
ఆగస్టు 23న పశువుల డాక్టర్ల సదస్సులో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. భారతదేశ వ్యవసాయ రంగాన్ని స్వయంపోషకంగా తయారు చేయాలంటే భారతీయ సంప్రదాయ పద్ధతులతో వ్యవసాయం చేయాలని ఒక కొత్త సూత్రాన్ని చెప్పాడు.
కానీ, ఆ సంప్రదాయ పద్ధతులు ఏం సంస్కృత పుస్తకాల్లో పరిశోధన ద్వారా ప్రాచీన రచయితలు వివరించారో చెప్పలేదు. పోనీ, గత 100 ఏండ్లలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎన్ని వ్యవసాయక అభివృద్ధి సిద్ధాంతాలను, ఆచరణ పద్ధతులను పరిశోధన ద్వారా నిరూపించి దేశం ముందు పెట్టిందో చెప్పలేదు.
తా ము నెత్తిన ఎత్తుకొని హిందూత్వ సిద్ధాంత కర్తలుగా మోసే సావర్కర్గాని, వారి సిద్ధాంత కర్త రెండో సర్ సంచాలక్ గోల్వాల్కర్ రాసిన పుస్తకాల్లో వ్యవసాయరంగం అభివృద్ధి గురించిగాని, పశుసంపద ఎలా పెంచాలో వివరిస్తూ ఒక్క వ్యాసమైనా రాశారా? పోనీ, ఆర్ఎస్ఎస్ ప్రచారం చేసే సనాతన ధర్మ గ్రంథాలైన సంస్కృత గ్రంథాల్లో వ్యవసాయరంగం, వేదకాలంలోగాని, రామాయణ, మహాభారతకాలంలోగాని ఎటువంటి వ్యవసాయం ఉండేది? ఆనాడు వడ్లు పండేవా, జొన్నలు పండేవా, ఆనాడు వారు ఈనాడు ప్రచారం చేసే దైవాంశ ‘శాఖాహారం’ ఏ కూరగాయలతో సాగేది, ఆనాడు బర్లు పాలిచ్చేవా, ఒక్క ఆవులే పాలిచ్చేవా.. ఎక్కడైనా రాశారా.. రాస్తే ఆ రచనలు ప్రజలు ముందు పెట్టాలి కదా!
వ్యవసాయం ఏ కులాలు చేస్తాయి?
ఈ దేశంలో ఇప్పటి అన్ని జంతువుల కంటే ఎక్కువ పాలిచ్చే బర్లను ఈ దేశ ప్రజలు ఎప్పుడు ఇంటి జంతువుగా (డొమెస్టిక్ యానిమల్)గా మలుచుకున్నారు. ఆవును ఎప్పుడు మలుచుకున్నారు. మేక, గొర్రె ఈ దేశానికి అందించిన ఆహారమేమిటి, ఉన్ని బట్టలు ఏ జంతువు బొచ్చు నుంచి వచ్చాయి? ఇవాళ హిందూత్వం చుట్టూ ఉన్న మేధావులు మొదట సంస్కృతంలో, ఇప్పుడు ఇంగ్లీషులో బర్రె, గొర్రె, మేకవంటి ఆహార, పాలు, పెరుగు, నెయ్యి, ఉన్ని, మాంసం ఆహారం అందించిన జంతువుల మీద ఎన్ని పుస్తకాలు రాశారు?
ఒక్క ఆవుమీద, ఆ తరువాత కుక్కమీద ఎన్ని పుస్తకాలు రాశారో మీ కేంద్ర ప్రభుత్వం తీయించిన లెక్కలు దేశానికి చెప్పండి చూద్దాం. మోహన్ భగవత్ 100 ఏండ్ల ఆర్ఎస్ఎస్ అధికారంలో ఉండిన సంస్థకు నాయకత్వం వహిస్తూ.. దేశంలోని పశుసంపద మీద, ఆ పశు సంపదను తయారుచేసినవారి మీద ఎన్ని గ్రంథాలు రాయించారు?
