
సిల్కీ చోప్రా హరోత్రా... బొద్దుగా ఉన్నందుకు బాడీ షేమింగ్‌ని ఎదుర్కొంది. అలాగని బాధపడుతూ కూర్చోలేదు. ఆ మాటల్ని సవాల్‌గా తీసుకుంది. తనను వెక్కిరించిన వాళ్లకు స్టైల్‌తోనే సమాధానం ఇవ్వాలనుకుంది. అంతేకాదు లావుగా ఉన్నామని బాధపడే అమ్మాయిలకు ‘ప్లస్ సైజ్ కూడా స్టైల్గానే ఉంటుంద’ని చెప్పాలనుకుంది. అనుకున్నట్టుగానే ష్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టింది. అంతేకాకుండా ఈ ఏడాది ‘సిల్కీ: భూత్ నహీ హోతె’ అనే షార్ట్ ఫిల్మ్‌లో లీడ్ రోల్ చేసింది.
చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉండేది సిల్కీ చోప్రా. దాంతో స్కూల్లో ఫ్రెండ్స్, చుట్టాల పిల్లలు, ఆఫీస్‌లో కొలిగ్స్ ఆమెని చూసి ‘ఇంత లావుగా ఉన్నావేంటి?’ అని రకరకాలుగా కామెంట్ చేసేవాళ్లు. సినిమా లేదా సీరియల్ ఛాన్స్ కోసం ఆడిషన్‌కి వెళ్లిన చోటల్లా ఆమె టాలెంట్ కంటే ఆమె బరువుని చూసి కామెంట్ చేసేవాళ్లు. ‘ ప్లస్ సైజ్ క్యారెక్టర్ ఇస్తాం’ అనేవాళ్లు. వాళ్ల మాటలు విన్నాక తనకు సినిమాల్లో హీరోయిన్, సీరియల్లో లీడ్ రోల్ చేసే ఛాన్స్ రాదనే విషయం అర్థమైంది సిల్కీ చోప్రాకు.
లీడ్ రోల్ ఛాన్స్ వచ్చిందిలా
జనం ఫేస్ చేసే సమస్యల మీద వెబ్ సిరీస్‌లు తీస్తుంటాడు ఫిల్మ్ డైరెక్టర్ జగత్ జూన్. బాడీ షేమింగ్ రోల్ కోసం ఆయన సిల్కీని అడిగాడు. వెంటనే ‘ఓకే’ చెప్పింది. అయితే ఆ ప్రాజెక్ట్ మొదలుకాలేదు. ఆ తర్వాత ‘సిల్కీ: భూత్ నహీ హోతె’ అనే థ్రిల్లర్, హారర్ జానర్ షార్ట్ ఫిల్మ్‌లో లీడ్ రోల్ అవకాశం ఇచ్చాడు జగత్. ప్లస్ సైజ్‌తో సంబంధంలేని రోల్. లావుగా ఉన్నా కూడా మంచి రోల్స్ వస్తాయని చెప్పాలనే తన కోరిక నెరవేరినందుకు సంతోషించింది సిల్కీ.
పాజిటివ్‌గా ఉండేదాన్ని
‘‘నా శరీరం తీరు గురించి ఎంతమంది కామెంట్ చేసినా పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన డ్రెస్‌లు వేసుకునేదాన్ని. నా ఇష్టాలు తెలిసి అమ్మ బాగా సపోర్ట్ చేసేది. లావుగా ఉన్న ఆడవాళ్లకు ‘నలుగురూ ఏమనుకుంటారోనని ఆలోచించొద్దు. మిమ్మల్ని మీరు ఇష్టపడండి. ప్లస్ సైజ్ కూడా ఒక స్టైలే’ అని చెప్తాను” అంటోంది సిల్కీ చోప్రా.