- ఆటోలో ఉన్న మహిళ, రోడ్డు దాటుతున్న వ్యక్తి స్పాట్ డెడ్
- మరో ఐదుగురికి గాయాలు
గజ్వేల్(వర్గల్), వెలుగు: ఓవర్‌స్పీడ్‌తో దూసుకొచ్చిన కారు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై గౌరారం వర్గల్ కమాన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గజ్వేల్ రూరల్ సీఐ డి.రవిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామానికి చెందిన కట్కూరి అశోక్ కారులో సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నాడు.
అదే సమయంలో గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, వేములఘాట్‌కు చెందిన కొరివి లక్ష్మి(45), కొరివి శ్రీనివాస్ దంపతులు తమ కొడుకు కార్తీక్‌ను 9వ తరగతిలో చేర్పించేందుకు, కుమార్తె విష్ణుప్రియతో కలిసి ఆటోలో వర్గల్ కమాన్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ముందున్న కొరివి శ్రీనివాస్ ఆటోను ఢీకొట్టింది.
దీంతో ఆటో పల్టీలు కొడుతూ రోడ్డు దాటుతున్న ములుగు మండలం క్షీరసాగర్ గ్రామానికి చెందిన కాయితి సత్తయ్య(42)ను ఢీకొట్టి రోడ్డు పక్కన పడింది. మరోవైపు కారు కూడా పల్టీలు కొడుతూ రోడ్డుపక్కన ఉన్న మరో ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో కాయితి సత్తయ్య, ఆటోలో ఉన్న కొరివి లక్ష్మి స్పాట్లో మృతిచెందారు. ఆటో డ్రైవర్ కొరివి శ్రీనివాస్, విష్ణుప్రియతో పాటు కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి.
మృతుడు సత్తయ్యకు భార్య కృష్ణవేణి, కొడుకు లక్ష్మణ్, కూతురు స్నేహ ఉన్నారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. కొరివి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
