అమ్మాయికి ఫోన్ చేసి… బ్లాక్ మెయిల్ చేసిన సబ్ ఇన్ స్పెక్టర్

అమ్మాయికి ఫోన్ చేసి…  బ్లాక్  మెయిల్ చేసిన సబ్ ఇన్ స్పెక్టర్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎస్.ఐ ఆడియో టేపులు

స్పందించి సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు

శ్రీకాకుళం:  పొందూరు ఎస్.ఐ రామకృష్ణ ఓ అమ్మాయికు ఫోన్ చేసి అసభ్యంగా బ్లాక్ మెయిల్ చేసిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీ నాన్నపై కేసు లేకుండా చేయాలంటే.. నా వద్దకు ఒంటరిగా రా.. అంటే అర్థమైందనుకుంటా.. నేనుండే ప్లేస్ నోట్ చేసుకో.. ఒంటరిగా అంటే.. దాని కోసమే.. అంటూ పలుమార్లు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడు. మద్యం బాటిళ్లు సీజ్ చేసిన వ్యవహారంలో అదుపులోకి తీసుకున్న బాలిక తండ్రిపై 24 గంటలు గడచినా కేసు నమోదు చేయకుండా వేచి చూశాడు.. పలుమార్లు ఫోన్ చేసిన ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో రచ్చ అయింది. అధికారులు స్పందించి ఎస్.ఐ రామకృష్ణపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు.

శ్రీకాకుళం జిల్లాలో పొందూరు మండలం తుంగపేట గ్రామానికి చెందిన అన్నెపు అప్పారావు ఇంట్లో ఎస్.ఐ రామకృష్ణ నిన్న దాడి చేసి 48 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. 24 గంటలు గడుస్తున్నా కేసు నమోదు చేయలేదు.  నిందితుని కుమార్తె పై కన్నేసిన ఎస్.ఐ రామకృష్ణ మీ తండ్రిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే తన కామ కోర్కెలు తీర్చాలంటూ అడిగాడు. అంతేకాకుండా తాను నివాసం ఉంటున్న ఇంటి అడ్రస్ చెప్పి అక్కడికి రావాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అయితే తన తండ్రితో కలిసి స్టేషన్ కు వస్తానని బాధితురాలు ఎస్.ఐ కి చెబితే.. వద్దని వారించాడు. ఇంటికి ఒంటరిగా వస్తేనే కేసు లేకుండా చేస్తానని ఎస్.ఐ రామకృష్ణ పలుమార్లు చెప్పాడు.ఎస్.ఐ దుర్బుద్ధిని గమనించిన సదరు బాలిక కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఎస్.ఐ బారినుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలో పాలు పోని పరిస్థితుల్లో… ఎస్.ఐ సెల్ ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో పెట్టడం.. అవి వెంటనే మీడియాలో బ్రేకింగ్ వార్తలుగా ప్రసారం అయ్యాయి. మీడియాలో రచ్చ కావడంతో ఎస్.ఐ రామకృష్ణ ను సస్పెండ్ చేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు.