రాష్ట్ర సర్కార్ తీరుతో దివాలా దిశగా సింగరేణి..

రాష్ట్ర సర్కార్ తీరుతో దివాలా దిశగా  సింగరేణి..
  • రాష్ట్రం వచ్చే నాటికి రూ.3,500 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్
  • ప్రస్తుతం రూ.8,500 కోట్ల దాకా అప్పులు 
  • రాష్ట్ర సర్కార్ తీరుతో దివాలా దిశగా సంస్థ
  • ఉద్యోగుల జీతాలు, బిల్లుల చెల్లింపులకు లోన్లే దిక్కు 
  • పెట్టుబడులకు పైసల్లేక ప్రారంభానికి నోచుకోని గనులు 
  • సింగరేణికి 13 వేల కోట్లు బకాయి పడ్డ ప్రభుత్వం 
  • అవి చెల్లించకపోగా సంస్థ నిధులే ఖర్చు చేయిస్తున్న సర్కార్  

భద్రాద్రి కొత్తగూడెం/ మందమర్రి, వెలుగు: తెలంగాణ వచ్చిన కొత్తలో రూ.3,500 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ తో పటిష్టంగా ఉన్న సింగరేణి సంస్థ.. ప్రస్తుతం దివాలా దిశగా వెళ్తోంది. నాడు తన వద్ద ఉన్న డబ్బును ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో బాండ్ల రూపంలో పెట్టుబడులు పెట్టిన సంస్థే.. ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు నెల నెలా అప్పులు తెస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఎస్​బీఐ సహా పలు బ్యాంకుల నుంచి సింగరేణి ఏకంగా రూ.8,500 కోట్ల వరకు అప్పు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ విద్యుత్​సంస్థల నుంచి రూ.13 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకపోవడం వల్లే సింగరేణి అప్పుల పాలైందని సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గడిచిన కొన్నేండ్లుగా కొత్త ప్రాజెక్టులు చేపట్టకపోవడానికి, నైని లాంటి కోల్​బ్లాక్​లో బొగ్గు ఉత్పత్తి చేయకపోవడానికి ఇదే కారణమంటున్నారు. ఏటా కొన్ని బకాయిలు చెల్లించి సింగరేణిని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ పని చేయకుండా సంస్థ నుంచే నిధులు తీసుకోవడాన్ని కార్మిక సంఘాల నేతలు తప్పు పడుతున్నారు.

బొగ్గు, కరెంట్​అమ్మకాలకు సంబంధించి సింగరేణికి రావాల్సిన బకాయిలు రూ.17,899 కోట్లు ఉండగా, అందులో రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్​సంస్థల నుంచి రావాల్సినవే ఏకంగా రూ.13,172 కోట్ల మేర ఉన్నాయి. వీటిని ఇప్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర సర్కార్... డిస్ట్రిక్ట్​ మినరల్ ఫౌండేషన్​ట్రస్ట్ (డీఎంఎఫ్​టీ) కింద అభివృద్ధి పనుల​పేరిట నియోజకవర్గాల్లో ఏటా రూ.500 కోట్ల చొప్పున సింగరేణి నిధులే ఖర్చు పెట్టిస్తోంది. ఇప్పటి వరకు డీఎంఎఫ్​టీ రూపంలో సింగరేణి నుంచి రూ.2,740 కోట్లు తీసుకుంది. ఇక సీఎస్సార్​కింద  ఏటా రూ.230 కోట్లు ఖర్చు చేయిస్తోంది. ఇవి చాలవన్నట్లు కోల్​బెల్ట్​నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల పేరుతో 12 మంది ఎమ్మెల్యేలకు నెలనెలా రూ.2 కోట్ల చొప్పున రూ.24 కోట్లు ఇప్పిస్తోంది. కరోనా సాయం అంటూ గతేడాది రూ.40 కోట్లు తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా రామగుండంలో కట్టబోయే మెడికల్ కాలేజీకి రూ.500 కోట్లు సింగరేణి నుంచి ఇచ్చేలా ఒప్పించింది. రాష్ట్ర సర్కార్ కనుసన్నల్లో పని చేస్తున్న సీఎండీ శ్రీధర్ ప్రభుత్వం ఏది చెబితే దానికి ఊకొట్టడం వల్లే సింగరేణి దివాలా దిశగా వెళ్తోందని కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. 

పెట్టుబడులకు పైసల్లేవ్​.. జీతాలకు కటకట.. 