విద్యావ్యవస్థను శాసిస్తున్న ఆర్ఎస్ఎస్
దేశ సంస్కృతికి, ఉనికి, దాని చరిత్రకు పునాది గ్రంథాలన్నీ సంస్కృత గ్రంథాలను ఈ రోజు అన్ని
స్కూళ్లల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో వాటిని మాత్రమే చదవాలని సీబీఎస్ఇ, కేంద్ర విద్యాశాఖ నుంచి, యూజీసీ నుంచి సర్క్యూలర్స్ తీయిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ చెప్పింది ఏదీ చెయ్యకుండా ఉనికిలో ఉండలేని పరిస్థితి మొత్తం విద్యాసంస్థలకు వచ్చింది.
కానీ, మీరు ప్రచారంలో పెట్టి, పాఠ్యపుస్తకాల్లో పెట్టించే పాఠాలలో ఈ దేశంలో వ్యవసాయం ఏ కులాలు చేస్తాయి? ఏ కులాలు దూరంగా ఉంటాయి? ప్రాచీన కాలంలో పంటల ఎరువులు ఏయే జంతువుల నుంచి వచ్చేది? అందులో ఏది ఎక్కువ రసాయనిక లక్షణాలను కలిగి ఉంది అని అర్థం చేసుకోవడానికి ఒక పుస్తకమైనా ఆర్ఎస్ఎస్ రాయించిందా?
పాల జంతువుగా మేక
ఆవు మూత్రం మీద పరిశోధనలు చేయడానికి మీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు మొత్తం మానవ ఉపయోగిత జంతువులైన గొర్రె, మేక, బర్రె, దున్నపోతు, ఎద్దు, గాడిద జంతుజాతులమీద వెయ్యొవ వంతు కూడా ఖర్చులేదు.
ఆర్ఎస్ఎస్ ఒక సంఘంగా గొర్రెలు, మేకలను ఈ దేశ ప్రాచీన జంతువులుగా అసలు ప్రపంచానికి మొదటి ఆహార, పాల జంతువుగా మేక అనే విషయం మీ చర్చల్లోగానీ, మీ శాఖ మీటింగులోగానీ, మీ పుస్తకాల్లో ఉన్నట్లు చూపిస్తారా! ఒక్క మహాభారతంలో కృష్ణుడు, బలరాముడు, యాదవ కులస్తులని చెప్పడం తప్ప ఆ కాలంలో గొర్రెలు, మేకలు, బర్రెలు ఆర్థికవ్యవస్థ, మానవ బతుకును ఎలా ప్రభావితం చేశాయో రాశారా? ఆ తరువాత మీరు రాయించారా.. ఇప్పుడైనా మీకు ఆ పరిశోధన చేయించే ఆలోచన ఉందా!
వ్యవసాయానికి అండగా నిలిచింది బుద్ధిజం మాత్రమే!
శూద్రులు, దళితులు తప్ప, ద్విజులు మొత్తంగా వ్యవసాయానికి దూరంగా ఉన్నారు. వ్యవసాయం ఒక శూద్ర తెలివితక్కువ పనిగా చాలాచోట్ల ప్రస్తావన చేసి ఉన్న గ్రంథాలను పాఠ్యాంశాల్లో పెట్టి కూడా ఇప్పుడు ఎవరిని వ్యవసాయం అభివృద్ధి చేయమని చెబుతున్నారు? ఈ దేశంలో వ్యవసాయానికి ఒక మతంగా అండగా నిలబడింది బుద్ధిజం.
సనాతన ధర్మ వ్యవసాయానికి అండగా ఉన్న ఆధారాలు, రుజువులు, పూజారులు, రాజకుటుంబీకులు బురదలో చెయ్యిపెట్టిన దాఖలాలు లేవు. బురద నుంచి కదా బువ్వ పుట్టింది. స్త్రీ రజస్వల నుంచి కదా శిశువు పుట్టింది. వీటిని ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ అపవిత్రంగా
భావిస్తున్నాయి కదా!
