
పారిస్: ఆరోసారి వరల్డ్ చాంపియన్‌షిప్ మెడల్‌ను గెలవాలన్న తెలుగు షట్లర్ పీవీ సింధు కల నెరవేరలేదు. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో 15వ సీడ్ సింధు 14–21, 21–13, 16–21తో 9వ సీడ్ పుత్రి కుసుమ వార్దాని (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నది. 64 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సింధు గట్టి పోటీ ఇచ్చినా గేమ్ ఫినిషింగ్ అనుకున్న స్థాయిలో లేకపోయింది.
2–2 ముఖాముఖి రికార్డుతో ఆట మొదలుపెట్టిన సింధు తొలి గేమ్‌లో నిరాశపర్చినా రెండో గేమ్ గెలిచి సత్తా చాటింది. కానీ డిసైడర్‌లో మళ్లీ తడబడింది. మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో 15–21, 13–21తో చెన్ టాంగ్ జి–టోహ్ ఈ వీ (మలేసియా) చేతిలో కంగుతిన్నారు.