జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీల రీజాయినింగ్

జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీల రీజాయినింగ్
  • సూత్రప్రాయంగా అంగీకరించిన సింగరేణి

హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీలుగా (జేఎంఈటీ) పనిచేసి.. వివిధ కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించిన 43 మందిని తిరిగి నియమించుకునేందుకు సంస్థ యాజమాన్యం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్ విద్యానగర్‌‌లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌‌తో యాజమాన్యం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. విధులకు గైర్హాజరు, అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించకపోవడం వంటి కారణాలతో జేఎంఈటీలను గతంలో ఉద్యోగాల నుంచి తొలగించారు.

 అయితే, మానవతా దృక్పథంతో వీరిని తిరిగి నియమించాలని గుర్తింపు కార్మిక సంఘం గతేడాది నవంబర్‌‌లో డైరెక్టర్ (పర్సనల్) స్థాయి సమావేశంలో, ఈ ఏడాది మార్చిలో చైర్మన్ స్థాయి  సమావేశంలో అజెండాగా చర్చించింది. జూన్ 27న జరిగిన 51వ నిర్మాణాత్మక సమావేశంలో ద్వైపాక్షిక అంగీకారం కుదిరింది. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం ఖరారైంది. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులు, సింగరేణి తరఫున డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పొట్రు, జనరల్ మేనేజర్ (సీపీపీ) ఎ. మనోహర్, జనరల్ మేనేజర్ (పర్సనల్) కవితా నాయుడు, హెచ్‌‌వోడీ (ఎంఎస్) రవి బొజ్జా, కార్మిక సంఘం తరఫున అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె.రాజ్ కుమార్, నాయకులు కె. వీరభద్రయ్య, ఎం.సమ్మయ్య, మద్ది ఎల్లయ్య, వైవీ రావు పాల్గొన్నారు.

ఒప్పంద వివరాలు..

ఈ 43 మంది జేఎంఈటీలకు ఇది తాజా నియామకంగా పరిగణించబడుతుంది. వీరు సంస్థ ఏర్పాటు చేసే హై పవర్ కమిటీ ఎదుట సర్వీసు వివరాలు, ఓవర్‌‌మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు సమర్పించాలి.-వైద్య పరీక్షల ఆధారంగా ప్రాథమిక నియామక ఉత్తర్వులు జారీ అవుతాయి.- తిరిగి చేరిన వారు మొదటి సంవత్సరంలో కనీసం 190 మస్టర్లకు విధులు నిర్వహించాలి.