సింగరేణి ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ఉద్యోగుల జీతాలకు, కొత్త గనుల తవ్వకానికి, మెటీరియల్ కొనుగోలుకు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు యాజమాన్యం తిప్పలు పడుతోంది. పెట్టుబడులకు పైసల్లేక ఒడిశాలోని నైని బ్లాక్​లో ఇప్పటికీ ఉత్పత్తి ప్రారంభించలేదు. రాష్ట్రంలో పర్మిషన్ ఉన్న తాడిచెర్ల–2, కొత్తగూడెంలోని పెనగడప, కొత్తగూడెం వీకే7 తదితర కొత్త గనులను ప్రారంభించడం లేదు. ఓసీపీ ఓబీ కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్లు​కార్మికులకు నెలనెలా వేతనాలు ఆలస్యంగా చెల్లిస్తున్నారు. సింగరేణి నుంచి డబ్బు రాకపోవడంతో వివిధ కంపెనీలు సకాలంలో మెటీరియల్ సప్లై చేయడం లేదని, దీని ప్రభావం ఉత్పత్తిపై పడుతోందని ఆఫీసర్లు అంటున్నారు. కార్మికులకు ట్రీట్​మెంట్​అందించే 72 కార్పొరేట్​హాస్పిటళ్లకు సింగరేణి రూ.800 కోట్ల మేర బిల్లులు బకాయి పడింది. దీంతో కోల్​బెల్ట్​నుంచి వెళ్లే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ఆయా ఆసుపత్రులు తిప్పి పంపుతున్నాయి. పోయినేడాది అక్టోబర్​లో కార్మికులకు లాభాల్లో వాటా కింద రూ.79.07 కోట్లు, పండుగ అడ్వాన్స్​కోసం రూ.70 కోట్లు, దీపావళి బోనస్​కింద రూ.300 కోట్లు సింగరేణికి అవసరం పడ్డాయి. కానీ చేతిలో అంత డబ్బు లేకపోవడంతో  రూ.500 కోట్ల అప్పు కోసం కంపెనీ నోటిఫికేషన్ ఇచ్చింది. టెండర్లు పిలిచి తక్కువ వడ్డీ ఆఫర్​చేసిన ఎస్​బీఐ నుంచి అప్పు తీసుకోవడం గమనార్హం.

సీఎండీ ఫెయిల్యూర్ తోనే...   

సింగరేణి నుంచి కొన్న బొగ్గుకు రూ. 10 వేల కోట్లు, సింగరేణి జైపూర్ పవర్ ప్లాంట్​ నుంచి కొన్న కరెంట్​కు 14 వేల కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది. వీటిని ప్రభుత్వం నుంచి ఇప్పించడంలో ప్రస్తుత సీఎండీ విఫలమవుతున్నారు. శ్రీధర్​ కంటే ముందు ఉన్న సీఎండీలు ఏడాదికి రూ.500 కోట్ల లాభాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి బాండ్ల ద్వారా వడ్డీ సంపాదిస్తే.. ఈ సీఎండీ హయాంలో వాటిని అమ్మేశారు. అవి పోగా ఇప్పుడు రూ.8 వేల కోట్ల అప్పు తెచ్చారు. వీటికి సింగరేణే నెలనెలా వడ్డీలు కట్టే పరిస్థితి ఏర్పడింది. 
- వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్  

సర్కార్ తీరుతోనే..

రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి కి రావాల్సిన బొగ్గు, విద్యుత్ బకాయిలు దాదాపు రూ.22 వేల కోట్ల దాకా ఉన్నాయి. వీటిని చెల్లించకపోవడం వల్లే సంస్థ దివాలా దిశగా వెళ్తోంది. ఒకప్పుడు లాభాల బాటలో పయనించిన సంస్థ.. ప్రస్తుతం రాజకీయ జోక్యం వల్ల క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను  తెప్పించడంలో సింగరేణి సీఎండీ శ్రీధర్ విఫలమవుతున్నారు. ఆయన వల్లే ఈ పరిస్థితి వచ్చింది.
- యాదరిగి సత్తయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం

సర్కారే దోచుకుంటోంది.. 

సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 22 వేల కోట్ల మేర బకాయి పడింది. వాటిని చెల్లించకపోవడంతో కంపెనీలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. నెలనెలా జీతాల కోసం యాజమాన్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతోంది. బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో ఏటా రూ.వెయ్యి కోట్లు వడ్డీ రూపంలో నష్టపోతోంది. కార్మికులు కష్టపడి కూడబెట్టిన డబ్బులను రాష్ట్ర  ప్రభుత్వం లూటీ చేస్తోంది. 
- మందా నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్