ఇంధనం అందక పవర్ స్టేషన్ షట్​డౌన్..గాజాలో చీకట్లు

ఇంధనం అందక పవర్ స్టేషన్ షట్​డౌన్..గాజాలో చీకట్లు
  • ప్రస్తుతం జనరేటర్లే దిక్కు.. డీజిల్ అయిపోతే అవీ బంద్
  • ఆస్పత్రుల్లో వేలాది క్షతగాత్రులు
  • మందులు, ఆక్సిజన్​కు కొరత 
  • ఐదో రోజూ కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు
  • రెండువైపులా కలిపి మొత్తం 3,750 మంది మృతి..

జెరూసలెం: హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టడం కోసం ఇజ్రాయెల్ దిగ్బంధించిన గాజా స్ట్రిప్ లో చీకట్లు అలముకున్నాయి. గాజాలో ఉన్న ఒకే ఒక్క పవర్ స్టేషన్ లో ఇంధనం నిండుకోవడంతో అది షట్ డౌన్ అయిపోయింది. దీంతో బుధవారం సాయంత్రం 4.30 గంటల నుంచి గాజాలో కరెంట్ సప్లై పూర్తిగా ఆగిపోయింది. గాజా పవర్ స్టేషన్ లో ఇంధనం అయిపోతోందని, మరికొన్ని గంటల్లోనే విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుందని గాజా ఎనర్జీ అథారిటీ చీఫ్ జలాల్ ఇస్మాయిల్ ప్రకటన చేసిన గంట సమయానికే పవర్ స్టేషన్ షట్ డౌన్ అయిపోయింది. ప్రస్తుతం గాజాలో జనరేటర్లు ఉన్నవారు మాత్రమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందని, డీజిల్ అయిపోతే అవి కూడా బంద్ అవుతాయని ఆయన తెలిపారు. కరెంట్ సప్లై ఆగిపోవడంతో ఇక గాజాలో నీటి సప్లై కూడా పూర్తిగా ఆగిపోనుంది. అలాగే మొబైల్ ఫోన్లు కూడా చార్జింగ్ లేక మూగబోనున్నాయి. 

మరోవైపు వేలాది మంది క్షతగాత్రులతో నిండిపోయిన దవాఖాన్లలో సైతం చీకట్లు అలుముకోవడంతో అక్కడి పేషెంట్ల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. కేవలం 6 నుంచి 12 కిలోమీటర్ల వెడల్పు.. 41 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉన్న గాజా స్ట్రిప్ ప్రాంతానికి ఒక పక్క సముద్రం.. మరోపక్క ఈజిప్టు.. ఇంకోపక్క ఇజ్రాయెల్ భూభాగం ఉన్నాయి. గాజాకు ఫుడ్, మెడిసిన్, వాటర్, కరెంట్ సప్లై వంటివన్నీ ఇజ్రాయెల్ నుంచే అందుతుండేవి. ఇప్పుడు మిలిటెంట్ల దాడులతో తీవ్ర షాక్​కు గురైన ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేస్తోంది. కరెంట్, ఫుడ్, వాటర్, గ్యాస్, మెడిసిన్ వంటి అన్ని సప్లైని నిలిపేసింది.  దీంతో గాజాలోని 23 లక్షల ప్రజల జీవితాలు పెనుసంక్షోభంలో చిక్కుకున్నాయి. 

శిథిలాల కుప్పగా గాజా 

ఇజ్రాయెల్ వరుస బాంబు దాడులతో గాజాలోని ఒక్కో ఏరియా శిథిలాల కుప్పగా మారుతోంది. దీంతో జనం ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందోనని  బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బుధవారం ఐదో రోజు కూడా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్​లు గాజాపై బాంబుల వర్షం కురిపించాయి.

లెబనాన్, సిరియా నుంచి దాడులు..

ఇజ్రాయెల్​పై ఉత్తరాదిన లెబనాన్, సిరియా నుంచి కూడా దాడులు కొనసాగుతున్నాయి. సిరియా, లెబనాన్ నుంచి హిజ్బొల్లా మిలిటెంట్లు చేస్తున్న దాడులను తిప్పికొడుతున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.  గాజాలోని హమాస్ స్థావరాలపై మంగళవారం రాత్రి జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ లో మరో 30 మంది చనిపోయారు. శిథిలాల కుప్పలుగా మారిన భవంతుల కింద చాలా మంది సజీవ సమాధి అయి ఉంటారని భావిస్తున్నారు. 

ఇజ్రాయెల్ లోని 17 మంది బ్రిటిష్ జాతీయుల ఆచూకీ కూడా తెలియడం లేదని, వారు హమాస్ దాడుల్లో మరణించి ఉంటారని భావిస్తున్నారు. వీరిలో పలువురు పిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు. కాగా, ఇజ్రాయెల్ కు సాయంగా అమెరికా పంపిన తొలి విడత అడ్వాన్స్ వెపన్స్, ఎక్విప్మెంట్స్ తో కూడిన కార్గో విమానం బుధవారం చేరుకుందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది. 

3,750కి పెరిగిన మృతులు   

హమాస్ దాడుల వల్ల తమ దేశంలో 1,200 మంది మరణించారని, వీరిలో 155 మంది సోల్జర్లు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో 1,050 మంది చనిపోయారని, 5,100 మంది గాయపడ్డారని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇజ్రాయెల్​లో దాదాపు 1,500 మంది హమాస్ మిలిటెంట్ల డెడ్ బాడీలను గుర్తించినట్లు ఆర్మీ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ రెండు వైపులా కలిపి మొత్తం మృతుల సంఖ్య 3,750కి చేరింది.

ఒక్కో బాంబుకు ఒక్కో బందీని చంపుతాం: హమాస్ 

ఇజ్రాయెల్ హెచ్చరికలు లేకుండా పౌర నివాసాలపై బాంబు దాడులు చేస్తే బందీలను చంపి, ఆ వీడియోలను రిలీజ్ చేస్తామంటూ హమాస్ మరోసారి హెచ్చరించింది. తమ వద్ద 150 మంది బందీలు ఉన్నారని, వారిలో సోల్జర్లు, మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది. గాజా స్ట్రిప్​లోని పౌరుల ఇళ్లపై వేసే ఒక్కో బాంబుకు ఒక్కో బందీని చంపేస్తామని హెచ్చరించింది.