ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
  •     25,26 తేదీల్లో సమ్మెకు విప్లవ కార్మిక సంఘాల పిలుపు
  •     కొత్తగూడెంలో కాంట్రాక్ట్​ కార్మికుల వంటా వార్పు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 9 నుంచి చేపట్టిన కాంట్రాక్ట్​ కార్మికుల సమ్మె 13వ రోజు బుధవారం కొనసాగింది.  కోల్​బెల్ట్​వ్యాప్తంగా కాంట్రాక్ట్​ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. కాంట్రాక్ట్​ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 25,26 తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు సమ్మెలో పాల్గొని కాంట్రాక్ట్​ కార్మికులకు మద్దతు ఇవ్వాలని విప్లవ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కొత్తగూడెం ఏరియా జీఎం ఆఫీస్​ ఎదుట కాంట్రాక్ట్​ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ఆటపాటాలతో ధర్నా చేపట్టారు. అనంతరం వంటా వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. కాంట్రాక్ట్​ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్​ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్​ కార్మిక హక్కుల పరిరక్షణ సంఘం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఇఫ్టూ, బీఎంఎస్​ సంఘాల నాయకులు పాల్గొన్నారు.  విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​లో జీఎం పర్సనల్​ ఆనందరావుకు వినతిపత్రం ఇచ్చారు. మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లో కాంట్రాక్ట్​ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. 

పుష్యమి వేళ రామయ్యకు పట్టాభిషేకం

భద్రాచలం, వెలుగు: పుష్యమి నక్షత్రం సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామికి బుధవారం పట్టాభిషేకం నిర్వహించారు. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి రామయ్యకు గర్భగుడిలో సుప్రభాత సేవ చేశారు. తర్వాత కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లారు. అక్కడ నిత్య కల్యాణ క్రతువు షురూ చేశారు. భక్తులు కంకణాలు ధరించి స్వామివారి విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం,ఆరాధన చేశారు. యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక జరిగింది. అనంతరం సమస్త నదీజలాలతో మండప వేదికను సంప్రోక్షణ చేశారు. కల్యాణ రామునికి రామదాసు సమర్పించిన బంగారు ఆభరణాలను అలంకరించారు. దండం, రాజముద్రిక తర్వాత కిరీటం అలంకరించి శ్రీరామమహాచక్రవర్తిగా ప్రకటించారు. పట్టాభిరామునికి అర్చకులు ప్రత్యేక హారతులు ఇచ్చారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.

 రామయ్యను దర్శించుకున్న కడియం శ్రీహరి

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బుధవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఈవో శివాజీ ఆధ్వర్యంలో అర్చకులు పరివట్టం కట్టి మేళతాళాలతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో మూలవరుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారి ప్రాంగణంలో పూజలనంతరం వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. కడియం శ్రీహరికి ఈవో శివాజీ ప్రసాదంతో పాటు జ్ఞాపికను బహూకరించారు. డీడీ సరస్వతి, తహసీల్దారు శ్రీనివాస్​యాదవ్​, టీఆర్ఎస్​ నియోజకవర్గ ఇన్​చార్జి డా.తెల్లం వెంకట్రావ్​ పాల్గొన్నారు. 

మణుగూరులో..  

మణుగూరు, వెలుగు: కాంట్రాక్ట్​ కార్మికులు బుధవారం మణుగూరు పట్టణ బంద్​కు పిలుపునిచ్చారు. అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బంద్ సక్సెస్ అయింది. కార్మికులు మణుగూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. వారికి సింగరేణి కార్మికులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ లీడర్లు మాట్లాడుతూ ఈనెల22న జరుగు చర్చలు న్యాయపరంగా లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆవునూరి మధు, వట్టం నారాయణ దొర, చలపతిరావు, మధుసూదన్ రెడ్డి, నాగేశ్వరరావు, సుధాకర్, నాగేశ్వరరావు, నరసింహారావు పాల్గొన్నారు.

పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి 

మంద కృష్ణ మాదిగ నేలకొండపల్లి, వెలుగు:  ఎస్.ఐ. స్రవంతి రెడ్డి కుల అహంకారం తో వ్యవహరిస్తున్నారని, ఆమెను కాపాడేందుకు ఎమ్మెల్యే, ఏసీపీ సీఐ లు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్​జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బుధవారం నేలకొండపల్లిలో మీడియాతో మాట్లాడుతూ నేలకొండపల్లిలో ఇటీవల దళితులు వినాయక నిమజ్జనం చేస్తుంటే వారిని దుర్భాషలాడిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఎస్ఐతోపాటు ఆమెను కాపాడుతున్న ఏసీపీ, సీఐలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలన్నారు. ఎమ్మెల్యే కు కులతత్వం ఎక్కువ అయిందని  రాబోయే రోజుల్లో రాజకీయంగా భూస్థాపితం చేస్తామని మందకృష్ణ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఎస్పీ ఉమ్మడి  జిల్లా ఇన్​చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు, ఏపూరి వెంకటేశ్వరావు, కూరపాటి సునిల్ , ఆనందరావు పాల్గొన్నారు.

‘తొలిమెట్టు’తో స్టూడెంట్స్​లో సామర్థ్యాల పెంపు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: తొలిమెట్టు కార్యక్రమంతో స్టూడెంట్స్​లో కనీస సామర్థ్యాల పెంపునకు ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్​ అనుదీప్​ పేర్కొన్నారు. బుధవారం స్కూళ్లలో తొలిమెట్టు అమలుపై కొత్తగూడెంలోని కలెక్టరేట్​లో విద్యాశాఖాధికారులు, నోడల్​ అధికారులతో కలెక్టర్ మీటింగ్​నిర్వహించారు. జిల్లాలోని 965 స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు కలెక్టర్​తెలిపారు. తొలిమెట్టు అమలుపై ప్రతి నెల ప్రగతి నివేదికలను అందజేయాలని ఆదేశించారు. జిల్లా అకడమిక్​ కో ఆర్డినేటర్​ నాగరాజ శేఖర్​ తొలిమెట్టు ప్రోగ్రాంపై పవర్​పాయింట్​ ప్రజంటేషన్​ ద్వారా వివరించారు. 

రేపు కొత్తగూడెంలో మెగా జాబ్​ మేళా 

కొత్తగూడెంలోని ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో శుక్రవారం మెగా జాబ్​మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్​ అనుదీప్​ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​ నిర్వహిస్తున్న టెక్​ బీ ప్రోగ్రాం కోసం 2021,22 లలో ఇంటర్మీడియట్​పూర్తి చేసుకున్న స్టూడెంట్స్​ జామ్​ మేళాలో పాల్గొనాలన్నారు. ఎంపీసీ, ఎంఈసీలలో 60శాతం మార్కులతో పాటు మ్యాథ్స్​లో 60శాతం మార్కులుండాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్​ సర్టిఫికెట్స్​, ఆధార్​కార్డు జిరాక్స్​లతో రావాలన్నారు. ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు హెచ్​సీఎల్​ ప్రతినిధి 8341405102 కు ఫోన్​ చేయాలని సూచించారు.

ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే... స.హ చట్టం దరఖాస్తులు

ఖమ్మం రూరల్​, వెలుగు: ప్రజా ప్రయోజనం కోసం స.హ. చట్టం ద్వారా కోరిన వివరాలను అధికారులు ఇవ్వాలని బీజేపీ కిసాన్​ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి కోరారు. బుధవారం తిరుమలాయపాలెం మండలంలో బీజేపీ మండల నాయకులతో కలసి ఎంపీడీఓ, అగ్రికల్చర్​ఆఫీసులలో స.హ.చట్టం ద్వారా దరఖాస్తులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని,  కేంద్ర నిధులు దుర్వినియోగం చేస్తూ బూటకపు మాటలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సహ చట్టం కింద సమాచారం కోరుతున్నట్లు శ్రీధర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెళ్లపల్లి నరేందర్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ సంతోష్ రెడ్డి,  మండలాధ్యక్షుడు బొడ్డుపల్లి ప్రసాద్, నూకల రామ్మోహన్ రెడ్డి, నల్లగట్టు శ్రీనివాస్, సందీప్ రెడ్డి పాల్గొన్నారు. 