శూద్ర స్త్రీల ఇంటిపక్షి కోడి
అయ్యప్పస్వామి దగ్గరకు 10–50 మధ్య వయస్సులోని స్త్రీలు పోవద్దని మీ సంస్థ ప్రచారం చేయలేదా? మనిషి పుట్టుక పునాదినే అపవిత్రమైనవని చెప్పడమే కదా దాని అర్థం. ఈ స్థితిలో మీరు సంప్రదాయ
వ్యవసాయ జ్ఞానాన్ని ఉపయోగించాలంటే ఏమిటది?
వేదం పుట్టకముందు పార పుట్టింది. నాగలి పుట్టింది. దున్నపోతు లేబర్తో నాగలి లాగించి మానవ–జంతు సంబంధం పుట్టింది. ఈ దేశంలోని శూద్ర స్త్రీలు కోడిని ఇంటిపక్షిగా మార్చుకుని దాని మాంసం, గుడ్డు తింటే ఆరోగ్యమని కనుక్కున్నది ఈ దేశస్తులే. ఈ రకమైన మన ఉత్పత్తి, స్త్రీలు, పక్షులు, జంతువుల సంబంధం గురించి ఆర్ఎస్ఎస్ మేధావులు ఎన్ని పుస్తకాలు లేదా వ్యాసాలు రాశారు?
ఉత్పత్తి కులాల ద్వారానే వ్యవసాయం అభివృద్ధి చెందింది
ఈ దేశ పశుసంపద, వ్యవసాయ ఉత్పత్తి శూద్రులు, దళితులు, ఆదివాసుల శ్రమ శక్తితో అభివృద్ధి చెందింది. వారికి ఈ దేశ సంస్కృత సాహిత్యం ఏ స్థానమిచ్చింది? సనాతన ధర్మ సిద్ధాంతం ఏ స్థానమిచ్చింది? వారిది పాద పుట్టుక స్థానం.
చదువుకుని, హిందూమతంలోనే పూజారి అయ్యే అవకాశాలులేని స్థానం. ఈ దేశ ద్విజులు పవిత్ర దారంగా భావించే జంజాన్ని కనీసం శూద్ర మగవాళ్లు కూడా వేసుకోలేని స్థానం. ఈ స్థితిని మార్చాలని, వ్యవసాయ రంగానికి, పశుపోషణ రంగానికి, తోటపని రంగానికి ఆధ్యాత్మిక రంగం కనీసం సన్యాసికిచ్చే గౌరవ స్థానాన్నైనా ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ ఈనాటికీ చెబుతోందా!
భూమికి గింజకు సంబంధం కనుగొన్నది శూద్రులే!
రైతాంగాన్ని, బీసీలను, వ్యవసాయ రంగం గురించి, పశుపోషణ గురించి మాట్లాడి సంతృప్తిపరిచి ఓట్లు సంపాదించుకునే ఆలోచనతో ఆర్ఎస్ఎస్ నాయకుడు మాట్లాడాడు. కానీ, వ్యవసాయం, అందులో భాగమైన పశుపోషణ అనేవి ఆర్ఎస్ఎస్ ప్రచారం చేసే సనాతన ధర్మం బయట బతికిన రంగాలు. దీనికి మతాతీత శాస్త్రీయ దృక్పథం అవసరం. భూమికి గింజకు ఉన్న సంబంధాన్ని ఈ దేశ శూద్రులు హరప్పా నగర నిర్మాణం నాటికే కనిపెట్టారు. పంటలు పండించారు. ఆ రంగంపట్ల ఆర్ఎస్ఎస్కు గౌరవం ఉన్న దాఖలాలు వారి రచనల్లో ఎక్కడా లేవు. ఇది చరిత్ర సత్యం.
- కంచ ఐలయ్య షెఫర్డ్-