- కర్నాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
- గవర్నర్ ఆఫీసులో రిజైన్ లెటర్ అందజేత
- అనుకోకుండా సీఎం అయ్యా: సిద్ధరామయ్య
- హైకమాండ్ ఇచ్చిన రాజ్యసభ ఆఫర్ తిరస్కరించానని వెల్లడి
- మరో రెండేండ్లు ఎమ్మెల్యేగానే కొనసాగుతానని ప్రకటన
- బ్రేక్‌ఫాస్ట్ మీటింగులో సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించిన డీకే శివకుమార్
- కొత్త ముఖ్యమంత్రిగా డీకేఎస్ పేరు ఖరారు !
- నేడో రేపో సీఎల్పీ సమావేశం.. కొత్త శాసనసభాపక్ష నేత ఎంపిక
బెంగళూరు: కర్నాటక సీఎం పదవికి సిద్ధరామయ్య(80) రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తన రిజైన్ లెటర్‌ను గవర్నర్‌కు ఇవ్వడానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(డీకేఎస్), పలువురు మంత్రులతో కలిసి లోక్ భవన్‌కు వెళ్లారు. అయితే, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ స్పెషల్ సెక్రటరీ ప్రభు శంకర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు.
ప్రభు శంకర్ కూడా సిద్ధరామయ్య రాజీనామాను కన్ఫామ్ చేశారు. అంతకుముందు సిద్ధరామయ్య బెంగళూరులోని తన అధికారిక నివాసం కావేరిలో మంత్రులకు కన్నడ వంటకాలతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశంలోనే ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని కేబినెట్ మంత్రులకు వెల్లడించారు. తన తర్వాత డీకే శివకుమార్ కర్నాటక సీఎంగా బాధ్యతలు చేపడతారని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
సిద్దరామయ్య కూడా ఆయనను ఆశీర్వదించి ఆలింగనం చేసుకున్నారు. దీంతో కర్నాటకలో మూడేండ్లుగా సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య సాగుతున్న నాయకత్వ వివాదానికి తెరపడినట్లయింది. సిద్ధరామయ్య రిజైన్ వార్త తెలియగానే శివకుమార్ మద్దతుదారులు బెంగళూరులో స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా..
లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఆఫీసులో రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం డీకే శివకుమార్‌తో కలిసి సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ‘‘అందరికీ నమస్కారం. నేనో సాధారణ వ్యక్తిని. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా. సీఎం అవుతానని అనుకోలేదు. మా కుటుంబంలో నా కంటే ముందు ఎవరూ రాజకీయాల్లోనే లేరు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి బుద్ధుడు, బసవన్న, బాబాసాహెబ్ అంబేద్కర్, గాంధీజీల బోధనలను విశ్వసించాను.
సమాజమంతా ఆర్థిక, సామాజిక సమానత్వంతో ఒకే కుటుంబంలా జీవించాలని కోరుకున్నాను’’ అని సిద్ధరామయ్య భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో తనను రాజీనామా చేయాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ కోరిందని తెలిపిన ఆయన.. హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగానే గురువారం రాజీనామా సమర్పించినట్లు చెప్పారు.
‘గవర్నర్ తన పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత నా రాజీనామా లేఖను పరిశీలిస్తారు. ఆయన నా రాజీనామాను ఆమోదిస్తారనే నమ్మకం నాకుంది. ఒక సీఎం రాజీనామా చేసినప్పుడు, కొత్త సీఎంకు మార్గం సుగమం చేయడానికి రాజీనామాను ఆమోదించాల్సి ఉంటుంది. కర్నాటకలో మాకు పూర్తి మెజారిటీ ఉంది. నేనో రాజకీయ నేతను. రాజ్యాంగమే నా మతం. ఓటర్లే నా దేవుళ్లు. నాకు రెండుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా, సీఎంగా ప్రజలకు సేవ చేసే ఛాన్స్ దక్కింది.
కర్నాటకలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నేతల్లో ఒకరిగా నిలిచే అవకాశం కల్పించినందుకు సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి ధన్యవాదాలు’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. తాను 2006లో కాంగ్రెస్‌లో చేరానని.. అప్పటి నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు తనకు మద్దతుగా నిలబడ్డారని సిద్ధరామయ్య గుర్తుచేసుకున్నారు. వారందరికీ థాంక్స్ చెప్పారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తి లేదు..!
హైకమాండ్ తనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసిందని సిద్ధరామయ్య వెల్లడించారు. ‘జాతీయ రాజకీయాల్లోకి రావాలని నన్ను కాంగ్రెస్ హైకమాండ్ అడిగింది. రాజ్యసభ సీటు ఆఫర్ చేసింది. కానీ, నేను తిరస్కరించా. జాతీయ స్థాయి రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు. ఎమ్మెల్యేగానే కొనసాగుతా’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
కాగా.. గురువారం రాత్రి రాహుల్ గాంధీతో భేటీ కోసం సిద్ధరామయ్య ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని జైపూర్ మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
దీంతో రాహుల్, సిద్ధూల భేటీ శుక్రవారం ఉదయం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశానికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సిద్ధరామయ్య స్థానంలో రాష్ట్ర కొత్త సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. ఒకట్రెండు రోజుల్లో సీఎల్పీ భేటీ జరగనుంది. కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమంపై ఇంకా ప్రకటన వెలువడలేదు.
కర్నాటకలో ఐదేండ్ల సీఎంలు ముగ్గురే.. రికార్డు సృష్టించిన నిజలింగప్ప, దేవరాజ్ ఉర్స్, సిద్ధరామయ్య
కర్నాటక రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, కూటముల పతనాలు, పార్టీ ఫిరాయింపులు, అంతర్గత విభేదాలు, హైకమాండ్ జోక్యాల వల్ల చాలామంది సీఎంల పదవీకాలం మధ్యలోనే ముగిసింది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ముగ్గురు సీఎంలే పదవీకాలాన్ని పూర్తి చేసుకోగలిగారు.
పదవీకాలం పూర్తి చేసుకున్న సీఎంలు వీరే..
కర్నాటక(అప్పట్లో మైసూర్ రాష్ట్రం)లో1962 నుంచి 1968 వరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నిజలింగప్ప సీఎంగా తన పూర్తి ఐదేండ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పరిపాలనను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1972 నుంచి 1977 వరకు సీఎంగా పూర్తి కాలం కొనసాగిన రెండో నాయకుడిగా డి.దేవరాజ్ ఉర్స్ నిలిచారు.
భూసంస్కరణలు, బీసీలు, బలహీన వర్గాల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్ర రాజకీయాల్లో శాశ్వత ముద్ర వేశాయి. 2013 నుంచి 2018 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంగా ఐదేండ్ల పూర్తి కాలం ఉన్న మూడో నాయకుడిగా సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. అన్న భాగ్య వంటి సంక్షేమ పథకాలతో పేద, వెనకబడిన వర్గాల ఆదరణను చూరగొన్నారు.