బైండోవర్ ఉల్లంఘించిన మహిళకు జైలు  

కామేపల్లి, వెలుగు: బైండోవర్​ఉల్లంఘించిన మహిళకు కామేపల్లి తహసీల్దార్ 213 రోజులు జైలు శిక్ష విధించినట్లు కారేపల్లి ఎక్సైజ్​సీఐ జుల్పీకర్​అహ్మద్​బుధవారం తెలిపారు. మండల పరిధిలోని టేకులతండాకు చెందిన బానోత్ హిరానీ(45) గుడుంబా అమ్ముతూ పట్టుబడగా.. తహసీల్దార్ వద్ద  హాజరు పరిచారు. తాను గుడుంబా తయారుచేయనని ఆమె చెప్పడంతో రూ.లక్ష బైండోవర్ విధించారు. తిరిగి గుడుంబా తయారు చేయడంతో ఎక్సైజ్​ పోలీసులు తహసీల్దార్ ​ముందు హాజరుపరచగా పై విధంగా శిక్ష విధించారు. 

పొంగులేటి పర్యటన

ఇల్లందు, వెలుగు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఇల్లందు పట్టణం, మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మండలంలోని బొజ్జయిగూడెం సమ్మక్క--సారక్క గద్దె నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో కలసి పాల్గొన్నారు. అనంతరం ఇల్లందులో ఆయన మాట్లాడుతూ ఎటువంటి పదవి లేకున్నా ప్రజల మనిషిగా నన్ను ఆదరిస్తున్న తీరును చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తెలిపారు. త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని నన్ను నమ్ముకుని ఉన్నా ప్రతిఒక్క కార్యకర్తకు, నాయకుడికి, అభిమానికి సరైన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు షురూ

సరిహద్దుల్లో బ్యానర్లు కట్టిన నక్సల్స్

భద్రాచలం, వెలుగు: భద్రాచలం మన్యంలో తెలంగాణ-– చత్తీస్​గఢ్​సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మావోయిస్టు దళాలు సరిహద్దు గ్రామాల్లో భారీ ఎత్తున బ్యానర్లు కట్టి, ఊరూరా కళారూపాలు ప్రదర్శించారు. ఆదివాసీలను సమీకరించి సభలు పెట్టారు. పోలీసుల కన్నుగప్పి దండకారణ్యంలో ఉత్సవాలు నిర్వహించారు. వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు కూంబింగ్​ ఆపరేషన్​  నిర్వహించారు. గోదావరి పరివాహకంలోని భద్రాద్రికొత్తగూడెం, ములుగు, జయశంకర్​భూపాలపల్లి జిల్లాల్లో రెడ్​ అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కదలికపై నిఘా పెంచారు. భద్రాచలం డివిజన్​లోని చర్ల, దుమ్ముగూడెం మండలాలలో పోలీసుస్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు.  పోలీసులను లక్ష్యంగా చేసుకుని చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెట్టిన మందుపాతరలు పేలి పశువులు గాయపడ్డాయి. 

మావోయిస్టు పార్టీ ఆదరణ కోల్పోయింది: ఏఎస్పీ రోహిత్ రాజు

తెలంగాణలో మావోయిస్టు పార్టీ ఆదరణ కోల్పోయిందని భద్రాచలం ఏఎస్పీ రోహిత్​రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మావోయిస్టులు అమాయకులైన ఆదివాసీలపై దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల చర్ల మండలం కుర్నపల్లి ఉపసర్పంచ్​ ఇర్పా రాముడిని చంపేశారన్నారు. ప్రజలు, పశువులు సంచరించే ప్రాంతంలో ల్యాండ్​మైన్స్ , ప్రెషర్​ బాంబులు, ఐఈడీలు అమర్చి ప్రజావ్యతిరేక పనులకు పాల్పడుతున్నారన్నారు. 

కొత్తగూడెంలో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే డబుల్​బెడ్రూం ఇండ్లను ఆక్రమిస్తామని రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్​ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ కొత్తగూడెంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ  నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం కలెక్టరేట్​ ఎదుట నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇండ్ల స్థలం ఉన్న పేదలకు రూ. 5లక్షలు ఇవ్వాలని, స్థలం లేని వారికి ఇండ్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీపీఎం, లీడర్లు కాసాని ఐలయ్య, వెంకటేశ్వర్లు, ఏజే రమేశ్, సత్యనారాయణ, ఎం.జ్యోతి పాల్గొన్నారు. 

