- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
సిద్దిపేట రూరల్, వెలుగు: అనుమానాస్పద స్థితిలో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని సురభి మెడికల్ ఇన్స్టిట్యూట్లో జరిగింది. త్రీటౌన్ సీఐ టి. లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన ఈద శ్రీజ(20) సురభి మెడికల్ ఇన్స్టిట్యూట్లో బీపీటీ(ఫిజియోథెరపీ) ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాగా, ఆమె ఆదివారం ఉదయం కాలేజీ హాస్టల్ లోని తన రూమ్లో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయింది.
తనతో పాటు రూమ్ లో ఉండే మరో ఇద్దరు విద్యార్థినులు టిఫిన్ చేయడానికి క్యాంటీన్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వారు ఆమెను టిఫిన్ కోసం పిలిచినప్పటికీ ఆమె రానని చెప్పి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
శ్రీజ తల్లిదండ్రులు గతంలోనే చనిపోగా, ఆమె మేనమామ సట్టు బాపు చదివిస్తున్నాడు. కాగా బాపుకు మూడు రోజుల కింద పెద్దపల్లికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఫోన్ చేసి తనకు శ్రీజ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందని, తనను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
ఆమె ఇతరులతో మాట్లాడుతోందని చెప్పి ఫోన్ కట్ చేశాడని, శ్రీజ మృతి విషయంలో శ్రీధర్ పై అనుమానం ఉందని మృతురాలి మేనమామ బాపు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలాఉంటే శ్రీజ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
