రాజీవ్​ రహదారిపై అడుగుకో గుంత.. సిద్దిపేట జిల్లాలో 85 కి.మీ మేర ఖరాబ్

రాజీవ్​ రహదారిపై అడుగుకో గుంత.. సిద్దిపేట జిల్లాలో 85 కి.మీ మేర ఖరాబ్
  • డెయిలీ 15 వేలకు పైగా వెహికల్స్​ జర్నీ
  • స్పీడు కంట్రోల్​ కాక, గుంతల్లో పడి పెరుగుతున్న యాక్సిడెంట్లు

సిద్దిపేట, వెలుగు: రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ను, ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాలను కలిపే రాజీవ్ రహదారి అధ్వానంగా మారింది. వర్షాలకు ఎక్కడికక్కడ కంకర తేలి అడుగో గుంత ఏర్పడింది. మేడ్చల్ ​జిల్లా శామీర్​పేట నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రం వరకు 205 కిలోమీటర్లు విస్తరించి ఉన్న హైవే సిద్దిపేట జిల్లాలో 90 కిలో మీటర్ల మేర సాగుతుంది. దాదాపు 85 కిలోమీటర్ల మేర ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. కంకర తేలి, గుంతలు పడ్డాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే వెహికల్స్ హైదరాబాద్​ఔటర్ రింగ్ రోడ్డు చేరుకోవాలంటే ఇటుగానే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చిన్నా, పెద్ద అన్నీ కలిపి డెయిలీ 15 వేల వెహికల్స్​ తిరుగున్నాయి. గుంతలతో వెహికల్స్ కుదుపులకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

పూడ్చకుంటే ప్రమాదమే

రాజీవ్​రహదారిపై సాధారణంగా వెహికల్స్​80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. వర్షాలకు ముందు కొంత మేర రిపేర్లు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సిద్దిపేట, గౌరారం మధ్య భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల దుద్దెడ, గౌరారం వద్ద గుంతలను తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో స్పీడుగా వెళ్తున్న వెహికల్స్​ఒకదానికొకటి ఢీకొన్నాయి. పలువురు బైకర్లు స్కిడ్​అయి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా కొమురవెల్లి గేట్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు రోడ్డు దారుణంగా ఉంది. పదేండ్ల కింద హైవేను విస్తరించే టైంలో మలుపులను సరిచేయాలని జనం ఆందోళనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి అసెంబ్లీ హౌజ్ కమిటీని వేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ ప్రమాదకరమైన మలుపులను సవరించలేదు. టోల్​ వసూలుపై దృష్టి పెడుతున్న  ప్రైవేట్​ కంపెనీ రిపేర్లను పట్టించుకోవడం లేదని  జనం మండి పడుతున్నారు. 

ఇసుక, బొగ్గు లారీల వల్లే..

శామీర్​పేట, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, శనిగరం, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్ నగర్ గోదావరిఖని మీదుగా జైపూర్ క్రాసింగ్ వరకు సాగే హైవే నిత్యం రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా సింగరేణి కంపెనీకి చెందిన బొగ్గును, గోదావరి ఖని నుంచి ఇసుకను లారీల్లో హైదరాబాద్​కు రవాణా చేస్తుంటారు. కార్లు, బైకులు, ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే రిపేర్లు చేయించాలని, లేకుంటే ప్రమాదాలు పెరిగే అవకావం ఉందని జనం అభిప్రాయపడుతున్నారు.