అమెరికాలో మూతపడిన మరో బ్యాంకు.. బైడెన్ భరోసా

అమెరికాలో మూతపడిన మరో బ్యాంకు.. బైడెన్ భరోసా

అమెరికా బ్యాంకింగ్ రంగం అతిపెద్ద  సంక్షోభానికి దారి తీస్తుందో..? అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థలో ఏం జరుగుతోంది..? వరుసగా బ్యాంకులు ఎందుకు మూతపడుతున్నాయి...? ప్రస్తుతం ప్రపంచాన్ని తొలుస్తున్న ప్రశ్నలివే. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ ప్రకంపనలు కొనసాగుతుండగానే..మరో బ్యాంకు మూతబడింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సిగ్నేచర్‌ బ్యాంక్‌ను మూసివేస్తున్నట్లు  అమెరికా నియంత్రణ సంస్థలు ప్రకటించాయి. హ‌ఠాత్తుగా మూత‌బ‌డ‌డంతో బ్యాంకు ముందు కస్టమర్లు క్యూ క‌ట్టారు. అటు రెండు అతిపెద్ద బ్యాంకులు దివాలా తీయడం అమెరికా బ్యాంకింగ్ చరిత్రలో మూడవ అతిపెద్ద వైఫల్యం. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో కుప్పకూలిన వాషింగ్టన్ మ్యూచువల్ బ్యాంకు తర్వాత  US చరిత్రలో రెండవ అతిపెద్దదిగా సిలికాన్ వ్యాలీ,  సిగ్నేచర్ బ్యాంకుల మూసివేత ఘటన నిలవడం గమనార్హం. 

మరోవైపు సిగ్నేచర్ బ్యాంకును మూసివేసిన తర్వాత  తన నియంత్రణలోకి తీసుకున్నట్లు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్  స్పష్టం చేసింది. సిగ్నేచర్ బ్యాంకుకు ముగిసే సరికి 110.36 బిలియన్ డాలర్ల ఆస్తి.. 88.59 బిలియన్ డాలర్ల డిపాజిట్లను కలిగి ఉంది.  ప్రస్తుతం బ్యాంక్ డిపాజిటర్లు వారి  నిధులను తీసుకునేందుకు అనుమతి ఉంటుందని FDIC వెల్లడించింది.  ఇందుకోసం తాత్కాలికంగా ఒక బ్రిడ్జ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సిగ్నేచర్ బ్యాంక్ కస్టమర్లు, డిపాజిట్ దారులు..తమ నిధులకు బ్రిడ్జ్ బ్యాంకు ద్వారా యాక్సెస్ పొందొచ్చని సూచించింది. బ్రిడ్జి్ బ్యాంకు ప్రకారం... సిగ్నేచర్ బ్యాంక్ డిపాజిటర్లు, డిపాజిట్ దారులు.. ఆటోమెటిక్ గా బ్రిడ్జ్ బ్యాంక్ కస్టమర్లుగా మారనున్నారు. 

సిగ్నేచర్ బ్యాంక్ తన వ్యాపార కార్యకలాపాలను 2001లో న్యూయార్క్ కేంద్రంగా  ప్రారంభించింది. సిగ్నేచర్ బ్యాంకు ఒక వాణిజ్య బ్యాంక్.  స్థిరాస్తి, డిజిటల్ అసెట్స్ బ్యాంకింగ్ సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో సేవలు అందిస్తోంది. 2022 సెప్టెంబర్ వరకు ఈ బ్యాంక్ డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో సెక్టార్ నుంచి వచ్చినవే. క్రిప్టో ఆధారిత డిపాజిట్లను త్వరలో 8 బిలియన్ డాలర్లకు కుదించుకుంటామని డిసెంబర్‌లో సిగ్నేచర్ బ్యాంకు ప్రకటించడం గమనార్హం. 

బైడెన్ స్పందన..

రెండు  రోజుల్లో రెండు పెద్ద బ్యాంకులు మూసివేయడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సీరియస్ అయ్యారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనానికి కారణమైన  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కస్టమర్ల డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని..ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. 

సిలికాన్ వ్యాలీ బ్యాంకు మూసివేత..

అమెరికాలో ఆదివారం అక్కడి అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ను అధికారులు మూసివేశారు. SVB బ్యాంకు డిపాజిటర్లు పెద్ద ఎత్తున నిధులు ఉపసంహరించుకోవడంతో ఆ బ్యాంకు దివాలా తీసిందని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్ స్పష్టం చేశారు. దీంతో పాటు..అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ ర్టేలను భారీగా పెంచడం కూడా ఇందుకు కారణమన్నారు. వడ్డీ రేట్లు పెరగడం వల్ల సిలికాన్ వ్యాలీ బ్యాంకు బాండ్లు, సెక్యూరిటీల మార్కెట్ విలువ పడిపోయిందని చెప్పారు. సిలికాన్ వ్యాలీ బ్యాంకులో 37వేలకు పైగా స్టార్టప్ సంస్థలు అకౌంట్స్ కలిగి ఉన్నాయి. వీటిలో 10 వేలకుపైగా ఈ బ్యాంకుతో ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. బ్యాంకు మూసివేయడంతో ప్రస్తుతం  ఆ లావాదేవీలన్నీ ఆగిపోయాయి. ఈ ప్రభావం ఉద్యోగులపై  ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఒక్కో కంపెనీ 10 మంది ఉద్యోగులను తొలగించినా లక్షకుపైగా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని చెప్తున్నారు.