సింగరేణికి బ్యాటరీ సిరులు...మందమర్రి లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం సక్సెస్

సింగరేణికి బ్యాటరీ సిరులు...మందమర్రి లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం సక్సెస్
  • నాలుగు నెలల్లోనే సత్పలితాలు3,35,485 యూనిట్ల 
  • విద్యుత్​నిల్వతో సంస్థకు రూ.25.66 లక్షల మిగులు
  • ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుకు సన్నాహాలు  

కోల్​బెల్ట్, వెలుగు: సోలార్​విద్యుత్​ను నిల్వ చేసి సద్వినియోగం చేసుకునే వినూత్న ప్రయోగం ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​సిస్టం’  సింగరేణికి సిరులు కురిపిస్తోంది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని 28మెగావాట్ల సోలార్​ప్లాంట్​లో తొలిసారిగా సింగరేణి యాజమాన్యం మెగావాట్​సామర్థ్యంతో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​సిస్టం(బీఈఎస్ఎస్) సత్ఫలితాలనిస్తోంది. దీనిద్వారా పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్​విద్యుత్​లో వినియోగించుకోని విద్యుత్​ను ఫ్రీగా గ్రిడ్​కు సప్లై చేయకుండా, బ్యాటరీలో నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకునే వ్యవస్థను రూపొందించారు. ఈ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటిదిగా గుర్తింపు పొందింది. నాలుగు నెలల కాలంలో స్థానిక అవసరాలకు విద్యుత్​ను వినియోగించగా మిగిలిన యూనిట్లను బీఈఎస్ఎస్​ద్వారా నిల్వ చేయడంతో సింగరేణి సంస్థకు ఏకంగా రూ.25.66 లక్షల లబ్ధి చేకూరింది.

వృథాను అరికట్టేందుకే..

సింగరేణి ఆధ్వర్యంలో మందమర్రిలోని మైన్స్, కార్మికవాడల అవసరాల కోసం 28 మెగావాట్ల సోలార్​ప్లాంట్​ను ఐదేండ్ల క్రితం ఏర్పాటు చేశారు. దీని​ద్వారా ఉత్పత్తయ్యే సోలార్ పవర్​ను మందమర్రి, శ్రీరాంపూర్​ఏరియాల్లోని 11 అండర్​గ్రౌండ్​మైన్స్, 4ఓపెన్​కాస్ట్​గనులు, ఇతర పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ ప్లాంట్​తో రోజుకు సగటున లక్షా 34 వేల యూనిట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుఓ సుమారు లక్షా 14వేల యూనిట్లను కంపెనీ వినియోగించుకుంటోంది. కాగా మిగతా దాదాపు 20 వేల యూనిట్లు వృథా అవుతోంది. మధ్యాహ్నం వేళ కార్మికులకు భోజన విరామ సమయం ఉండడం, యంత్రాలు కూడా విశ్రాంతిగా ఉండటం వల్ల కరెంట్​ను వినియోగించడంలేదు. 

దీన్ని స్థానిక సబ్ స్టేషన్ ద్వారా తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్)కు ఫ్రీగా అందజేయాల్సి వస్తోంది. ఇన్​హౌజ్​క్యాప్టివ్​పవర్​ప్లాంట్​ద్వారా ఈ మిగులు విద్యుత్.. రాష్ట్ర విద్యుత్​శాఖ లైన్లలో కలుస్తోంది. కాబట్టి ఈ కరెంటుకు డిస్కం ఎలాంటి ఛార్జీలు చెల్లించడంలేదు. ఇలా ఫ్రీగా పోతున్న 20 వేల యూనిట్ల సోలార్​విద్యుత్​ను సద్వినియోగం చేసుకోవడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​ సిస్టం ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించి ఇప్పటికే 8 చోట్ల 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటిలో 147 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఓపెన్ యాక్సెస్ ప్లాంట్లుగా, మిగిలిన 98.50 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఇన్ హౌజ్ ప్లాంట్లుగా గుర్తించి తెలంగాణ  విద్యుత్ గ్రిడ్​లకు అనుసంధానం చేసింది. 

నాలుగు నెలల క్రితం ప్రారంభం

గతంలో సింగరేణి సంస్థ శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లోని 15 గనుల అవసరాలకు నెలకు రూ.13కోట్ల విలువైన విద్యుత్​ను డిస్కం నుంచి కొనుగోలు చేసేది. కాగా 2021 ఏప్రిల్​17న 28 మెగావాట్ల సోలార్​పవర్​ప్లాంట్​ ఏర్పాటు చేసి సొంత అవసరాలకు కూడా ఇదే పవర్​ను వినియోగించడంతో నెలకు రూ.4 కోట్లు ఆదా అవుతోంది. మిగిలిన 20వేల యూనిట్ల కరెంట్​ను ఎలాంటి ప్రయోజనం లేకుండా గ్రిడ్​కు సరఫరా చేయాల్సి వచ్చింది. అయితే ఈ మిగులు విద్యుత్​ను కూడా సొమ్ము చేసుకోవాలని రాష్ట్ర సర్కార్​ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా మందమర్రిలోని 28 మెగావాట్ల ప్లాంట్​కు అనుబంధంగా రూ.2.5 కోట్లు వెచ్చించి ఒక మెగావాట్​ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టంను పైలట్​ప్రాజెక్టు కింద ఏర్పాటు చేశారు. 

నాలుగు నెలల కాలంలో స్థానిక అవసరాలకు విద్యుత్​ను వినియోగించగా మిగిలిన 3,35,485 యూనిట్లను బాటరీ ఎనర్జీ సిస్టం ద్వారా నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వినియోగించుకుంది. తద్వారా సంస్థకు రూ.25,66,460 లబ్ధి చేకూరింది. ఒక మెగావాటు సామర్థ్యం గల బీఈఎస్ఎస్ యూనిట్ ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్తును ఆదా చేస్తూ విజయవంతమవడంతో సింగరేణి యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సింగరేణిలోని ఇతర ప్రాంతాల్లో మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు గురువారం ప్రకటించింది.