- గత ఏడాది కాలంగా పెరుగుతూనే ఉన్న సిల్వర్
- సమీప కాలంలో ధరలు తగ్గే అవకాశం: ఎనలిస్టులు
- బంగారం ధరలూ పైకే
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో కూడా వెండి పరుగు ఆగడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో మొదటిసారిగా రూ.3 లక్షలు దాటింది. కేజీ ధర సోమవారం రూ.10 వేలు పెరిగి రూ.3,05,000 కి చేరింది. హైదరాబాద్ వంటి సిటీలలో రూ.3.18 లక్షల వరకు పలుకుతోంది. ట్రంప్ యూరప్ దేశాలపై టారిఫ్‌లు వేస్తుండడంతో వెండి దూసుకుపోతోంది. అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సిల్వర్‌కు ఇండస్ట్రీల నుంచి డిమాండ్ పెరగడం కలిసొస్తోంది. ముఖ్యంగా సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లలో వెండి అవసరం పెరగడం వల్ల సరఫరాను మించి డిమాండ్ ఉంది. 2026లో గ్లోబల్ డెఫిసిట్ 23 కోట్ల ఔన్సులు (ఒక యూనిట్ బరువు 28 గ్రాములు)గా ఉందని అంచనా. అంటే ఇంత వెండి అవసరం ఉన్నా, సరఫరా లేదని అర్థం. ఇక జియోపొలిటికల్ ఉద్రిక్తతలు కూడా వెండిని సేఫ్- హెవెన్ ఆస్తిగా మార్చాయి. అమెరికా–యూరప్ మధ్య కొత్త టారిఫ్ బెదిరింపులు, ఇరాన్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాలు పెట్టుబడిదారులను స్టాక్ మార్కెట్ వంటి రిస్కీ ఆస్తుల నుంచి దూరం చేసి బంగారం, వెండి వైపు చూసేలా చేస్తున్నాయి. గ్లోబల్‌గా వెండి ఔన్సు ధర 93 డాలర్లకు చేరడం, గోల్డ్–సిల్వర్ రేషియో చారిత్రాత్మక స్థాయికి తగ్గడం, దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్‌కు సంకేతాలుగా ఎనలిస్టులు భావిస్తున్నారు.
టెక్నికల్‌గా చూస్తే..
ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని టెక్నికల్ ఎనలిస్టులు తెలిపారు. ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌లో బేరిష్ సంకేతాలు ఇస్తోందని, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గడం వంటి సంకేతాలు లాభాలను బుక్ చేసుకోవాలని సూచిస్తున్నాయని తెలిపారు. ఫిబొనాకి లెవెల్స్ ప్రకారం, వెండి ఇప్పటికే 61.8శాతం రెసిస్టెన్స్‌ను తాకింది. వెండికి 99–100 డాలర్ల వద్ద (సుమారు రూ.3.2 లక్షలు), 107 డాలర్ల వద్ద (రూ3.4 లక్షలు) రెసిస్టెన్స్ ఉంది.
రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేయాలంటే?
రిటైల్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో వెండిని ఒక భాగంగా ఉంచి డైవర్సిఫికేషన్ సాధించాలని నిపుణులు చెబుతున్నారు. ఫిజికల్ మెటల్‌లో ప్యూరిటీ, స్టోరేజ్, రీసేల్ వంటి సమస్యలు ఉండగా, సిప్‌లతో సిల్వర్ ఫండ్స్, ఈటీఎఫ్‌లలో క్రమంగా ఇన్వెస్ట్ చేయొచ్చని వివరించారు. వెండి ధరలు దీర్ఘకాలంలో మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్‌లో ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించొచ్చని తెలిపారు. పెట్టుబడిదారులు ధరల వెంబడి పరుగెత్తకుండా, పోర్ట్‌ఫోలియోని బ్యాలెన్స్ చేసుకోవడానికి వెండిలో ఇన్వెస్ట్ చేయాలని సలహా ఇచ్చారు.
గోల్డ్ ధర రూ.2,460 జంప్..
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ (24 క్యారెట్ల) ధర సోమవారం రూ.2,460 పెరిగి రూ.1,46,240 కి చేరింది. ఢిల్లీలో రూ.1,46,390 వద్ద కొత్త రికార్డ్ నమోదు చేసింది.
