అమరవీరుల త్యాగాలు మరువలేనివి : ప్రశాంత్ జీవన్ పాటిల్

అమరవీరుల త్యాగాలు మరువలేనివి :  ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట, వెలుగు: పోలీసుల త్యాగాలు మరువలేనివని సీపీ శ్వేత, కలెక్టర్​ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.  శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.  ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు.  విధి నిర్వహణలో అమరులైన  పోలీసుల కుటుంబ  సభ్యులకు  ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తరఫున ఎప్పుడు అండగా నిలుస్తామన్నారు.  కలెక్టర్​ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. పోలీసులు శాంతి భద్రతల కోసం 24 గంటలు విధులు నిర్వహిస్తూ వారి జీవితాలను ప్రజలకు అంకితం చేస్తున్నారన్నారు. మహిళల రక్షణకు పెద్దపీట వేయడం తో పాటు షీ టీమ్, భరోసా సెంటర్ల ద్వారా ఎన్నో రకాల సేవలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా అమర వీరుల స్తూపానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను సన్మానించారు.

మెదక్​లో..

మెదక్ టౌన్: పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని  కలెక్టర్​ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో  ఫ్లాగ్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ... పోలీసులు 24 గంటలు విధులు నిర్వహిస్తూ వారి జీవితాలను ప్రజలకు అంకితం చేస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలో కోల్పోయిన పోలీసు అమరవీరులను గుర్తు చేసుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించడం కష్టంగాఉంటుందన్నారు. ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని మట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం కత్తి మీద సాములాంటిదని చెప్పారు.  

ఈ సంవత్సరంలో దేశంలో విధినిర్వహణలో 189 మంది వీరమరణం పొందారన్నారు.  పోలీసుల త్యాగాలను సమాజం గుర్తుంచుకునే విధంగా ఈ నెల 31 వరకు విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, రక్త దాన శిబిరాలు, కొవ్వొత్తి ర్యాలీలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.  అనంతరం కలెక్టర్​ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శినిలు అమరుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.  కార్యక్రమంలో  ఏఎస్పీ మహేందర్,  మెదక్, తూప్రాన్​ డీఎస్పీలు ఫణీంద్ర, యాదగిరి రెడ్డి,  శ్రీనివాసరావు, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాశ్ చంద్రబోస్, నాగేశ్వర్ రావ్, అచ్యుత రావ్, భవానీ కుమార్ పాల్గొన్నారు. 

సంగారెడ్డిలో..

సంగారెడ్డి టౌన్ : పోలీస్​ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ రూపేశ్ అన్నారు. ఫ్లాగ్ డే పురస్కరించుకొని పోలీస్ పరేడ్​ గ్రౌండ్​లో స్మృతి పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన నలుగురు జవాన్లు విధి నిర్వహణలో ప్రాణాలర్పించారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. అక్టోబర్ 31 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు.  కార్యక్రమంలో అడిషనల్​ ఎస్పీ అశోక్ , డీఎస్పీలు రాములు నాయక్ ,రమేశ్​ కుమార్ , రఘు , పురుషోత్తం వెంకటరెడ్డి, జనార్దన్, ఇన్స్పెక్టర్ శివలింగం, విజయకృష్ణ , రమేశ్, వెంకట కిషోర్, శ్రీధర్ రెడ్డి, రాజశేఖర్ రామారావు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉందని ఎస్పీ రూపేశ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తనిఖీలు నిర్వహించే సమయంలో ప్రజలతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని, సమస్యను తగ్గించాలి కానీ మనమే సమస్యగా మారకూడదని అన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అల్లర్లు సృష్టించే పాత నేరస్తులను ముందుగా గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. ఎలక్షన్ డ్యూటీలకు వచ్చిన సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు.