ఇటీవలి కాలంలో రోజురోజుకూ పెరుగుతున్న వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేవలం కొన్ని నెలల్లోనే వెండి రేట్లు ఊహించని రీతిలో పెరగడం వెనుక రాబోయే కేంద్ర బడ్జెట్ 2026 కు సంబంధించిన అంచనాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ప్రజలు ఒక్కసారిగా వెండిని ఎంతరేటైనా కొనేందుకు ఎందుకు వెళుతున్నారు.
దేశంలో వెండికి డిమాండ్ భారీగా పెరిగింది. గడిచిన ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో వెండి దిగుమతులు అంతకు ముందు సంవత్సరంలోని సమయంతో పోలిస్తే ఏకంగా 129 శాతం పెరిగి 7.77 బిలియన్ డాలర్లకు చేరాయి. సాధారణంగా పండుగ సీజన్‌లో పెరగాల్సిన దిగుమతులు, ఈసారి సీజన్ ముగిసిన తర్వాత కూడా అదే స్థాయిలో కొనసాగడం గమనార్హం. వెండి ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడి ఉండటంతో భారత్ భారీగా ఫారెక్స్ రిజర్వులను వాడాల్సి వస్తోంది.
బడ్జెట్ అంచనాలు - సుంకాల పెంపు..?
గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెండిపై దిగుమతి సుంకాన్ని 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న దిగుమతి బిల్లును కట్టడి చేయడానికి ఈసారి బడ్జెట్‌లో సుంకాలను మళ్లీ పెంచే అవకాశం ఉందనే ఊహాగానాలు మార్కెట్లో వినిపిస్తున్నాయి. దిగుమతి సుంకం 15 శాతానికి చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నారు. ఈ అంచనాలే వెండి రేట్లను మరింత పెరగడానికి కారణంగా మారుతున్నట్లు తేలింది.
బడ్జెట్‌లో పన్నులు పెరుగుతాయనే ముందస్తు అంచనాతో బులియన్ డీలర్లు వెండిపై భారీగా ప్రీమియం వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం MCX మార్కెట్లో వెండి ధరలు సాధారణ ల్యాండెడ్ కాస్ట్ కంటే అది దిగుమతి అయిన రేటు కన్నా సుమారు రూ.40వేలు అధికంగా ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. బడ్జెట్ సమాచారం ముందే లీక్ అయి ఉండవచ్చని.. అందుకే ధరల్లో ఇంత వ్యత్యాసం కనిపిస్తోందని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫౌండేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై సెబీ విచారణ జరపాలని కూడా కోరుతున్నారు.
జ్యువెలరీ రంగానికి ఇబ్బందులు..
వెండి ధరలు గత ఏడెనిమిది నెలల్లో మూడు రెట్లు పెరగడంతో పాటుగా దానిపై అదనపు ప్రీమియంలు తోడవ్వడం వల్ల నగల వ్యాపారులు డబ్బు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ధరల హెచ్చుతగ్గుల వల్ల హెడ్జింగ్ చేయడం కష్టంగా మారిందని వారు ఆవేదన చెందుతున్నారు. బంగారం విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నప్పటికీ.. వెండి విషయంలో మాత్రం బడ్జెట్ నిర్ణయాలు కీలకంగా కానున్నాయి. ఒకవేళ ప్రభుత్వం సుంకాలు పెంచితే.. అది మార్కెట్లో వెండి లభ్యత, ధరలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టమౌతోంది.
