అంతర్జాతీయ ఖనిజాల రంగంలోకి సింగరేణి.. ‘సింగరేణి గ్లోబల్’ పేరుతో ఎంటర్: డిప్యూటీ సీఎం భట్టి

అంతర్జాతీయ ఖనిజాల రంగంలోకి సింగరేణి.. ‘సింగరేణి గ్లోబల్’ పేరుతో ఎంటర్: డిప్యూటీ సీఎం భట్టి
  • గోల్డ్, కాపర్​ అన్వేషణకు సంస్థ లైసెన్స్ పొందింది​
  • గ్రీన్  ఎనర్జీ దిశగా సోలార్​, పంప్డ్​ స్టోరేజీ ప్రాజెక్టులు
  • బొగ్గు గనుల వేలంలో సంస్థ పాల్గొనేలా  సర్కారు కీలక నిర్ణయం
  • కోల్‌‌ బ్లాకులు సాధిస్తేనే సంస్థకు మనుగడని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  సింగరేణి.. కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థగానే కాకుండా..థర్మల్ విద్యుత్, సోలార్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లోకి విస్తరిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కీలక ఖనిజాలకు దేశీయ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. ‘సింగరేణి గ్లోబల్’ పేరుతో అంతర్జాతీయంగా ఖనిజ రంగంలోకి ప్రవేశిస్తున్నామని ప్రకటించారు. శుక్రవారం (సెప్టెంబర్ 12) సెక్రటేరియెట్‌‌లో సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. 

‘సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్’ పేరిట సోలార్, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, దీని కోసం కన్సల్టెన్సీ నియమించామని చెప్పారు.  ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు ఉన్న ప్రదేశాలను పరిశీలించేందుకు ఏజెన్సీలను నియమించామని, ఆ సూచనల ఆధారంగా ఉత్పత్తి ప్రారంభిస్తామని వెల్లడించారు. 

వ్యాపార విస్తరణలో భాగంగా కర్నాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ్ ప్రాంతంలో బంగారం, రాగి అన్వేషణకు 37.75 శాతం రాయల్టీతో లైసెన్స్‌‌ సాధించినట్టు తెలిపారు. ఈ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, ఆ తర్వాత గనులు ఎవరు చేపట్టినా సింగరేణికి పూర్తి కాలం 37.75 శాతం రాయల్టీ చెల్లిస్తారని, ఇది సంస్థకు ఆర్థికంగా లాభదాయకమని చెప్పారు.

వేలం పాటల్లోకి సింగరేణి

ఇకపై జరిగే బొగ్గు, ఇతర ఖనిజ గనుల వేలం పాటల్లో సింగరేణి పాల్గొనేలా రాష్ట్ర  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో సింగరేణి  వేలంపాటల్లో పాల్గొనకపోవడంతో రెండు పెద్ద బొగ్గు బ్లాకులు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోయాయని, సంస్థ రూ.60 వేల కోట్ల రెవెన్యూ, రూ.15 వేల కోట్ల లాభాలు కోల్పోయిందని వెల్లడించారు. వేలంలో సింగరేణి పాల్గొనకపోతే అది ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చుతుందని చెప్పారు. 

సత్తుపల్లి, కోయగూడెం బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకు దక్కడంతో ఈ నష్టం జరిగిందని, ఇది ఘోర తప్పిదమని అన్నారు. సింగరేణి బోర్డు, కార్మిక సంఘాలు ఈ వేలంపాటల్లో పాల్గొనాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయని తెలిపారు. సింగరేణిపై ఆధారపడి ఉన్న 40 వేల మంది కార్మికులు, 30 వేల మంది పరోక్ష సేవల సిబ్బంది భవిష్యత్తు, సంస్థ మనుగడ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రస్తుతం 38 గనుల్లో బొగ్గు నిల్వలు తగ్గుతున్నందున మరో ఐదేండ్లలో 10 గనులు మూసివేయాల్సి వస్తుందని, అప్పుడు 8 వేల మంది ఉద్యోగులు అదనంగా ఉంటారని హెచ్చరించారు. 

ప్రస్తుతం 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి సగానికి తగ్గే ప్రమాదం ఉందని, కొత్త బ్లాకులు సాధించకపోతే సింగరేణికి గడ్డుకాలం వస్తుందని చెప్పారు.  దేశంలోని ఇతర రాష్ట్ర, కేంద్ర సంస్థలు ఈ వేలంపాటల్లో పాల్గొంటున్నప్పుడు సింగరేణి పాల్గొంటే తప్పేంటని ప్రశ్నించారు. ప్రైవేటు సంస్థలకు గనులు దక్కినా రాష్ట్రానికి రాయల్టీ వస్తుంది కానీ, సింగరేణికి దక్కితే 70 వేల మంది సిబ్బంది ఉద్యోగ భద్రత పెరుగుతుందని అన్నారు.

కొత్త బ్లాక్​లు లేకపోవడం సమస్యే: సీఎండీ బలరాం

ప్రస్తుత 38 గనుల్లో తగ్గుతున్న బొగ్గు నిల్వలు, ఉత్పత్తిలో ఎదురవుతున్న  సవాళ్లను  సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్  వివరించారు. సంస్థకు 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం, నైపుణ్యవంతమైన సిబ్బంది ఉన్నప్పటికీ.. కొత్త బ్లాకులు లేకపోవడం సమస్యేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇకపై వేలం పాటల్లో పాల్గొని, కొత్త బ్లాకులు చేపట్టడానికి అవకాశం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సింగరేణిని  బతికించుకోవాలి

సింగరేణిని బతికించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని కార్మిక సంఘాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.  సంస్థను బతికించుకోకపోతే భవిష్యత్తు తరాలకు ఏమీ ఇవ్వలేమని అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్‌‌లో సింగరేణి కార్మిక సంఘాలతో భట్టి విక్రమార్క సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణిని పది కాలాలపాటు కాపాడుకునేందుకు ఏం చేయాలో కార్మిక సంఘాలు ఆలోచించాలని అన్నారు. 

మారిన ఆర్థిక పరిస్థితులు, ఓపెన్ మార్కెట్‌‌లో బొగ్గు కొనుగోలు చేసే పరిస్థితి, పోటీలో నిలబడాలంటే ఏం చేయాలి అనే విషయాలను కార్మికులకు వివరించాలని అధికారులకు సూచించారు. కార్మిక సంఘాలు అవగాహన లేకుండా మాట్లాడితే సంస్థకు నష్టం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక ప్రసాద్, కార్మిక సంఘం నాయకులు ధర్మపురి, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.