రెండుచోట్లా కేసీఆర్ ఓటమి ఖాయం : సిద్ధరామయ్య

రెండుచోట్లా కేసీఆర్ ఓటమి ఖాయం : సిద్ధరామయ్య
  •  మోదీ వంద సార్లు వచ్చినా బీజేపీకి డిపాజిట్లు రావు
  •  ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలని ఫిక్సయ్యారు
  • కామారెడ్డిలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య

కామారెడ్డి: తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ వందసార్లు వచ్చినా బీజేపీకి డిపాజిట్లు వచ్చే  పరిస్థితి లేదని, ఆ పార్టీకి నాలుగు స్థానాలకు మించి రావని అన్నారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ ఓట్లు కొనాలని చూస్తున్నారని, బీఆర్ఎస్ సర్కారును ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఇవాళ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ రెండు సెగ్మెంట్ల లోనూ ఓడిపోతారని అన్నారు. తెలంగాణలో ఏర్పడబోయేది కాంగ్రెస్   ప్రభుత్వమేనని చెప్పారు. బీజేపీ నాయకులు మోదీపై విశ్వాసంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి చిత్తుగా ఓడించబోతున్నారని చెప్పారు. రెండు సార్లు మోదీ తెలంగాణకు వచ్చినా.. బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు  కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల సమయంలో మోదీ కర్నాటక లో 48 సార్లు పర్యటించారని, రోడ్ షోలు, సభల్లో ప్రసంగించారని, ఆయన పర్యటించిన సెగ్మెంట్ల లోనూ కాంగ్రెస్  కు భారీ మెజార్టీ వచ్చిందని చెప్పారు. అక్కడి బీజేపీ లీడర్లు మోదీపై నమ్మకం పెట్టుకున్నారని, అది అబద్ధమై బీజేపీ సర్కారు నేలకూలిందని చెప్పారు. మోదీ, కేసీఆర్ చెప్పే అబద్ధాలను తెలంగాణ ప్రజలు నమ్మ వద్దని అన్నారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్  ప్రభుత్వం నేలకూలి కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.  

బీసీల అభ్యున్నతికి రూ. లక్ష కోట్లు

కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది.  తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ల కాల వ్యవధిలో బీసీల అభ్యున్నతికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని తెలిపింది.50 ఏళ్లు దాటిన పద్మశాలీలకు పెన్షన్ తో పాటు విశ్వకర్మల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేస్తామని పేర్కొంది. బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని తెలిపింది. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పింది.ప్రతి మండలానికీ ఒక బీసీ గురుకులంతో పాటు ప్రతి జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేస్తామంది. బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెడతామని, బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.10లక్షల ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొంది. బీసీ -డీలో ఉన్న ముదిరాజ్ లను బీసీ -ఏలో చేరుస్తామని హామీ ఇచ్చింది.