సింగరేణి ఎన్నికల్లో INTUC vs AITUC.. గుర్తింపు దక్కేదెవరికో.?

సింగరేణి ఎన్నికల్లో INTUC vs  AITUC.. గుర్తింపు దక్కేదెవరికో.?
  • సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో13 యూనియన్లు
  • కాడి వదిలేసిన టీబీజీకేఎస్.. ఏఐటీయూసీకి మద్దతుగా తీర్మానాలు
  • ఇయ్యాల ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్​
  • రాత్రి ఏడు గంటల నుంచి కౌంటింగ్‌‌
  • తొలి ఫలితం ఇల్లందు.. చివరి ఫలితం శ్రీరాంపూర్


గోదావరిఖని/కొత్తగూడెం, వెలుగు:సింగరేణిలో ‘గుర్తింపు కార్మిక సంఘం’ హోదా కోసం జరుగుతోన్న ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్​టీయూసీ నడుమ హోరాహోరీ పోటీ కొనసాగనుంది. ఈ రెండు యూనియన్లకు బలమైన క్యాడర్ ఉండడం, మాతృపార్టీల లీడర్లు ముమ్మర ప్రచారం నిర్వహించడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌‌‌‌) పోలింగ్​కు సరిగ్గా 12 గంటల ముందు కాడివదిలేసింది. మంగళవారం రాత్రి ఏరియా కమిటీలు ఎక్కడికక్కడ ప్రత్యేక సమావేశాలు పెట్టుకొని ఏఐటీయూసీ యూనియన్‌‌‌‌కు మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేశాయి. 

సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్‌‌‌‌ కేంద్రాల్లో జరగనున్న ఎన్నికల్లో 39,773 మంది గని కార్మికులు బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పోలింగ్‌‌‌‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తర్వాత ఎనిమిది కౌంటింగ్‌‌‌‌ కేంద్రాల్లో రాత్రి ఏడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. 618 మంది ఓటర్లు ఉన్న ఇల్లందు నుంచి తొలి ఫలితం వెలువడనుంది. 9వేల కు పైగా ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్​ నుంచి తుదిఫలితం వస్తుంది. కాగా ఈ సారి రౌండ్ల వారీగా ఫలితాలు చెప్పకుండా ఒకే సారి తుది ఫలితాన్ని వెల్లడించాలని లేబర్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ నిర్ణయం తీసుకున్నారు.

రెండు యూనియన్ల మధ్య నువ్వా నేనా

ఈ ఎన్నికల్లో 13 ట్రేడ్‌‌‌‌ యూనియన్లు పోటీ పడుతున్నాయి. కోల్​బెల్ట్ వ్యాప్తంగా ఉన్న 11 డివిజన్లలో ఏ యూనియన్‌‌‌‌ ఎక్కువ డివిజన్లలో గెలుస్తుందో ఆ యూనియన్‌‌‌‌కు ‘గుర్తింపు సంఘం’ హోదా లభిస్తుంది. డివిజన్ల వారీగా గెలిచిన యూనియన్లకు ‘ప్రాతినిధ్య సంఘం’ హోదాను కల్పిస్తారు. ఎన్నికల రిటర్నింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, డిప్యూటీ చీఫ్ లేబర్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ (సెంట్రల్‌‌‌‌) డి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆరు జిల్లాల వ్యాప్తంగా అసిస్టెంట్‌‌‌‌ లేబర్‌‌‌‌ కమిషనర్ల పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, గతంలో గుర్తింపు కార్మిక సంఘాలుగా వ్యవహరించిన ఏఐటీయూసీ, ఐఎన్‌‌‌‌టీయూసీ యూనియన్ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్నది. ఈ రెండు యూనియన్లకు మొదటి నుంచి బలమైన క్యాడర్‌‌ ఉంది. దీనికితోడు ఐఎన్‌‌‌‌టీయూసీకి టీఎన్‌‌టీయూసీ యూనియన్‌‌‌‌ మద్దతు తెలపగా, పలు యూనియన్ల నుంచి పెద్ద సంఖ్యలో చేరికలతో బలం పెరిగినట్లయ్యింది. అధికార కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి చెందిన కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌ ఏరియా మంత్రులు, ఎమ్మెల్యేల బలం కూడా ఐఎన్‌‌‌‌టీయూసీకి తోడైంది.

జెండాలు కూడా కట్టలేని స్థితికి టీబీజీకేఎస్‌‌‌‌

ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ బలం సరిపోని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అనుబంధ టీబీజీకేఎస్‌‌ ఎన్నికలకు సరిగ్గా 12 గంటల ముందు కీలక నిర్ణయం తీసుకున్నది. మంగళవారం రాత్రి ఏరియాల కమిటీలు ప్రత్యేక మీటింగ్​లు పెట్టుకొని ఏఐటీయూసీ యూనియన్‌‌‌‌కు మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేశాయి. బీఆర్ఎస్ హైకమాండ్​తీరుకు నిరసనగా టీబీజీకేఎస్‌‌‌‌ అగ్రనేతలు బి.వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య తమ పదవులకు రాజీనామా చేయడంతో టీబీజీకేఎస్‌‌‌‌ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్​ సూచన మేరకు ఏఐటీయూసీకి మద్దతుగా తీర్మానాలు చేశాయి. కీలక నేతల రాజీనామా తర్వాత పెద్ద సంఖ్యలో క్యాడర్‌‌‌‌ ఇతర యూనియన్లలో చేరిపోయింది. టీబీజీకేఎస్‌‌‌‌ పోటీ చేస్తుందని, ఆత్మసాక్షిగా కార్మికులు ఓటు వేయాలని ఆ యూనియన్‌‌‌‌ గౌరవాధ్యక్షురాలిగా కవిత ప్రకటించారే తప్ప ఎక్కడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించలేదు. బొగ్గు గనులపై కనీసం గులాబీ జండాలను కూడా కట్టలేని స్థితికి ఆ యూనియన్‌‌‌‌ చేరింది.