ఆఫీసర్​ వేధింపులతో కాంట్రాక్ట్​ వర్కర్ ​ఆత్మహత్యాయత్నం

ఆఫీసర్​ వేధింపులతో కాంట్రాక్ట్​ వర్కర్ ​ఆత్మహత్యాయత్నం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆఫీసర్​ వేధింపులతో సింగరేణి కొత్తగూడెంలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్ట్​ వర్కర్ ​ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలితో పాటు దళిత సంఘాల నాయకులు ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించారు. కొత్తగూడెం కార్పొరేట్​ ఏరియా సర్వే డిపార్ట్​మెంట్​లో నాలుగేండ్లుగా ఎన్. మంజుల కాంట్రాక్ట్​ వర్కర్​గా చేస్తోంది. కొద్ది రోజులుగా సర్వే డిపార్ట్​మెంట్​లోని జీఎం స్థాయి ఆఫీసర్​ ఆమెను వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. శనివారం ఆఫీస్​ఆవరణలో టాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఇది చూసిన తోటి వర్కర్స్​ఆమెను సింగరేణి మెయిన్​హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్లు ట్రీట్​మెంట్​చేస్తున్నారు. ఇన్​టైంలో ఆమెను హాస్పిటల్​కు తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని దళిత సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. దళిత మహిళా వర్కర్​ను వేధించిన ఆఫీసర్​పై చర్యలు తీసుకోవాలని మాదిగ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూసపాటి శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్​అసోసియేషన్​స్టేట్​ జనరల్​సెక్రటరీ అంతోటి నాగేశ్వర రావు, మహిళా సంఘం నాయకులు కె. రత్నకుమారి, బీఎస్పీ జిల్లా ప్రెసిడెంట్​యెర్రా కామేశ్​ డిమాండ్​ చేశారు.