 స్థానాల కోసం ఆరుగురు అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ గత సీజన్‌లో అద్భుతంగా ఆడారు. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ వీరికి పోటీగా తెరపైకి వచ్చారు. బౌలింగ్‌లో కూడా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఒకే ప్లేస్ కోసం పోటీపడుతున్నారు. వీరిలో అత్యంత సీనియర్‌యుజ్వేంద్ర చహల్‌ను సెలెక్టర్లు చాలా కాలంగా పట్టించుకోవడం లేదు.
శుభ్‌మన్, శ్రేయస్ వస్తే.. చెక్ ఎవరికి?
గిల్‌తో పాటు సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కూడా టీ20 టీమ్‌లోకి తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. అయితే,గత సీజన్‌లో బాగా ఆడిన ఆటగాళ్లను పెద్ద పేరున్న ప్లేయర్ల కోసం పక్కన పెట్టడం అన్యాయమని టీమ్ మేనేజ్‌మెంట్‌లో కీలక మెంబర్ అంటున్నాడు. మరో వాదన ప్రకారం ఇండియా క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండటం మార్కెటింగ్‌కు మంచిది. ఆ కెప్టెన్‌గా గిల్ పేరు పరిశీలనలో ఉంది. అయితే, ప్రస్తుత టీ20 జట్టు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో అద్భుతంగా రాణిస్తోంది. గత 20 మ్యాచ్‌ల్లో 17 గెలిచి 85 శాతం రికార్డు నమోదు చేసింది. ఆ మ్యాచ్‌ల్లో గిల్, యశస్వి పాల్గొనలేదు. సెలెక్టర్లు గిల్‌ను జట్టులోకి తీసుకుంటే, తుది జట్టులో అతడు ఆడాల్సిందే. దానివల్ల శాంసన్, అభిషేక్, తిలక్ లో ఒకరు తమ ప్లేస్‌ను త్యాగం చేయాల్సి వస్తుంది. అలాగే గిల్‌ను తీసుకుంటే రింకూ సింగ్‌ను జట్టు నుంచి తొలగించాల్సి రావచ్చు. శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రావాలంటే కూడా ఒకరిపై వేటు వేయాల్సిన పరిస్థితి ఉంది.
బౌలర్లలోనూ అదే పోటీ
హార్దిక్ పాండ్యా మెయిన్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఉండగా.. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌కు జట్టులో స్థానం ఖాయమే. దీంతో ఒక రిజర్వ్ సీమర్ స్థానం కోసం ముగ్గురు పోటీపడుతుండగా హర్షిత్ రాణాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ జరగనుంది. విండీస్ బలహీన ప్రత్యర్థి కావడంతో ఆ సిరీస్‌లో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి సిరాజ్, ప్రసిధ్‌ను ఆడించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇక, స్పిన్నర్ల కోటాలో అక్షర్, చక్రవర్తి , కుల్దీప్ తొలి మూడు ఆప్షన్స్. కోచ్ గంభీర్‌కు ఆల్‌రౌండర్లంటే ఇష్టం కాబట్టి సుందర్‌కు జట్టులో చోటు దక్కవచ్చు. హార్దిక్ పాండ్యా తర్వాత రెండో సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా శివం దూబేకు మొగ్గుంది. రెండో వికెట్ కీపర్ స్లాట్ కోసం జితేశ్ శర్మ , ధ్రువ్ జురెల్ మధ్య పోటీ ఉంది.
వన్డే వరల్డ్ కప్ కోసం నేడే అమ్మాయిల ఎంపిక
సొంతగడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్‌తో పాటు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం ఇండియా విమెన్స్ టీమ్‌ను సెలెక్షన్ కమిటీ మంగళవారం ఎంపిక చేయనుంది. ఈ టీమ్‌లో చాలా స్థానాలపై ఇప్పటికే స్పష్టత రాగా యంగ్ బ్యాటర్ షెఫాలీ వర్మ, పేసర్ రేణుక సింగ్‌ను జట్టులోకి తీసుకోవాలా లేదా అనే దానిపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో షెఫాలీ బాగానే ఆడినా ఆస్ట్రేలియా–ఎతో రాణించలేకపోయింది. ఇప్పటికే స్మృతి మంధాన, ప్రతీక రావల్ రూపంలో సెటిల్డ్ ఓపెనింగ్ జోడీ ఉండగా.. షెఫాలీని తీసుకుంటే బ్యాటింగ్‌కు మరింత పవర్ వస్తుందా అని సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు. ఇక, గాయం నుంచి కోలుకుంటున్న రేణుక ఫిట్‌నెస్‌ను కూడా పరిశీలించనున్నారు. వరల్డ్ కప్‌లో మెయిన్ పేసర్‌గా ఆమె బాధ్యతలను మోయగలదా అని పరీక్షించడానికి ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ ఒక మంచి అవకాశం కానుంది. జట్టులో మిగిలిన స్థానాలు దాదాపు ఖరారయ్యాయి. రిచా ఘోష్ వికెట్ కీపర్‌గా ఉండగా, యస్తిక భాటియా బ్యాకప్‌గా ఉంటుంది. వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి, స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాధా యాదవ్, యంగ్‌స్పిన్నర్ శ్రీ చరణి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో ఆరు వికెట్లు తీసిన యువ పేసర్ క్రాంతి గౌడ్ కూడా ఎంపిక కావచ్చు.