ప్రైవేట్​ దవాఖానాలను తనిఖీ చేయాలి

భద్రాద్రికొత్తగూడెం: రాష్ట్రంలోని ప్రైవేట్​హాస్పిటల్స్, డయాగ్నస్టిక్స్ తో పాటు అన్ని రకాల హెల్త్​క్లినిక్స్​పై డీఎంహెచ్​ఓలు, డిప్యూటీ డీఎంహెచ్​ఓలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు తనిఖీలు చేయాలని  డైరెక్టర్​ ఆఫ్​ హెల్త్​ జి.శ్రీనివాసరావు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.  ప్రైవేటు హాస్పిటల్స్​, డయాగ్నస్టిక్స్​ , క్లినికల్​సెంటర్లు  రూల్స్​ పాటిస్తున్నాయో లేదో తనిఖీ చేసి 10 రోజుల్లో తనకు నివేదికలు ఇవ్వాలన్నారు. 

హాస్టళ్లలో క్వాలిటీ భోజనం పెట్టాలి

పాల్వంచ,వెలుగు: హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆదేశించారు.  బుధవారం స్థానిక నెహ్రూ నగర్ గిరిజన ఆశ్రమ స్కూల్​ను తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని రుచి చూశారు. పప్పు, పెరుగు నీళ్లలా ఉన్నాయని.. ఇలా ఉంటే విద్యార్థులు ఎలా తింటారని వార్డెన్ హరిసింగ్, హెచ్ఎం నందాలను ప్రశ్నించారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాసరావు, జడ్పీటీసీ బరపటి వాసు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎం రాజు గౌడ్ పాల్గొన్నారు. 

సంక్షేమ పథకాల్లో తెలంగాణ ఫస్ట్

​కల్లూరు, వైరా, వెలుగు: సంక్షేమ పథకాల అమలులో దేశంలో  తెలంగాణ ఫస్ట్​ ప్లేస్​లో ఉందని సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్​పేర్కొన్నారు. బుధవారం కల్లూరు, వైరా మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు వేర్వేరుగా పాల్గొన్నారు. కల్లూరు మండలంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలు గ్రామాలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘు, జడ్పీటీసీ అజయ్ కుమార్, రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వైరా మండలంలో సీఎం రిలీఫ్​ఫండ్, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఆసరా పింఛన్లను ఎమ్మెల్యే రాములునాయక్​పంపిణీ చేశారు. రాష్ట్ర మార్క్​ఫెడ్​వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్  జైపాల్, రత్నం, ఎంపీపీ పావని, లీడర్లు పాల్గొన్నారు.

కేసులను సమగ్రంగా విచారించాలి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: క్వాలిటీ ఇన్వెస్టిగేషన్​ చేసి నిందితులకు శిక్షలు పడేలా చూడాలని ఎస్పీ వినీత్​ సూచించారు. కొత్తగూడెంలోని జిల్లా ఎస్పీ ఆఫీస్​లో పోలీస్​ అధికారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్​ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ చూపిన పోలీసులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. మీటింగ్​లో భద్రాచలం ఏఎస్పీ రోహిత్​ రాజ్​, డీఎస్పీలు వెంకటేశ్వరబాబు, రమణమూర్తి, నందీరామ్, ఇన్​స్పెక్టర్​ఉపేందర్​, షీటీం ఇన్​స్పెక్టర్​ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

ప్రజలు మాపై నమ్మకంతోనే పట్టం కట్టారు 

ఖమ్మం రూరల్, వెలుగు: 30 ఏళ్ల క్రితం రెండెకరాల భూమి కూడా లేని నీకు, రేషన్​ డీలర్​ స్థాయి నుంచి నేడు రూ. 200 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని సీసీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్​పై టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, ఎంపీపీ ఉమ మండిపడ్డారు. బుధవారం జలగంనగర్​లోని ఎంపీడీవో ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చాక సొంత భూమిని అమ్ముకున్నాం తప్ప ఒక్క ఎకరం కూడా కొనలేదన్నారు. సొంత గ్రామం ఏదులాపురంలో దండి సురేశ్​ గొడవలు సృష్టించి సెటిల్​మెంట్​పేరుతో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశాడని ఆరోపించారు. గుర్రాలపాడు రెవెన్యూ పరిధిలో 33 సర్వే నెంబర్​లో 11. 27  ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. జడ్పీటీసీ వరప్రసాద్, సుడా డైరెక్టర్​ సంజీవరెడ్డి, వైస్​ ఎంపీపీ దర్గయ్య, కృష్ణారావు, వెంకన్న పాల్గొన్నారు.